బంగారు దత్తాత్రేయ : కేసీఆర్

హైదరాబాద్, నవంబర్ 15: లోకంలో అందరికి బండారు దత్తాత్రేయ అయినా నా దృష్టిలో తెలంగాణకు బంగారు దత్తాత్రేయ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కొనియాడారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు లోని జలవిహార్ లో దత్తాత్రేయకు తెలంగాణ ప్రభుత్వం తరపున శనివారం జరుగుతున్న పౌరసన్మాన కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అవతరించిన తరువాత రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి వర్గంలో స్థానం పొందిన మొట్టమొదటి వ్యక్తిగా దత్తత్రేయ పేరు చిరస్థాయిలో నిలబడుతుందన్నారు. కేంద్రంలో తెలంగాణ మనిషి లేడన్న వెలితి దత్తాత్రేయ వల్ల తీరిందని అన్నారు. అలయ్ బలయ్ పేరుతో రాజకీయాలకు అతీతంగా అందరిని ఒకే వేదికపైకి తీసుకొచ్చిన ఘనత దత్తాత్రేయకు దక్కుతుందన్నారు. అటువంటి అలయ్ బలయ్ కార్యక్రమాన్ని కొనసాగించాలని కేసీఆర్ కోరారు. తొలి తెలంగాణ కేంద్ర మంత్రిగా దత్తాత్రేయను తెలంగాణ ప్రభుత్వం సత్కరించుకోవడం, తెలంగాణ సమాజం తనను తాను సత్కరించుకోవడమే అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

 

సిక్కిం మాజీ గవర్నర్ రామారావు లేకపోతే రాజకీయాల్లోకి  వచ్చేవాడ్ని కాదని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. రాజకీయాల్లో ఎదగడానికి రామారావు కారణమని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పౌరసన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి తొలి కేంద్రమంత్రి కావడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే, తాను తొలి కేంద్రమంత్రి అని ఆయన అన్నారు. గతంలో అంజయ్య, వెంకటస్వామి, కేసీఆర్ లు కార్మికశాఖ నిర్వహించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా తెలంగాణ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానన్నారు. రాష్ట్రానికి సంపూర్ణ సహాయ, సహకారం అందిస్తానని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హామీ ఇచ్చారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.