పెద్దలను గౌరవించే సంస్కారం ఉండాలి : కేసీఆర్

kcr-medak1-29

మెదక్ జిల్లా ముప్పిరెడ్డిపల్లిలో శాంతాబయోటెక్ ఏర్పాటు చేయనున్న ఇన్సులిన్ పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు

హైదరాబాద్, జనవరి 29: మంచిని గుర్తించి మంచిని వ్యాప్తిచేసే పెద్దలను గౌరవించే సంస్కారం ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అన్నారు. మెదక్ జిల్లా ముప్పిరెడ్డిపల్లిలో శాంతాబయోటెక్ ఏర్పాటు చేయనున్న ఇన్సులిన్ పరిశ్రమకు గురువారం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రూ 850 లకు మార్కెట్ లో దొరికే ఇన్సులిన్ ను, రూ 150 లకే ప్రజలకు అందుబాటులో తేవాలన్న శాంతాబయోటెక్ అధినేత వరప్రసాదరెడ్డి సంకల్పం గొప్పదన్నారు. ఇంత గొప్ప ప్రతిభా పాటవాలు కలిగి, పట్టుదల ఉండి నిస్వార్ధమైన సేవ చేసిన వరప్రసాదరెడ్డి దేశంలో అరుదైన వ్యక్తుల్లో ఒకరని కొనియాడారు.

భారతీయ తత్వాన్ని, సంస్కృతిని నిలబెట్టుకుంటూనే గొప్పగా బతకాలనే జీవితాన్ని ఆచరించి చూపిస్తున్న వ్యక్తి వరప్రసాదరెడ్డి అభినందనీయులు, ఆదర్శప్రాయులన్నారు. బంగారు తెలంగాణకు నలుగురు వరప్రసాదరెడ్డీలు ఉంటే బంగారు తెలంగాణే కాదు, ఇది వజ్రాల తెలంగాణ అవుతుందన్నారు. హిందూ సమాజంలో ఉన్న వెలితిని పారద్రోలి అంతర్జాతీయ వేదిక మీద మళ్లీ భారతావని తలఎత్తుకినే విధంగా, గర్వంగా చెప్పుకోవాలంటే అంకితభావం కలిగిన వ్యక్తులే కావాలి. అటువంటి అంకితభావం కలిగిన వ్యక్తులు కావాలి. 30 వేల కోట్లకు తన స్థితిని పెంచుకోగలిగే సామర్ధ్యం ఉండి కూడా కేవలం రూ 350 కోట్లకు తన లాభాన్ని పరిమితం చేసుకున్నవరప్రసాదరెడ్డి సమాజం కోసం పుట్టిన వారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదన్నారు. 6 వేలకు దొరికే కలరా వ్యాక్సిన్ ను కేవలం 200 రూపాయలకే ప్రజల అందుబాటులోకి తెచ్చారన్నారు. ఎంతో విలువైన మందులు తయారుచేసి చాలా తక్కువ ధరకు ప్రజల అందబాటులోకి తెచ్చారు.

ఇన్సులిన్ పరిశ్రమను 469 కోట్లతో శాంతాబయోటెక్ ప్రారంభిస్తుందని కేసీఆర్ తెలిపారు. రాబోయే రోజుల్లో మరో రూ 2 వేల కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. పరిశ్రమ స్థాపనలో 500 మందికి మొదటి దశలో ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. రాబోయే రోజుల్లో మరో 2000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని కేసీఆర్ తెలిపారు. ఇన్సులిన్ పరిశ్రమ నిర్వహణ విషయంలోగాని ఇతరత్రా విషయంలోగాని వరప్రసాదరెడ్డికి సహకారం అందించాలని స్థానిక నాయకులను, జిల్లా మంత్రిని కేసీఆర్ కోరారు. సంస్థ బాగా అభివృద్ధి చెంది ఇన్సుమన్ దేశానికి, ప్రపంచానికి వీలైనంత త్వరలో అందుబాటులోకి వచ్చి ప్రజలకు ఒక గొప్ప వరంగా పరిణమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, జూపల్లి కృష్ణారావు, ఉప సభాపతి పద్మాదేవేందర్ రెడ్డి, శాంతా బయోటెక్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.