ప్రముఖ నిర్మాత, దర్శకుడు వి.బి.రాజేంద్రప్రసాద్ కన్నుమూత

v b rajendra prasad-13

వీబీ రాజేంద్రప్రసాద్ (పాత చిత్రం)

హైదరాబాద్, జనవరి 13: ప్రముఖ దర్శకుడు, నిర్మాత, రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత వీబీ రాజేంద్రప్రసాద్ (82) సోమవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన సోమాజీగూడలోని ఇషా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

వీబీ రాజేంద్రప్రసాద్ పూర్తిపేరు వీరమాచినేని బాబూ రాజేంద్రప్రసాద్. 1932లో కృష్ణాజిల్లా డోకిపర్రు గ్రామంలో జన్మించిన ఆయన చిన్నతనం నుంచే నాటకాలన్నా, కళలన్నా ఆసక్తిని ప్రదర్శించేవారు. నాటకాలపై ఆయనకున్న మక్కువతో రాఘవ కళా సమితి ద్వారా రంగస్థలంపై అడుగుపెట్టి పలు నాటకాల్లో నటించారు. సినిమా హీరోగా గుర్తింపుతెచ్చుకోవాలనే సంకల్పంతో మద్రాసుకు వెళ్లి ఆ దిశగా ఆయన ప్రయత్నాలు చేసినా అవకాశాలు రాకపోవడంతో అక్కినేని నాగేశ్వరరావు సలహా మేరకు నిర్మాణ రంగంపై దృష్టిపెట్టారు.

1960లో జగపతి ఆర్ట్ పిక్చర్స్ సంస్థను స్థాపించి తొలి ప్రయత్నంగా అన్నపూర్ణ అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమా విజయం సాధించడంతో ఆయన పూర్తిస్థాయి నిర్మాతగా మారారు. అక్కినేని నాగేశ్వరరావు కథానాయకుడిగా నటించిన దసరా బుల్లోడు చిత్రంతో దర్శకుడిగా భారీ విజయాన్ని దక్కించుకున్న ఆయన 16 చిత్రాలకు నిర్మాతగా, 14 చిత్రాలకు దర్శకుడిగా రాజేంద్రప్రసాద్ వ్యవహరించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.