ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలి : కిషన్ రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 23: హైకోర్టు అభిప్రాయాన్ని పరిగణలోనికి తీసుకొని ఫాస్ట్ పథకాన్ని పునరాలోచించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు బకాయిలను చెల్లించకపోవడం వల్ల కళాశాలల యాజమాన్యాలు విద్యార్ధులకు సర్టిఫికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయని అన్నారు. దీనివల్ల విద్యార్దులు పై చదువులకు చదుకోవడానికి వెళ్లలేకపోతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

అదేవిధంగా రుణ మాఫీ పథకం ఆలస్యం కారణంగా 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆధార్‌ కార్డుతో సంబంధం లేకుండా అందరికీ రుణ మాఫీ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు బడ్జెట్ ను ప్రవేశపెట్టకుండా ఆర్డినెన్స్ ద్వారా బడ్జెట్ ను ఆమోదింప చేసుకోవాలనుకోవడం సరైందికాదన్నారు. ప్రజస్వామ్యంలో ప్రతిపక్షాల అభిప్రాయాలను, ఆలోచనలను పరిగణలోకి తీసుకోవాలని లేని పక్షంలో హైకొర్టు, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.