బయటోళ్లకి జాతర… మనోళ్లకి పాతర

  • కలెక్టర్ యువరాజ్ తీరుపై విమర్శలు
  • టెండర్ లేకుండానే రాజ్ మతాజ్ కు విశాఖ ఉత్సవ్ బాధ్యతలు
  • చెన్నై ఆర్టిస్టులు, సంస్థలకే పెద్దపీట

విశాఖపట్నం : విశాఖ ఉత్సవ్ నిర్వహణలో జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్ వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ప్రాంతీయ వివక్షతను ఉత్సవ్ నిర్వహణ ఏర్పాట్లలో ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. తమిళనాడుకు చెందిన యువరాజ్ అంతటా అక్కడి సంస్థలు, కళాకారులకు మేలుచేసే విధంగా పనిచేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఎటువంటి టెండర్లు పిలవకుండా, మరే ఇతర సంస్థల ప్రతిపాదనలు తీసుకోకుండా చెన్నై వ్యక్తి మీనాక్షీ అనంతరామన్ కు చెందిన రాజ్ మతాజ్ కు నిర్వహణ బాధ్యతలు కట్టబెట్టడం, అలాగే తమిళనాడుకు చెందిన సినీ నటులు, కళాకారులతో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కలెక్టర్ తమిళనాడు భక్తికి నిదర్శనంగా ఉదహరిస్తున్నారు. విశాఖ ఉత్సవ్ లో స్థానిక కళాకారులు, సంస్థలు లెక్కలేనంత మంది ఉండగా, కలెక్టర్ మాత్రం అంతటా తమిళ గుబాళింపులకే ప్రాధాన్యం ఇస్తున్నారని విశాఖలోని కళాకారుల సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. ప్రముఖ కళాకారులకు ప్రదర్శనలు ఏర్పాటు చేయడంపై అభ్యంతరాలు లేవుగానీ, స్థానికంగా ఉన్న వారిని విస్మరించడం అన్యాయమని చెబుతున్నారు. అక్కడున్న సంస్థల నుంచి డబ్బు సమీకరించి ఉత్సవాలు చేసి తమిళనాడు కళాకారులకు డబ్బు చెల్లింపులు చేయడం స్వార్ధపూరితమని వారంతా విమర్శిస్తున్నారు.

ఈ నెల 23, 24, 25 తేదీల్లో నగరంలో భారీఎత్తున విశాఖ ఉత్సవ్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు అవసరమయ్యే నాలుగైదు కోట్ల రూపాయలను నగరం చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వరంగ, ప్రైవేటు సంస్థల నుంచి సేకరించాలని నిర్ణయించారు. ఉత్సవ్ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడులు హాజరుకానున్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ వేడుకల నిర్వహణ బాధ్యతను కలెక్టర్ యువరాజ్ నగరంలోని రాజ్ మతాజ్ అనే సంస్థకు అప్పగించారు. ఈ సంస్థకు బాధ్యతలను ఇవ్వడం ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది. ఈవెంట్ మేనేజ్మెంట్ చేసే సంస్థలు చాలా ఉన్నాయి. దీనికి టెండర్లు పిలవాల్సి ఉంది. పోనీ నగరంలో ఉన్న సంస్థల నుంచి కనీసం కొటేషన్స్ అయినా సరే తీసుకోవాలి. అలాంటిదేమీ లేకుండా రాజ్ మతాజ్ కు కలెక్టర్ యువరాజ్ తమిళనాడుకు చెందిన వారు కావడంతో అదే ప్రాంతానికి చెందిన మీనాక్షీ అనంతరామన్ నడుపుతున్న రాజ్ మతాజ్ కు నిర్వహణ బాధ్యతలు ఇచ్చేశారని చెబుతున్నారు.

రాజ్ మతాజ్ సంస్థ ఉత్సవ్ లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే సినీ నటులు, కళాకారులను కూడా ఎక్కువగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారినే ఎంపిక చేశారన్న విమర్శలను కళాకారులు చేస్తున్నారు. సినీ నటి శోభనచే కూచిపూడి నృత్యప్రదర్శనను ఉత్సవ్ లో ఏర్పాటుచేశారు. ఈమె కూడా తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారేనని చెబుతున్నారు. అలాగే డివైన్ స్పిరిట్ పేరిట మాల్ఖమ్ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఇది కూడా తమిళనాడుకు చెందిన బృందాలవే. అలాగే వాయిద్యకారుడు శివమణి ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈయన కూడా తమిళ రాష్ట్రానికి చెందినవారు. శివమణితో పాటుగా వారిజాశ్రీ వేణుగోపాల్, హరమ్రీత్ మన్ సెట్టాల ఫ్లూట్, కీబోర్డు ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ బృందం కూడా తమిళనాడుకు చెందినదే. ఈ శివమణి బృందానికి ఏడు లక్షల రూపాయలను ఫీజుగా చెల్లింపులు చేస్తున్నారు. అంతేగాక వారికి ఎయిర్ టిక్కెట్స్, బస చేయడానికి స్టార్ హోటల్స్ లో రూమ్ లు వంటి భారం కూడా ఉత్సవ్ బడ్జెట్ పైనే వేశారు. అయితే శివమణి, శోభన వంటి ప్రముఖుల కార్యక్రమాలను ఏర్పాటు చేయడాన్ని ఎవరూ తప్పుబట్టకపోయినా సరే, వారితో పాటుగా స్థానికంగా ఉన్న ప్రముఖులకు కూడా అవకాశం ఇస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.

అలాగే జానపదం, వ్యాఖ్యానం, మిమిక్రీ, మ్యాజిక్, సాంగ్స్, నృత్యాలు వంటి కళల్లో స్థానికంగా విశాఖలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖులు ఉన్నారు. దేశంలోని ప్రముఖ పట్టణాలతో పాటుగా, అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో ప్రదర్శనలిచ్చి మన్ననలు పొందిన సందర్భాలెన్నో ఉన్నాయి. జానపదంలో తిమ్మారెడ్డితోపాటుగా కె.కోటపాడు, ఆనందపురం, తగరపు వలస ప్రాంతాల్లో ఎంతో ప్రముఖ కళాకారులున్నారు. అయితే ఉత్సవ్ లో జానపదాలైన తప్పెటగుళ్లు, కోలాటం, సాముగరిడీలు, గంగిరెద్దులు, బగ్నబృందాలు వంటి వాటికి చోటే లేదు. అంతేగాక వ్యాఖ్యానంలో రాంభట్ల నృశింహశర్మ, రాజేంద్రప్రసాద్, సుహాసినీ ఆనంద్, బీశెట్టి నూకేశ్వరరావు వంటి వారున్నారు. వీరెవ్వరినీ కాదని టీవీ యాంకర్లుగా ఉన్న శిల్పా చక్రవర్తి, గాయిత్రీ భార్గవిలను ఎంపిక చేశారు. అలాగే కామెడీకి మిమిక్రీ, మ్యాజిక్ షోలుచేసే బొట్టా నాగేశ్వరరావు, ఖాజా, భేరి ఉమామహేశ్వరరావు వంటి ప్రముఖులున్నారు. వీరిని కాదని జమర్దస్త్, తడాఖా టీవీ షోల నుంచి ఎంపికచేసి పెట్టారు.

కూచిపూడిలో నగరానికి చెందిన కళాకారిణి లిపికారెడ్డి అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. ఆమెకీ ఉత్సవ్ లో చోటు దక్కలేదని తెలసింది. ఇలా స్థానిక కళాకారులను కాదని, తమిళనాడుకు చెందిన వారికీ, ఇతర ప్రాంతాలకే పెద్దపీట వేస్తే స్థానిక కళాకారులకు పరిస్థతి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆయా రంగాల్లో ఎవరికివారే ప్రతిభావంతంగా ఉన్నా సరే వారిని గుర్తించకుండా రాజ్ మతాజ్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఉత్తరాంధ్ర కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఉత్సవ్ అంటే ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉండాలి తప్పితే, ఇతర ప్రాంతాల వాసన కాదని మండిపడుతున్నారు.

స్థానికులకు పెద్దపీట వేయాలి -చెన్నా తిరుమలరావు, ఘంటశాల కల్చరల్ అకాడమీ

విశాఖ ఉత్సవ్ లో స్థానిక కళాకారులకు అవకాశం ఇవ్వాలి. కళలకు అంకితమై అపార ప్రతిభా పాటవాలు కలిగిన వారున్నారు. జానపదం, తప్పెటగుళ్లు, కోలాటలు ఉత్తరాంధ్ర సంస్కృతి వాటికి స్థానం లేకపోవడం దారుణం. ఈ విషయాన్ని మంత్రి గంటా దృష్టికి కూడా తీసుకువెళ్లా. అయినా సరే స్పందించలేదు. ఉత్సవ్ నిర్వహణ ఏకపక్షంగా సాగుతోంది. స్థానికులకు కళలను ఉత్సవ్ లో భాగం చేయ్యకపోతే పాలకులను నిలదీస్తాం.

ఉత్తరాంధ్ర సంస్కృతిని విస్మరించారు -దేవిశ్రీ, ప్రముఖ గాయకుడు

ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని సంస్కృతి, సంప్రదాయాలు ఉత్సవ్ లో ప్రతిబింబించేలా ఉండాలి. ఉత్తరాంధ్ర కళాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభా పాటవాలను చాటి చెప్పారు. వీరందరికీ స్థానం కల్పించాలి. ప్రముఖులకు స్థానం కల్పించడం తప్పు కాదు కానీ, అదే సమయంలో లోకల్ టాలెంట్ కు ప్రాధాన్యతను ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. స్థానికులకు అవకాశం ఇవ్వకపోతే ఆటా పాటా వంటి కార్యక్రమాలతో నిరసన తెలియచేస్తా.

-న్యూస్ లీడర్ సౌజన్యంతో

Have something to add? Share it in the comments

Your email address will not be published.