ప్రజలకు అనుగుణంగా మోడీ ప్రభుత్వం : జవదేకర్

హైదరాబాద్, సెప్టెంబర్ 11: ప్రజలకు అనుగుణంగా మోడీ ప్రభుత్వం ముందుకు పోతుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేవకర్ అన్నారు. నాంపల్లిలోని బీజేపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోడీ 100 రోజుల పాలనను దేశ ప్రజలు ఆదరించారని చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో నడుస్తోందని, అభివృద్ధి కోసమే ప్రజలు మోడీకి ఓటేశారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. మోడీ పాలనపై దేశ ప్రజలకు విశ్వాసం కలిగిందన్నారు. అవినీతి రహిత పాలన అందిస్తామన్న విశ్వాసం ప్రజల్లో కలిగిందన్నారు. అదే విధంగా విద్యార్థులకు మంచి చేయడమే తమ లక్ష్యమన్నారు.

పర్యావరణ శాఖలో ఏళ్ల తరబడి ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. పర్యావరణ అనుమతులు ఇవ్వటమే గత ప్రభుత్వం మానేసిందని, అనుమతుల ఆలస్యం వల్ల పెట్టుబడిదారులు ఇబ్బంది పడ్డారని మంత్రి తెలిపారు. కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఫైళ్లన్నీ కొద్ది రోజుల్లోనే పూర్తి చేశామన్నారు. పర్యావరణానికి నష్టం లేకుండానే అభివృద్ధి అన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

తెలంగాణలో రెండు టీవీ ఛానళ్ల ప్రసారాలు నిలిపివేసిన విషయాన్ని మీడియా ప్రతినిధులు జవదేకర్ దృష్టికి తెచ్చారు. దీనిపై జవదేకర్ స్పందిస్తూ.. మీడియా స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి ఆత్మ వంటిదని వ్యాఖ్యానించారు. ఎంఎస్ ఓల తీరును పరిశీలిస్తున్నామని, అందరితో చర్చించి ప్రసారాల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని మంత్రి జవదేకర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.