ప్రజల భాగస్వామ్యంతోనే రాజధాని నిర్మాణం జరగాలి : చంద్రబాబు

హైదరాబాద్, నవంబర్ 8: “ప్రజలు లేకుండా రాజధానులు రాలేదు. రాష్ట్రంలో అన్ని జిల్లాలను అభివృద్ది చేయడానికి కట్టుబడి ఉన్నాను. నేను ఇచ్చిన నమ్మకంతోనే రాష్ట్రంలో ఉండే ప్రజలు ముందుకొచ్చి రాజధాని కోసం విరాళాలు సేకరించారు. నేను చాలా గర్వపడుతున్నా“అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానికి భూ సమీకరణపై మంత్రి వర్గ ఉప సంఘంతో సమావేశం జరిపిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.

 

రాజధాని నిర్మాణం ప్రజల భాగస్వామ్యంతో జరగాలన్నారు. ప్రజల భాగస్వామ్యం ఉండాలనే ప్రజారాజధాని అని ప్రకటించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో 4.93 కోట్ల మంది జనాభా ఉన్నారు, ప్రజా రాజధాని నిర్మాణంలో ప్రతి ఒక్కరి శ్రమ, విరాళం ఉండాలని కోరారు. “ఇప్పటికే హుద్ హుద్ తుపాను తో రాష్ట్రం అతలాకుతలమైంది, ఎన్నో ఇబ్బందులు, కష్టాలున్నాయి. కష్టాలు చూసి నేను కుంగిపోయే మనిషిని కాను. కష్టాలు ఉన్నప్పుడు ఇంకా నిలదొక్కుకొని కష్టపడతాను. అదే ఈ ఐదు నెలల్లో నిరూపణ అయిందని“ చంద్రబాబు తెలిపారు.

 

రాజధాని వస్తే స్థానికంగా ఉండే వాళ్లు బాగుపడతారని కొంతమందికి కడుపుమంట ఉందన్నారు. రాజధాని నిర్మాణంతో మొదట లబ్ధిపొందేది రైతులు, పేదలేనని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు లేని చోట రాజధాని కడితే అభివృద్ధి జరగదని కొందరు అపోహలు సృష్టించి రాజధానికి ఇబ్బందులు సృష్టిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. తెలుగుజాతి గర్వపడే విధంగా రాజధాని నిర్మించాలనే తమ ధ్యేయమని బాబు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, యనమల రామకృష్ణుడు, పత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.