ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుకు రంగం సిద్ధం

AP-Secretariat

ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు వ్యవహారం మరోసారి తెరమీదకు వచ్చింది. ఎన్నికల వేళ ఉద్యోగుల మద్దతు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పదవీ విరమణ వయసు పెంచేందుకు రంగం సిద్దం చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వస్తే ఉద్యోగులు కోరుతున్న విధంగా పదవీ విరమణ వయస్సు పెంచుతామని ప్రకటించి 24 గంటలు కూడా గడవక ముందే ప్రభుత్వం ఆగమేఘాల దీనికి స్పందించిన ఫైలును ముందుకు తెచ్చింది. పదవీ విరమణ వయస్సు 58నుంచి 60ఏళ్లకు పెంచేందుకు రంగం సిద్ధం చేసింది.

పదవీ విరమణ వయసు పెంపుపై ఉద్యోగ సంఘాలు ఇచ్చిన విజ్ఞాపన పత్రాలను పరిశీలించిన ముఖ్యమంత్రి కార్యాలయం పదో వేతన సవరణ సంఘానికి పంపింది. అయితే ఈ అంశం వేతన సంఘం పరిధిలోకి రాదని తేల్చి చెప్పడంతో ముఖ్యమంత్రి కార్యాలయం సూచన మేరకు ఆర్థిక శాఖ నోట్ ను సిద్ధం చేసింది. దీనిపై రెండు మూడు రోజుల్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంతకం చేయనున్నట్లు అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పెద్ద ఎత్తున ఉద్యోగులు పదవీ విరమణ పొందితే పరిపాలనాపరంగా సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నాయి. విరమణ మొత్తాలను ఒకే సారి చెల్లించాలంటే ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుందని కూడా అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఫలితంగా పదవి విరమణ వయస్సు పెంపుతో ప్రభుత్వానికి కొంత వెసులుబాటు లభిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇటు ప్రభుత్వ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిదిన్నర లక్షల మంది ఉద్యోగులు లబ్ధిపొందనున్నారు. ప్రధానంగా హైదరాబాద్ లోనే 1.80 లక్షల మంది ఉద్యోగులు మరో రెండేళ్ల పాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.