బడ్జెట్ సమావేశాలపై మంత్రివర్గం చర్చ

  • గవర్నర్ ప్రసంగానికి మంత్రివర్గం ఆమోదం
  • తలసాని నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం.
  • రెండున్నర గంటల పాటు తెలంగాణ మంత్రివర్గ సమావేశం

హైదరాబాద్: బడ్జెట్ సమావేశాలు శనివారం నుంచి ప్రారంభమవుతున్న తరుణంలో అసెంబ్లీ నిర్వహణమై రాష్ట్ర మంత్రివర్గం గురువారం సమావేశం అయింది. దాదాపు రెండున్నర గంటలపాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలకమైన అంశాలపై చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఈ భేటీ వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. అయితే పలు ఆర్డినెన్స్ లపై మంత్రివర్గం ఆమోదం తెలిపనట్లు తెలిసింది. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు సారథ్యంలో జరిగిన ఈ సమావేశంలో అసెంబ్లీ తొలి రోజున గవర్నర్ ప్రసంగ పాఠానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు ఆర్డినెన్స్ లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వాణిజ్య పన్నుల శాఖలో వివిధ రాష్ట్రాల్లో పన్నుల వసూలును అధ్యయనం చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఎంఎల్సీ ఎన్నికల్లో ఆయా జిల్లాల మంత్రులే భాద్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి మంత్రులను ఆదేశించారు. బడ్జెట్ సమావేశాలకు మంత్రులంతా సన్నద్దంగా ఉండాలని సమావేశం నిర్ణయించింది.

వాణిజ్యపన్నుల శాఖ పన్ను వసూలుపై మంత్రివర్గంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. వివిధ రాష్ట్రాల్లో పన్నుల వసూలు ప్రక్రియను అధ్యయనం చేయాలని మంత్రివర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ఏ రాష్ట్రంలో పన్ను వసూలు ప్రక్రియ సక్రమంగా జరుగుతోందో దానినే అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నాయకత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.

వరంగల్ పోలీస్ కమీషనరేట్ ను ఏర్పాటు చేస్తూ మరో ఆర్డినెన్స్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తెలంగాణ తాగు నీరు ప్రాజెక్టు భూసేకరణ కోసం ప్రభుత్వం ఇటీవలనే  జారీచేసిన ఆర్డినెన్స్ కు మంత్రివర్గం ఆమోదముద్ర తెలిపింది. తెలంగాణ ఉద్యాన శాఖకు కొండాలక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వ్యాట్ సవరణలపై మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పార్లమెంట్ సెక్రటరీల నియామకాలకు సంబందించిన ఆర్డినెన్స్ పై  మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మార్కెట్ కమిటీల రద్దు పై ప్రభుత్వం ఆర్డినెన్స్ ను తెచ్చింది. దీనికి కూడా మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఎంఎల్సీ ఎన్నికలు జరిగే జిల్లాల్లో మంత్రులు భాద్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. మంత్రులు సమన్వయంతో ఎంఎల్సీ ఎన్నికల్లో వ్యవహారించాలని సూచించారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చించారు. ఆయా శాఖలకు సంబందించిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులే సమాధానాలు చెప్పాలని ముఖ్యమంత్రి సూచించారు. సమావేశాలకు మంత్రులంతా సన్నద్దం కావాలని సూచించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.