ప్రభుత్వమే భరిస్తుంది : కేసీఆర్

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు, పెన్షనర్లకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దీపావళి కానుకను ప్రకటించారు. నయాపైసా చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ప్రతి కార్పొరేట్ ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉచితంగా అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని కేసీఆర్ తెలిపారు.  గతంలో మాదిరిగా వైద్య చికిత్సకు వ్యయ పరిమితి ఉండదని, ఖర్చునంతటినీ ప్రభుత్వమే భరిస్తుందని కేసీఆర్ ప్రకటించారు. కొత్త ఆరోగ్య కార్డుల జారీ ప్రక్రియను బుధవారం లాంఛనంగా ప్రారంభిచనున్నట్టు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి తెలిపారు.

మంగళవారం సచివాలయంలో ఆరోగ్య కార్డులపై విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రితోపాటు ఉప ముఖ్యమంత్రి రాజయ్య, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మ, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి, కార్యదర్శి శివశంకర్, కార్యదర్శి రామకృష్ణారావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్వరరావు, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి బీఆర్ మీనా, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, సెక్రటరీ స్మితా సబర్వాల్, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి సతీశ్‌చందా, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో ధనంజయరెడ్డి, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, పరువులు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గత సమావేశాల్లో ఎన్జీవోలు రూ.90, గెజిటెడ్ అధికారులు రూ. 120 ప్రీమియం చెల్లించేందుకు సంసిద్ధత వ్యక్తంచేశారని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ దేవీప్రసాద్ ముఖ్యమంత్రికి వివరించారు.

దీంతో ముఖ్యమంత్రి ఉద్యోగుల నుంచి ప్రీమియం వసూలు చేస్తే ఎంత సొమ్ము వస్తుందని అధికారులను ప్రశ్నించారు. రూ. 86 కోట్ల వరకు వస్తుందని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి ముఖ్యమంత్రికి తెలపడంతో, ఉద్యోగులపై నయాపైసా భారం మోపవద్దని, ప్రీమియం పద్ధతులు వద్దని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అనంతరం ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు, అధికారులు పలువురు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.