‘బసంతి’ ఆడియో ఫంక్షన్ లో పవన్

Basanti-Audio-Launch

బ్రహ్మానందం తనయుడు గౌతమ్ నటిస్తున్న ‘బసంతి’ సినిమా ప్రమోషన్ ని పతాక స్థాయికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం తనకున్న ఇమేజ్ చక్కగా వాడుకున్నాడు.
ఈ సినిమా ట్రైలర్ ను మహేష్ బాబు చేత రిలీజ్ చేయించగా, ఓ పాటను ఎన్టీఆర్ చేత, మరో పాటను అల్లు అర్జున్ చేత వెరైటీగా రిలీజ్ చేయించి, ఆఖరికి ఆడియో మొత్తాన్ని ఏకంగా పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా రిలీజ్ చేయించాడు.

ఈ ఆడియో వేడుక హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్ లో ఘనంగా జరిగింది. వేడుకకు రాలేకపోయిన చిరంజీవి ఇచ్చిన వీడియో బైట్ ను ప్రదర్శించారు.
“గౌతమ్ నాకు బిడ్డలాంటి వాడు. తల్లి పోలికను, తండ్రి ప్రతిభను పుణికిపుచ్చుకున్నాడు. మంచి హీరోగా రాణించగలిగే అన్ని లక్షణాలూ తనలో వున్నాయి. తను నాకు పసితనం నుంచీ తెలుసు. మా ఇంటికి వచ్చి చరణ్ తో ఆడుకునేవాడు. మా చరణ్ కి విజయం వస్తే ఎంతగా ఆనందిస్తానో, గౌతమ్ కి వచ్చినా అంతకు రెట్టింపు ఆనందిస్తాను.
తనయుడి సక్సెస్ కోసం బ్రహ్మానందం ఎంతగా తపిస్తున్నాడో నాకు తెలుసు. అలాగే డైరెక్టర్ చైతన్య ‘బాణం’ సినిమా బాగా తీశాడు. ఇది కూడా బాగా తీశాడని అనుకుంటున్నాను” అంటూ చిరంజీవి తన విషెస్ ని వీడియో బైట్ చెప్పారు.

ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. దర్శకుడు చైతన్య తీసిన ‘బాణం’ సినిమా చూసాను. చాలా బాగా తీసారు. ‘బసంతి’ మూవీ కూడా మంచి సినిమా అవ్వాలని, గౌతమ్ కి మంచి సక్సెస్ మరియు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరుకుంటున్నానన్నారు.

ప్రముఖ బాలీవుడ్ హాస్యనటుడు జానీలీవర్ ఈ వేడుకకు ప్రత్యేకంగా విచ్చేసి, బ్రహ్మానందం పట్ల తనకున్న అభిమానాన్నీ, గౌరవాన్నీ చాటుకున్నాడు. తన హాస్యంతో అందర్నీ కాసేపు నవ్వించాడు.
ఇంకా ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యుడు సుబ్బరామిరెడ్డితో బాటు పలువురు చిత్ర ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ విచ్చేయడంతో ప్రమోషనల్ గా సినిమాకు మంచి మైలేజీ వచ్చింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.