పేదవారందరికీ సొంత ఇల్లు నిర్మించడం ప్రభుత్వ లక్ష్యం : ఇంద్రకరణ్ రెడ్డి

indra karan reddy-6 sa

హైదరాబాద్, జనవరి 5: రాబోయే ఐదు సంవత్సరాల్లో 10 లక్షల గృహాలను నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు. సచివాలయంలో గృహనిర్మాణశాఖ అధికారులతో సోమవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పేదవారందరికీ సొంత ఇల్లు కల్పించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష మేరకు ప్రతి సంవత్సరానికి రెండు లక్షల ఇండ్ల చొప్పున, ఒక్కొక్క ఇంటికి రూ.3.50 లక్షల వ్యయంతో చేపట్టే డబుల్ బెడ్‌రూం ఇండ్ల పథకాన్ని ఫిబ్రవరిలో ప్రారంభించనున్నట్లు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు.

ఇందుకోసం రూ.1000 కోట్లు ఈ ఏడాది బడ్జెట్‌లో కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు. డబుల్ బెడ్‌రూం పథకం ఇప్పటికే హైదరాబాద్‌లో ప్రారంభమైందని, త్వరలో నిజామాబాద్ జిల్లాలోనూ ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 490 చదరపు అడుగుల స్థలంలో డబుల్ బెడ్‌రూం ఇంటి నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందనే విషయమై ఇప్పటికే అధికారులు అంచనాలు రూపొందించినట్లు తెలిపారు.

రాష్ట్రంలో 1980 నుంచి ఇప్పటివరకు హౌజింగ్ కార్పొరేషన్ ద్వారా 42 లక్షల ఇండ్లను నిర్మించారని, 8 లక్షల ఇండ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉందని వివరించారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలను కాంట్రాక్ట్ పద్ధతిలో కాకుండా లబ్ధిదారుడు నిర్మించుకొనే విషయమై ప్రభుత్వంయోచిస్తున్నదన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం కోసం గ్రామస్థాయిలో అవసరమైన భూసేకరణ చేపడుతామని మంత్రి తెలిపారు. సమావేశంలో గృహనిర్మాణశాఖ ఎండీ బుర్ర వెంకటేశం, ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.