ప్రభుత్వ ఆసుపత్రుల ప్రక్షాళన సాధ్యమేనా?

అసెంబ్లీ సమావేశాలు అలా ముగిశాయోలేదో తెలంగాణ ఉపముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి రాజయ్య ఇక ఆసుపత్రుల ప్రక్షాళన పనిలోపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై బడ్జెట్ సమావేశాల్లో విపక్షాలు చేసిన రాద్ధాంతం ఏమో కాని ఆసుపత్రి నిద్ర పేరుతో రాజయ్య ప్రభుత్వ ఆసుపత్రుల్లో బసచేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా మొదటిగా హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో సోమవారం రాత్రి బసచేశారు. సాయంత్రం 6 గంటల సమయంలో ఆసుపత్రికి చేరుకున్న రాజయ్య అక్కడి పరిస్థతిపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిని తనిఖీచేసి అక్కడి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

తెలంగాణ అస్తిత్వంలో భాగంగా ఆయా ఆసుపత్రులకున్న పూర్వ వైభవాన్ని తీసుకురావడం కోసం, అదే విధంగా గతంలో ఉస్మానియా ఆసుపత్రికున్న పూర్వ వైభవాన్ని తీసుకురావడంకోసం ఆసుపత్రి నిద్ర కార్యక్రమం మొదలు పెట్టడం జరిగిందని ఆరోగ్యశాఖమంత్రి రాజయ్య తెలిపారు. క్షేత్రస్థాయిలో జరిగే అవతవకలు, డాక్టర్లకున్న అభధ్రతాభావం, ప్రభుత్వ ఆసుప్రతులపట్ల ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించటానికి ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. దీనిని ప్రక్షాళన చేయాలంటే ముందుగా అక్కడున్న సమస్యలు తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో గత 5 నెలల్లో 10 జిల్లాల్లో ముఖ్యమైన ఆసుపత్రులను సందర్శించామని రాజయ్య తెలిపారు.

ఉపముఖ్యమంత్రి బసపై ముందుగానే ఆసుపత్రి వర్గాలకు సమాచారం ఉండటంతో ముందస్తుగానే జాగ్రత్త పడ్డారు. పరిసరాలను శుభ్రం చేయించారు. ఈ హాడావుడి అంతా ఉపముఖ్యమంత్రి వచ్చిపోయోంతవరకేనని, అది అందరికి తెలిసిందేనని అక్కడ ఉన్న రోగులు వాపోతున్నారు. ఆసుపత్రిలో సౌకర్యాలపై రోగులు రాజయ్యకు ఏకరవుపెట్టారు.

ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెంచేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెబుతున్న రాజయ్య చివరకు తన కాలు ఆపరేషన్ కూడా ఉస్మానియాలోనే చేయించుకుంటానంటున్నారు. పెద్దవాళ్లకు అందే వైద్యసదుపాయాలు వీధి జనాలకు అందే అంత చేరువలోకి రావడం సాధ్యమేనా అనేది అక్కడి రోగులు అంటున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.