పోలీసుల పనిఒత్తిడి తగ్గించడానికి చర్యలు – ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్: పోలీసులపై ఒత్తిడి పెరిగిందని, వారి పనిఒత్తిడి తగ్గించడానికి తమ ప్రభుత్వం చర్యలు చెప్పటిందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని గోషామహల్ పోలీస్ స్టేడియంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. డీజిపి ప్రాసాదరావు తో పాటు ఇతర ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మూడు సంవత్సరాల కాలంలో 28 వేల మంది  కానిస్టేబుళ్లను నియమించినట్లు తెలిపారు.  ముందుగా అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి ముఖ్యమంత్రి శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మట్లాడుతూ మన వ్యవస్థలో పోలీస్ శాఖపై ప్రత్యేక దృష్టి ఉంటుందని, కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఎవరో ఒకరు చేసే తప్పుతో మొత్తం పోలీస్ వ్యవస్థకే చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పోలీస్ అంటే దేశంలో మంచి పేరుందని, ముందు ముందు దేశంలోనే అగ్రగామిగా నిలిచే విధంగా కృషి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అనంతరం ఈ యేడాది దేశవ్యాప్తంగా మరణించిన 576 మంది పోలీసుల ఆత్మకు శాంతి చేకూరాలంటూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ వారు ప్రచురించిన `అమరులు వారు` అనే పుస్తకాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం దేశవ్యాప్తంగా అమరులైన 576 మంది పోలీసుల పేర్లను చదివి వినిపించారు. ఈ సందర్భంగా డీజిపి ప్రసాదరావు మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలను కూడా త్యాగం చేయడానికి పోలీసులు సిద్దంగా ఉంటారని తెలిపారు. నిత్యం పని ఒత్తిడితో పోలీసులు అనారోగ్యానికి గురవుతున్నారని, వారికి రెండు సంవత్సరాలకు ఒకసారి ఉచిత వైద్యపరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు. పోలీస్ క్వార్టర్ల మరమ్మత్తుకు బడ్జెట్ ను కేటాయించాలని డీజిపి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.