ప్రాతఃస్మరణీయుడు కామత్

పాత్రికేయులలో ప్రాత:స్మరణీయుడు గురువారం ఉదయం మణిపాల్ తో తుది శ్వాస వదిలిన మాధవ్ విఠల్ కామత్. ఎంవీకామత్ గా ప్రసిద్ధుడైన ఆయన అత్యంత సౌమ్యుడూ, నిరాడంబరుడూ, నిగర్వి. 94వ జన్మదినోత్సవాన్ని నెల రోజుల కిందట తాను గౌరవ అధ్యక్షుడా పనిచేస్తున్న మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ లో సహచరులూ, శిష్యులూ, ప్రశిష్యుల మధ్య జరుపుకున్న కామత్ కు వేరే కుటుంబం అంటూ లేదు. బ్రహ్మచారిగా జీవిస్తూ పుస్తకాలతోనే సహచర్యం. అరుదైన జర్నలిస్టులలోనూ విశిష్టమైన వ్యక్తిత్వం ఉన్నవాడు.

కుష్వంతో సింగ్ ఇంగ్లీషు భాషపై అధికారం కలిగిన బహుముఖీనుడైన పాత్రికేయుడు. 99 సంవత్సరంలో కన్నుమూసే వరకూ తన కాలమ్ ను కొనసాగిస్తూనే ఉన్నాడు. కల్పనా సాహిత్యంలో కూడా చేయితిరిగిన కుష్వంత్ తన శృంగారజీవితం గురించి ఉత్తుత్తి ఉదంతాలు తన కాలమ్ లో రాసి పాఠకులను రంజింపజేసేవాడు. కామత్ కలలో కూడా… లేనిది ఉన్నట్టూ, ఉన్నది లేనట్టూ రాయలేడు. కులదీప్ నయ్యర్ కీహోల్ జర్నలిస్టుగా పేరు తెచ్చుకున్నారు. తాను ఊహించిన విషయాలను వాస్తవాలుగా చిత్రించిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చుతున్న సమయంలో నాటి ప్రధాని పివి నరసింహారావు పూజలో కూర్చున్నట్టూ, మసీదు కూలిందని ఎవరో చెవిలో ఊదిన తర్వాత కానీ కళ్ళు తెరవనట్టూ మధులిమాయే తనకు చెప్పినట్టు కట్టుకథ రాశారు. అటువంటి పనులు కామత్ ఎన్నడూ చేయలేదు.

పిన్న వయస్సులో ఉన్న జర్నలిస్టులకు కామత్ మూడు సూత్రాలు చెప్పేవారు. ఒకటి: జర్నలిజం ఒక వృత్తి, ఏదో విప్లవం తీసుకురావాలనీ, ప్రపంచాన్ని మార్చివేయాలనీ ఆవేశపడకూడదు. ఆ పని విప్లవకారులకు వదిలిపెట్టడం ఉత్తమం. రెండు: ఒక అద్భతమైన వ్యాసం రాసి, ఒక ప్రభావవంతమైన వార్తాకథనం వండి వార్చి గొప్ప జర్నలిస్టునైపోయానని అనుకుంటే పొరపాటు. మూడు: చేతిలో కలం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు రాయకూడదు. నిగ్రహం పాటించాలి. విచక్షణాజ్ఞానం కలిగి ఉండాలి. `హన్స్ ఇండియా`లో కామత్ కాలమ్ ప్రచురించాం. తన ప్రియమైన పాత ఆలివెట్టి టైప్ రైటర్ పైన టైప్ చేసిన వ్యాసాన్ని పోస్టులో పంపించేవారు. ఒక సారి ఫోన్ చేసి `కనీసం ఫాక్స్ చేయవచ్చు కదా మహానుభావా` అంటే `మిస్టర్ మూర్తి, దటీజ్ హౌ ఐ యామ్` అంటూ నవ్వేశారు. తాను పాతకాలం మనిషినని అన్నారు. అలాగని కామత్ ఛాందసవాది కాదు. చాలా హేతుబద్ధంగా, సాధికారికంగా, సూటిగా రాసేవారు. దాదాపు 50 పుస్తకాలు రాశారు. చివరిది నరేంద్రమోదీ పైన రాసింది. ఎన్ని పదవులు నిర్వహించినా, పురస్కారాలు గ్రహించినా, ఎంత వయస్సు వచ్చి మీదపడినా జర్నలిస్టుకు మౌలికంగా ఉండవలసిన జిజ్ఞాసనూ, అధ్యయన శీలాన్నీ, నిజాయితీనీ, నిష్పక్షపాత వైఖరినీ, నిర్భీతినీ ఆయన ఎన్నడూ కోల్పోలేదు. అందుకే ఆయన పాత్రికేయులందరికీ చిరస్మరణీయుడు, స్ఫూర్తిప్రదాత.

-కె.రామచంద్రమూర్తి

(Courtesy Sakshi)

Have something to add? Share it in the comments

Your email address will not be published.