ప్రసవ వేదనలో ప్రజాస్వామ్య వ్యవస్థ

  • పత్రికలు ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు – హరగోపాల్
  • కలలు కల్లలు అవుతున్న వేళ – వరవర రావు
  • మీడియా నిషేధం దుర్మార్గం – అమర్

హైదరాబాద్, సెప్టెంబర్ 22 : నిజమైన, మానవీయమైన ప్రజలందరికి సుఖంగా జీవించడానికి ఒక నిజమైన ప్రజాస్వామ్య వ్వవస్థ కొరకు భారతదేశం ప్రసవవేదన పడుతుంది. ప్రసవ వేదనలో ఒక ఆరోగ్యకరమైన శిశువు పుట్టాలంటే అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఫ్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీడియా స్వేచ్ఛ-పరిరక్షణపై జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారం అనేది మనిషిని అమానుషంగా మారుస్తుంది, కానీ మనిషి అధికారం మానవీయంగా కూడా మార్చవచ్చని తెలిపారు. గతంలో నెహ్రూ మీద కూడా ఎన్నొ విమర్శలు వచ్చాయి, కార్టునిస్టు లక్ష్మణ్ వేసిన బొమ్మలకు నేహ్రూ చాలా ఆనందించేవారని, తన మీద ఎంత విమర్శ వస్తే, ప్రజాస్వామ్య నిర్మాణం అంత పటిష్టంగా జరుగుతుందని విశ్వసించేవారని ఆయన పేర్కొన్నారు. వార్త రాసేటప్పుడు ఇది ప్రజాస్వామ్యాన్ని అభవృద్ధి చేస్తుందా లేదా అనేది ప్రమాణంగా పెట్టుకోవాలని, అప్పుడే పత్రికా విలువలు వికాసం చేంది ప్రజాస్వామ్యం ముందుకు పోతుందని ఆయన విలేకరులకు సూచించారు. నాగరికత పరిణామ క్రమంలో ఈ ప్రజాస్వామ్య వ్యస్థలో ముందుకు పోవాలంటే నిజమైన ప్రజాస్వామ్యం రావాలంటే మీడియా ఆంక్షలుగాని, సభల మీద ఆంక్షలు గాని మంచిది కాదని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన ఈ రెండు సంఘటనలు మంచి సంకేతాలు కావని, ఆంక్షలు విధించిన రెండు ఛానళ్ళను పునరుద్ధరించాలని హరగోపాల్ ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కోరారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని 1969 నుంచి ఏ ప్రజాస్వామ్య పోరాటంలో పొల్గొంటూ వస్తున్నామో, అటువంటి స్వప్నం సాకారం కావడం ఒక వైపు జరుగుతుంటే, తెలంగాణ సమాజం, సాంస్కృతిక కార్యకర్తలు, కళాకారులు, బుద్దిజీవులు ఏ ఉత్తమ సంప్రదాయాలను ఇక్కడ నెలకొల్పుతూ వస్తున్నారో, అటువంటి వాటిని తెలంగాణ ప్రభుత్వంలో ఒక్కొక్క సాంప్రదాయము విచ్ఛిన్నమైపోతుందని విరసం నాయకులు వరవర రావు అన్నారు. ఇక్కడ గొప్పప్రజాస్వామిక ఉద్యమం తెలంగాణ రాష్ట్రం కొరకు నడిచింది కాబట్టి, ముఖ్యమంత్రి చేసే పనులన్నీ తెలంగాణ ఉద్యమంమీద ప్రభావం చూపుతాయన్నారు. కాళోజి బ్రతికుంటే ఇటువంటి సంప్రదాయాల గురించి ఎంతో వేదనచేందేవారని అన్నారు.

ఒక ఛానల్ తెలంగాణ సంస్కృతిని, ప్రజలను, ప్రజాప్రతినిధులను అవమానపరస్తున్నదని స్పీకర్ దృష్టికి ముఖ్యమంత్రి తీసుకొచ్చినప్పుడు ఆ మేరకు ఆయన చేసిన పని ఉచితంగానే ఉందని భావించినటువంటి వారు, ఎంఎస్ఓలు రెండు ఛానళ్లను నిషేదించడం, అది కేవలం ప్రైవేటు సంస్ఠల వ్యవహరంగా సరిపెట్టుకోవడానికి ఎవరైనా ప్రయత్నంచేసినా, వరంగల్ సభలో మీడియాని బొందతీసి పాతరపెడతామనే ముఖ్యమంత్రి ప్రకటన ఆయన దురుద్దేశమేంటో స్పష్టంగా అర్ధమవుతుందన్నారు. మావోయిస్టు ఎజెండానే అమలుచేస్తానని కేసీఆర్ ఒకటికి వంద సార్లు చెప్పి 110 రోజులైనా ఇప్పటికి కూడా మరెక్కడాలేని నిషేదాన్ని కొనసాగించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటి యాక్ట్ కింద నిషేదాన్ని విధించారన్నారు. ఈ రాష్ట్రంలో మాత్రమే రెవల్యూషనరి డెమొక్రటిక్ ఫంట్ ను నిషేదించడం ఇక్కడ మాత్రమే కొనసాగుతోందన్నారు. ఈ నిషేదాన్ని తొలగించకపోవడం మాత్రమే కాకుండా, ర్యాలీకి, పబ్లిక్ మీటింగుకు అనుమతిని ఇవ్వకుండా, ప్రభుత్వానికి, పోలీసులకు అధికారంలేని సుందరయ్య విజ్ఞన కేంద్రంలో తలపెట్టిన సమావేశాన్ని అడ్డుకున్నారన్నారు.

రెచ్చగొట్టే సమాచారాన్ని ఇవ్వొద్దని, ఈ ప్రయత్నం చేయవద్దని,  ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా స్వీయ నియంత్రణతో కూడినటువంటి స్వేచ్ఛను మీడియా అనుసరించాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం అయిన మీడియా స్వేచ్ఛను హరించడం అనే ఈ ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తున్నట్లు వరవర రావు తెలిపారు.

రెండు ఛానళ్ళను నిషేదించిన దానిని అన్ని పత్రికల్లో, అన్ని ఛానళ్లో సమిష్టిగా వ్యతిరేకించి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదని ఇండియన్ జర్నలిస్టు నాయకులు దేవులపల్లి అమర్ అభిప్రాయపడ్డారు. రెండు ఛానళ్ళ ప్రసారాలను ఎంఎస్ఓలు నిలిపివేయడాన్ని ఇండియన్ జర్నలిస్ట్ యానియన్ తరఫున పలుమార్లు ఖండించామని అన్నారు. కాని అవి కొన్ని ఛానళ్లో, కొన్ని పత్రికల్లో మాత్రమే వచ్చాయి. ఒక ఛానల్ మీదగాని, ఒక పత్రిక మీద గాని దాడి జరిగితే ఆ ఛానల్ లోనే చూపించి, ఆ పత్రిక వరకే రాసుకొని మిగతవారు దాని గురించి రాయని, ప్రస్తావించని పరిస్థితి ఉంది కాబట్టే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించ గలుగుతుందన్నారు. ఒక్క తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే పరిస్థితి ఉందన్నారు. ఒక దినపత్రిక దానికి సంబంధించిన ఛానల్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి అధికార కార్యక్రమాలకు అనుమతించడంలేదు. సినిమాలు విజయవంతమైతే 100 రోజుల పండుగను చేసుకుంటారు, అధికారం లోకి వచ్చిన 100 రోజులు అయిందని ప్రభుత్వాలు పండుగలు చేసుకుంటున్నాయి.

ఐతే మాతో ఉండండి, మమ్మల్నే సమర్ధించండి లేదంటే మీరు మా శత్రువుతో ఉన్నట్లే అని ముఖ్యమంత్రి అంటున్నారు. అలా వ్యవహరించే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమానికి తెరలేపే ప్రయత్నం పాలుకులు చేస్తున్నారన్నారు. ఎవరితో ఉండని ఒక పక్షం ఉంటుందని, ఒక ప్రత్యమ్నాయమైన ఒక వర్గం ప్రజల్లో ఉంటుందన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. రెండు ఛానళ్లను నిషేదించడానికి ప్రభుత్వానికిగాని, ఎంఎస్ఓలకు గాని అధికారం ఉండదన్నారు. నిషేదాన్ని ఎత్తివేయాలని కోరేవారిని ఆంధ్రా తొత్తులని ముద్రవేస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం 14 సంవత్సరాల పాటు నిరంతర పోరాట ఫలితంగానే ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితికి అధికారం ఇచ్చారన్నారు. ఎల్లకాలం అధికారం మాదే, ప్రజలందరు అట్లానే ఉంటారనుకోవడం పొరబాటేన్నారు.

ప్రత్యమ్నాయ రాజకీయ వేదిక ఒక సభను సుందరయ్య విజ్ఞన కేంద్రంలో జరప తలపెడితే దానిని అడ్డుకున్నారు. విప్లవ రచయిత సంఘం మహాసభలు వరంగల్ నిర్వహించాలని తలపెట్టినప్పుడు దానికి సంబంధించిన డాక్టరును పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇండియన్ జర్నలిస్ట్ తరఫున రెండు ఛానళ్లను నిషేదించడంపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. దానికి వారు ఒక కమిటిని రాష్ట్రానికి పంపించింది. 40 సంవత్సరాల పాటు జర్నలిస్ట్ గా పనిచేసి,  తెలంగాణ ప్రాంతంలో జర్నలిస్టుల మీద దాడులు జరిగినప్పుడు దానికి వ్యతిరేకంగా నిలబడిన ప్రెస్ కౌన్సిల్ సభ్యుడు అమనాధ్ ఆంధ్రా ప్రాంతానికి చెందినవారు కాబట్టి కమిటిలో ఉండటానికి వీలులేదన్నారు. ఇటువంటి పరిస్థితి మారాలని ఆయన కోరారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఇటువంటి చర్యలను ఖండిస్తున్నట్లు అమర్ తెలిపారు.

సీనియర్ జర్నలిస్ట్ కె. శ్రీనివాస రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ టిడిపి నాయకులు రేవంత్ రెడ్డి, టిఎన్ఎస్ఎఫ్ నాయకులు ఆంజనేయ గౌడ్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు రాంచందర్ రావు, పిఓడబ్ల్యు సంధ్య, బిజేపి అధికార ప్రతినిధి క్రిష్ణ సాగర్, నాగం జనార్ధన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, సిపిఐ నాయకులు నారాయణ, టిపిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, న్యూడెమెక్రసి నాయకులు గోవర్థన్, కాంగ్రెస్ నాయకురాలు డి.కె.అరుణ తదితరులు పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.