ప్రజల సంక్షేమమే అందరి బాధ్యత : కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ ప్రజల ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మారియట్ హోటల్ లో రెండు రోజుల పాటు జరిగే కలెక్టర్ల సమావేశాన్ని శుక్రవారం ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ లక్ష్యం కోసం ప్రజలు టీఆర్ఎస్ కు పట్టం కట్టారో ఆ లక్ష్య సాధన కోసం పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

గతంలో తెలంగాణలో భయానక వాతావరణం ఉన్న విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని, ఇందుకోసం ప్రజల ఆశలను నెరవేర్చేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కుల, మతాలకు అతీతంగా టిఆర్ఎస్ కు ప్రజలు అధికారాన్ని అప్పగించారని తెలిపారు.

ఎవరు ఎక్కడ అధికారులుగా పనిచేసినా, పేద ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు సూచించారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపర్చిన అంశాలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు.

ప్రజలు ప్రభుత్వంపై పెట్టుకొన్న ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చేందుకు అంతా కలిసికట్టుగా కృషిచేయాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రభుత్వం అనుకొన్న లక్ష్యాలను సాధించాలంటే శాంతి భద్రతలు ముఖ్యమన్నారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తేలేదన్నారు. మంచి పనులు చేస్తూ ముందుకు సాగాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మంచి చేస్తే కలిగే తృప్తి మరే పనిచేసినా దక్కదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు ఉండవని, వచ్చే మూడేళ్లలో విద్యుత్ ఉత్పత్తి కోసం రూ 91,500 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చుచేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.