ప్రముఖ నిర్మాత రామానాయుడు కన్నుమూత

ramanaidu-18

హైదరాబాద్ : ప్రముఖ చలన చిత్ర నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. దాదాపు 15 భాషల్లో 150కు పైగా చిత్రాలు నిర్మించిన రామానాయుడు మూవీ మొఘల్ గా పేరుపొందారు. రామానాయుడికి భార్య రాజేశ్వరి, ఇద్దరు కుమారులు నిర్మాత సురేష్ బాబు, నటుడు వెంకటేశ్ , కుమార్తె లక్ష్మీ ఉన్నారు.

ప్రకాశం జిల్లా కారంచేడులో దగ్గుబాటి వెంకటేశ్వర్లు, లక్ష్మీదేవమ్మలకు 1936 జూన్ 6న రామానాయుడు జన్మించారు. మద్రాస్ లోని లయోలా కళాశాలలో చదువుకుంటున్న రామానాయుడుకి సాంస్కృతిక కార్యక్రమాల మీద ఎక్కువ ఆసక్తి ఉండేది. కాలేజీ చదువుకి స్వస్తి చెప్పి చీరాల చేరుకున్న ఆయన చదువుకొనసాగకపోవడంతో, కారంచేడులో రైస్ మిల్లు వ్యాపారం ప్రారంభించారు.  కొంతమంది మిత్రులతో కలిసి సినిమా డిస్ట్రిబ్యూషన్ వ్యాపారంలో అడుగుపెట్టి తన తొలి సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు.

సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన రామానాయుడు తొలుత జి.రామినీడు దర్శకత్వంలో అనురాగం అనే చిత్రాన్ని నిర్మించి తొలి విజయాన్ని అందుకున్నారు. అనంతరం సురేష్ ప్రొడక్షన్ స్థాపించి 1964లో ఎన్టీ రామారావు కథానాయకుడిగా రాముడు-భీముడు, 1971లో అక్కినేని నాగేశ్వరరావు కథానాయకుడిగా ప్రేమ్ నగర్ చిత్రాలను నిర్మించి అఖండ విజయాన్ని సాధించారు. అత్యధిక చిత్రాల నిర్మాతగా రామానాయుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు. అనంతరం 2009లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. భారత ప్రభుత్వం 2013లో ఆయనను పద్మభూషన్ అవార్డుతో సత్కరించింది. చిత్ర రంగంలో కాకుండా అటు రాజకీయరంగంలో కూడా ఆయన అడుగుపెట్టారు. 1999లో బాపట్ల నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా గెలుపొందారు. ఆయన చేసిన సేవలకు గాను 2003లో బెస్ట్ పార్లమెంటేరియన్ పురస్కారాన్ని అందుకున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.