పూర్తికాని ఉద్యోగుల విభజన

హైదరాబాద్: రాష్ట్రం ఏర్పాటై  ఏడాది కావస్తోన్నా, ఉద్యోగుల విభజన ఇంకా పూర్తి కాలేదు. ఏ రాష్ట్రానికి చెందిన ఉద్యోగులు అదే రాష్ట్రంలో పనిచేయడం లేదు. ఉద్యోగుల విభజనపై ఏర్పాటు చేసిన కమల్ నాథన్ కమిటీకి ఉద్యోగులు సహాకరించడం లేదు. ఆయా శాఖలకు చెందిన ఉద్యోగుల కమిటీకి సమాచారం ఇవ్వడం లేదు. సమాచారం ఇవ్వని ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేని పక్షంలో ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరిస్తున్నారు.

ఆంద్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఉద్యోగుల విభజన కోసం కేంద్ర ప్రభుత్వం కమల్ నాథన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కేవలం 58 వేల మంది ఉద్యోగులను విభజిస్తోంది. రాష్ట్ర స్థాయి ఉద్యోగులు, డైరెక్టరేట్, కమీషనరేట్, సెక్రటేరియట్ లలో పనిచేసే ఉద్యోగులను మాత్రమే కమల్ నాథన్ కమిటీ విభజించనుంది. జిల్లా, జోనల్, మల్టీ జోనల్ లోని ఉద్యోగుల విభజన మాత్రం ఈ కమిటీ పరిధిలోకి రాదు. అయితే తన పరిధిలోని 58 వేల ఉద్యోగుల విభజన ప్రక్రియ కోసం కమల్ నాథన్ కమిటీ  పనిచేస్తోంది. అయితే సచివాలయంలోని  89 శాఖల్లోని 33 శాఖల్లోని ఉద్యోగులకు చెందిన సమాచారం మాత్రమే కమిటీకి చేరింది. జూన్ నాటికి ఉద్యోగుల విభజనను  పూర్తి చేయాలని లేకపోతే డిల్లీకి వెళ్ళైనా తాడో పేడో తేల్చుకొంటామని తెలంగాణ ఉద్యోగుల సంఘం నాయకులు పేర్కొంటున్నారు.

రాష్ట్ర విభజన సమయంలో ఆర్డర్ టూ సర్వ్ పేరుతో ఉద్యోగులను కేటాయించారు. ఉద్యోగుల కేటాయింపు అశాస్త్రీయంగా జరిగిందని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి. ఆర్డర్ టూ సర్వ్ ప్రకారంగా తెలంగాణకు చెందిన సుమారు 600 లకు పైగా ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్నారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఉద్యోగులు కూడ తెలంగాణలో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పనిచేసే తెలంగాణ ఉద్యోగుల్లో ఎక్కువగా నాలుగవ తరగతి ఉద్యోగులున్నారు. ఉద్యోగుల విభజన పూర్తి కాకపోవడంతో, తెలంగాణలో ప్రమోషన్లు, నియామకాల విషయంలో కూడా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. స్వంత రాష్ట్రంలో పనిచేసేందుకు వీలుగా రెండు ప్రభుత్వాలు చొరవచూపాలని ఉద్యోగస్తులు కోరుతున్నారు. దీంతో పాటు ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు స్థానికేతరులను గుర్తించి, వారి స్వస్థలాలకు పంపాలని కూడా వారు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కు వెళ్ళేందుకు సానుకూలంగా ఉన్న ఉద్యోగులను వెంటనే ఆ రాష్ట్రానికి పంపేందుకు చర్యలు తీసుకోవాలని ఉద్యోగసంఘాల నాయకులు కోరుతున్నారు.

జూన్ ఒకటవ తేదికి ముందుగా ఉన్న ఖాళీల్లో మాత్రమే పరిగణనలోకి తీసుకొంటామని తొలుత కమల్ నాథన్ కమిటీ చెప్పింది. అయితే జూన్ రెండవ తేది తర్వాత ఏర్పడిన ఖాళీలను కూడా పరిగణనలోకి తీసుకొనేందుకు కమల్ నాథన్ కమిటీ సానుకూలంగా స్పందించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సును 60 ఏళ్ళకు పెంచింది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల ఖాళీలు ఏర్పడడం లేదు. తెలంగాణలో ఉద్యోగుల ఉద్యోగవిరమణ వయస్సును మాత్రం పెంచలేదు. దీంతో తెలంగాణలో ఖాళీలు ఏర్పడుతున్నాయి. తెలంగాణకు చెందిన  ఎ.ఎస్. ఓ  లు 75 మంది ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్నారు. గత ఏడాది జూన్ తర్వాత తెలంగాణలో 35 ఎ.ఎస్.ఓ పోస్టులు ఖాళీలు ఏర్పడ్డాయి. స్వంత రాష్ట్రానికి చెందిన వారిని స్వంత రాష్ట్రంలో పనిచేయించుకొనే పరిస్థితి లేదు, అటు కొత్తగా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు.

ఏడాది కావస్తోన్నా ఉద్యోగుల విభజన పూర్తి కాలేదు. విభజన ప్రక్రియ తంతుగా సాగుతోందని తెలంగాణ ఉద్యోగసంఘాలు ఆరోపిస్తున్నాయి. స్థానికేతర ఉద్యోగులను తరలించకపోతే ఆందోళనకు దిగుతామని ఉద్యోగ సంఘాల వారు హెచ్చరిస్తున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.