ప్ర‌ణాళికా సంఘం స్థానంలో స‌రికొత్త వ్య‌వ‌స్థ‌…

revuru umamaheswara rao1కేంద్రంలో ప్ర‌ణాళికా సంఘం స్థానంలో దేశ భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు, అభివృద్ధి వ్యూహాల‌కు అనుగుణంగా భార‌త ప‌రివ‌ర్త‌న జాతీయ సంస్థ‌ (నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూష‌న్ ఫ‌ర్ ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా -ఎన్‌.ఐ.టి.ఐ) పేరుతో ఒక కొత్త వ్య‌వ‌స్థ‌ను తీసుకురావ‌డం స్వాగ‌తించ‌ద‌గిన‌ది. ప్ర‌ణాళికా సంఘం స్థానంలో ఒక కొత్త వ్య‌వ‌స్థ రూపుదిద్దు కోవాల్సిన అవ‌స‌రాన్ని ఎంతోకాలంగా వివిధ రాష్ట్రాల‌కు చెందిన నాయ‌కులు ప్ర‌స్తావిస్తూనే ఉన్నారు. అది ఇప్ప‌టికి సాకార‌మౌతున్న‌ద‌ని భావించాలి. న‌రేంద్ర‌మోదీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే స్వాతంత్ర్య‌దినోత్స‌వ ప్ర‌సంగంలోనే ఇలాంటి వ్య‌వ‌స్థ‌ను ఒక దానిని తీసుకురానున్న‌ట్టు త‌న ఎర్ర‌కోట ప్ర‌సంగంలోనే చెప్పారు.

ప్ర‌ణాళికా సంఘంపై విమ‌ర్శ‌లు…

నిజానికి ప్ర‌ణాళికా సంఘంపై ఉన్న విమ‌ర్శ‌ల‌లో ప్ర‌ధాన‌మైన‌ది, రాజ్యాంగ‌ప‌ర‌మైన ఎలాంటి ద‌న్నూ లేకుండా కేవ‌లం కేబినెట్ తీర్మానం ద్వారా అప్ప‌ట్లో దీనిని ఏర్పాటు చేశార‌న్న‌ది ఒక విమ‌ర్శ‌. రాజ్యాంగం ఫెడ‌ర‌ల్ స్ఫూర్తికి ప‌ట్టం క‌ట్టాల‌ని చెబుతుంటే, ప్ర‌ణాళికా సంఘం తీరు కేంద్రీకృత ప్ర‌ణాళికా ర‌చ‌న దిశ‌గానే సాగుతూ వ‌చ్చింది. దీనితో ఎన్నో రాష్ట్రాలు ఇబ్బందులు ఎదుర్కొన‌వ‌ల‌సి వ‌చ్చింది. చివ‌ర‌కు ప్ర‌ణాళికా సంఘం రాష్ట్రాల హ‌క్కుల‌ను కాల‌రాస్తూ సూప‌ర్ కేబినెట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న విమ‌ర్శ‌లూ వ‌చ్చాయి.

మ‌రో ముఖ్యమైన విష‌య‌మూ ఉంది. 1950 ఫిబ్ర‌వ‌రిలో కేంద్రప్ర‌భుత్వం త‌ర‌ఫున బ‌డ్జెట్‌ప్ర‌వేశ పెడుతూ నాటి ఆర్థిక మంత్రి జాన్ మాతై- త‌న ప్ర‌సంగంలో, ప్ర‌ణాళికా సంఘం ఏర్పాటు చేయాల‌న్న ప్ర‌భుత్వ సంక‌ల్పం గురించి ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత  కేంద్ర కేబినెట్ నిర్ణ‌యంతో మార్చి 15 న ప్ర‌ణాళికా సంఘం అమ‌లులోకి వ‌చ్చింది. అయితే ప్ర‌ణాళికా సంఘం ఏర్పాటును బ‌డ్జెట్‌లో ఘ‌నంగా ప్ర‌క‌టించిన జాన్ మాతై ఆ త‌ర్వాత ఇదే ప్ర‌ణాళికా సంఘం సూప‌ర్ కేబినెట్‌గా మారింద‌ని ఘాటైన వ్యాఖ్య‌లు చేస్తూ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు.

ప్ర‌ణాళికా సంఘం తీరును మొద‌టి పాల‌నా సంస్క‌ర‌ణ‌ల క‌మిష‌న్ కూడా వేలెత్తి చూపింది. స‌ల‌హా మండ‌లి కాస్తా పాల‌నాప‌ర‌మైన అంశాల‌లో జోక్యం చేసుకుంటోంద‌ని తేల్చి చెప్పింది. ఆ త‌ర్వాతి కాలంలో పాల‌కులు దీనిని మ‌రింత ప్ర‌యోజ‌న‌క‌ర సంస్థ‌గా, మేధావుల కేంద్రంగా తీర్చిదిద్దాల్సింది పోయి కేంద్ర ప్ర‌భుత్వంలోని వివిధ విభాగాల‌లో ఇది కూడా మ‌రో  విభాగం అన్న చందంగా త‌యారు చేశారు.

ఇప్పుడు కేంద్ర ప్ర‌భుత్వం `నితి` పేరుతో కొత్త వ్య‌వ‌స్థ‌ను తీసుకురావ‌డంపైనా ఎన్‌.డి.ఎ వ్య‌తిరేక ప‌క్షాలు విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తున్నాయి. పేరు మార్పు త‌ప్ప ఏముంద‌ని పెద‌వి విరుస్తున్నాయి. అయితే కేంద్రం ఇంకా కొత్త వ్య‌వ‌స్థ విధి విధానాలేమిటో స్ప‌ష్టం చేయ‌లేదు క‌నుక అప్పుడే దానిపై విమ‌ర్శ‌లు చేయ‌డం  తొంద‌ర‌పాటే అవుతుంది.  `నితి` ఆయోగ్ కింద ప్రాంతీయ మండ‌ళ్లు ఏర్పాట‌వుతాయ‌ని చెబుతున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రాల‌కు విధానాలు వెళ్ళే ప‌ద్ధ‌తికి స్వ‌స్తి చెప్పి రాష్ట్రాల‌కు నిజ‌మైన భాగ‌స్వామ్యం క‌ల్పిస్తామ‌ని, అది ఈ కొత్త వ్య‌వ‌స్థ ద్వారా సాధ్య‌మౌతుంద‌ని ప్ర‌ధాని కార్యాల‌యం అంటోంది. రాష్ట్రాల భాగ‌స్వామ్యంతో దీనిని మ‌రింత స‌మ‌ర్ధ సంస్థ‌గా తీర్చిదిద్దుతామ‌ని ఎన్‌.డి.ఎ పాల‌కులు చెబుతున్నారు. మంచిదే. అయితే దీనిపై ఇంకా లోతైన చ‌ర్చ జ‌రిగితే బాగుంటుంది. ఆర్థిక‌రంగ నిపుణుల‌తో, సామాజిక వేత్త‌ల‌తో చ‌ర్చ జ‌రిగి, కొత్త వ్య‌వ‌స్థ దేశ స‌రికొత్త స‌వాళ్ల‌కు దీటుగా నిల‌బ‌డ‌గ‌లిగేదిగా ఉండాలి. నిరుపేదల జీవితాల‌లో వెలుగులు నింపేదిగా ఉండాలి.

-రేవూరు ఉమామ‌హేశ్వ‌ర‌రావు

Have something to add? Share it in the comments

Your email address will not be published.