ప్రధాని బెలూచీ ప్రస్తావనను అధికారులు వ్యతిరేకించారా?

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజులనుంచి చేసిన ప్రసంగంలో బెలూచిస్తాన్ గురించి ప్రస్తావించి జాతీయ, అంతర్జాతీయ రాజకీయ పరిశీలకులను ఆశ్చర్య పరిచారు. పాకిస్తాన్ లోని బెలూచిస్తాన్ చాలాకాలంగా అశాంతి, అలజడుల కింద నలుగుతోంది. అక్కడ పాకిస్థాన్ భద్రతా బలగాలు పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నట్టు చిరకాలంగా వింటూనే ఉన్నాం. అక్కడి అలజడి వెనుక భారత్ హస్తం ఉన్నట్టు పాకిస్తాన్ చేస్తున్న ఆరోపణ కూడా కొత్తది కాదు. నిరాధారమైన ఆరోపణలు చేయడంలో పాక్ అందరి కంటే నాలుగాకులు ఎక్కువే చదివిందన్న సంగతి కొత్తగా చెప్పుకోనవసరం లేదు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత ప్రధానమంత్రి నోట బెలూచిస్తాన్ మాట వినిపించడమే కొత్త విషయం. బెలూచిస్తాన్ లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనను ప్రపంచం దృష్టికి తెస్తున్నందుకు తనను అక్కడి ప్రజలు అభినందిస్తున్నారని ప్రధాని తన ప్రసంగంలో వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్య దినోత్సవం అనే ఒక అతి ముఖ్యమైన జాతీయ ఉత్సవ సందర్భంలో ప్రధాని అంతటి వ్యక్తి పొరుగు దేశాన్ని ఇరుకున పెట్టే ఒక కొత్త ప్రస్తావన చేయడం సహజంగానే దేశీయంగా, అంతర్దేశీయంగా కూడా కీలకమైన ఒక రాజకీయ సందేశం ఇస్తుంది. మన దేశం ఇంతకాలం పాక్ జరిపే ఉగ్రవాద పూరిత విద్రోహ చర్యలకు, ముసుగు యుద్ధాలకు లక్ష్యంగా ఉంటూ వచ్చింది. అది బాధక దేశంగా మనం బాధిత దేశంగా ఉంటూ వచ్చాం. అందుకు భిన్నంగా ఇప్పుడు ప్రధాని తన బెలూచిస్తాన్ ప్రస్తావన ద్వారా దెబ్బకు దెబ్బ తీస్తామన్న సందేశాన్ని పాకిస్తాన్ కు స్పష్టంగా ఇచ్చారు. పాకిస్తాన్ విషయంలో మనం ఇంతకాలం అనుసరిస్తున్న విధానంలో మౌలికమైన మార్పును ఈ ప్రస్తావన పట్టి చూపింది.

ఇంతకీ ప్రధాని ఇలా బెలూచిస్తాన్ గురించి ప్రస్తావించడం మంచిదా, కాదా అన్న చర్చ వెంటనే తలెత్తింది. దానిపై రెండు రకాల అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. విదేశాంగవిధానంలో, దౌత్య వ్యవహారాలలో తల పండిన వాళ్లలోనూ కొందరు సమర్ధిస్తే కొందరు తప్పు పట్టారు. ప్రధాని ఆ ప్రస్తావన చేసిన తర్వాత మన జాతీయ మీడియాలో బెలూచిస్తాన్ లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన వార్తలు, వీడియోలు ప్రముఖంగా రావడమూ మొదలైంది. ఇప్పటికిప్పుడు చెప్పాలంటే మోడీ ప్రభుత్వం ఈ విషయంలో సాహసోపేతమైన రాజకీయ వైఖరి తీసుకుంది. అయితే ఇది కలిసొచ్చే వ్యూహమా కాదా అన్నది ఇప్పుడే అంచనా వేయలేని విధంగా పరిస్థితి ప్రవాహ స్థితిలోనే ఉంది. కలసివస్తే నిస్సందేహంగా అది ప్రధాని ఇమేజ్ ను జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా పెంచుతుంది.

ఆయా పరిణామాల పట్ల రాజకీయ స్పందనలకు, అధికారుల స్పందనలకు సహజంగానే తేడా ఉంటుంది. ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం వంటి కీలక సందర్భంలో బెలూచిస్తాన్ ప్రస్తావన చేయచ్చా, చేయకూడదా అనే విషయంలో ముందస్తు చర్చ జరిగినట్టు తాజా వార్తలు వెల్లడిస్తున్నాయి. ప్రసంగ పాఠం తయారు చేసేముందు ప్రధాని స్వయంగా అధికారులతోనూ, మంత్రివర్గంలోని పలువురు సహచరులతోనూ సమావేశమైనట్టు ఆ వార్తలు వెల్లడించాయి. బెలూచిస్తాన్ గురించి మాట్లాడడం మంచిదే కానీ, స్వాతంత్ర్య దినోత్సవ సందర్భాన్ని అందుకు వేదిక చేసుకోవడం మంచిది కాదని కొందరు సీనియర్ అధికారులు అన్నట్టు ఆ వార్తలు తెలిపాయి. అయితే హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రక్షణ మంత్రి మనోహర్ పారికర్ మాత్రం ప్రధాని ప్రసంగంలో బెలూచిస్తాన్ ప్రస్తావన ఉండి తీరవలసిందే నని వాదించినట్టు సమాచారం.

ఈ విధంగా రాజకీయ విజ్ఞతకు, అధికార యంత్రాంగపు విజ్ఞతకు మధ్య ఈ వ్యవహారం పోటీగా మారినట్టు అర్థమవుతోంది.

ప్రధాని రాజకీయవిజ్ఞత వైపే మొగ్గు చూపారు. చివరికి ఎవరి విజ్ఞతను గెలుపు వరిస్తుందన్నది ప్రస్తుతానికి అకడమిక్ ప్రశ్న మాత్రమే. పాకిస్తాన్ ను కట్టడి చేయడం ఇప్పుడు మనముందు ఉన్న కీలక సవాలు. ప్రసంగ పాఠం పై అధికారులతో ప్రధాని సమావేశం గురించి, అధికారులు పలువురు బెలూచిస్తాన్ ప్రస్తావనను వ్యతిరేకించడం గురించి విదేశీ వ్యవహారాలు, రక్షణ, హోమ్ మంత్రిత్వ శాఖలను వివరణ కోరినప్పుడు అవి స్పందించలేదని కూడా వార్తలు వెల్లడించాయి. నిజానికి ఇందులో వాళ్ళు కొత్తగా ధ్రువీకరించాల్సింది ఏమీ లేదు. ప్రధాని తాలూకు కీలక ప్రసంగ పాఠాన్ని తయారు చేసే ముందు అధికారులతో సంప్రదించడం ఎప్పుడూ జరిగేదే.

-సూర్య

Have something to add? Share it in the comments

Your email address will not be published.