బాక్సాఫీస్ దుమ్ము దులుపుతున్న ‘ధూమ్-3’

బాలీవుడ్ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేనంతగా భారీ అంచనాలతో ధూమ్-3 చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 4 వేల థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం తొలి రోజే హిట్ టాక్ సంపాదించింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను రాబట్టిన ధూమ్3, భారీ కలెక్షన్ల దిశగా దూసుకుపోతోందని విమర్శకులు సైతం కితాబిస్తున్నారు. మొదట్నుంచి ఈ సినిమాపై వెయ్యి కోట్ల రూపాయలను కొల్లగొడుతుందన్న భారీ అంచనాలున్నాయి. ఈ అంచనాలు నిజమవుతాయా? లేదా? అన్నది తేలాలంటే, మరి కొన్ని రోజులు ఆగాలి!

ఇక చిత్ర కథాంశంలోకి వెళ్తే… షికాగోలోని గ్రేట్ ఇండియన్ సర్కస్ కు ఇక్బాల్ (జాకీష్రాఫ్)యజమాని. కాలక్రమంలో గ్రేట్ ఇండియన్ సర్కస్ అప్పుల్లో కూరుకుపోతుంది. దీంతో సర్కస్ ను గట్టెక్కించడానికి ఆర్థిక సహకారం కోసం వెస్టర్న్ బ్యాంక్ ఆఫ్ షికాగో అధికారులను ఇక్బాల్ కలుస్తాడు. కానీ వారిని మెప్పించి ఒప్పించడంలో ఇక్బాల్ విఫలమౌతాడు. దీంతో ఆత్మహత్య చేసుకుంటాడు. తండ్రి ఆత్మహత్యతో అతని కొడుకు సాహిర్ (అమీర్ ఖాన్) ఒంటరి వాడవుతాడు. తండ్రి మరణానికి కారణమైన వెస్టర్న్ బ్యాంక్ ఆఫ్ షికాగో అధికారులపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలో దొంగగా మారి, వెస్టర్న్ బ్యాంక్ ను కొల్లగొట్టడం ప్రారంభిస్తాడు. సాహిర్ దెబ్బకు చివరకు ఆ బ్యాంకు దివాళా తీస్తుంది. ఈ క్రమంలో అమెరికా పోలీసు అధికారులు సాహిర్ ను పట్టుకోవడానికి ముంబైలోని టాప్ పోలీస్ ఆఫీసర్లు జై దీక్షిత్ (అభిషేక్ బచ్చన్), అలీఖాన్ (ఉదయ్ చోప్రా)లను యూఎస్ రప్పిస్తారు. ఈ క్రమంలో జై దీక్షిత్, అలీఖాన్ లు సాహిర్ ను పట్టుకుంటారా?, వీరి కళ్లుగప్పి బ్యాంక్ ను కొల్లగొట్టడానికి సాహిర్ ఎలాంటి ఎత్తుగడలను వేశాడు? అనేదే ధూమ్-3 సినిమా.

నటీనటుల విషయానికొస్తే… ఈ సినిమాలో అమీర్ ఖాన్ విశ్వరూపమే చూపించాడు. నెగటివ్ క్యారెక్టర్ ను కూడా సినీ అభిమానులు ఆరాధించేంతగా అమీర్ ఈ సినిమాలో డామినేట్ చేశాడు. సర్కస్ కంపెనీని నడిపే యత్నంలో అమీర్ పలికించిన అభినయానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. దీనికితోడు కత్రినా కైఫ్ ఈ సినిమాకు తన అందంతో కలర్ తీసుకొచ్చింది. కేవలం గ్లామర్ పరంగానే కాకుండా, ఎమోషన్స్ పలికించడంలో కూడా కేట్ ఈ సినిమాలో మంచి మార్కులు కొట్టేసిందనే చెప్పాలి. ఇక అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రాల విషయానికొస్తే షరా మామూలే! ధూమ్-1, ధూమ్-2 మాదిరిగానే తమ పాత్ర వరకు న్యాయం చేయగలిగారు. వీరిద్దరి పాత్రల్లో పెద్దగా కొత్తదనమేమీ కనిపించలేదు. అయితే సాహిర్ తండ్రి ఇక్బాల్ పాత్రలో నటించిన జాకీ ష్రాఫ్ అద్భుత రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

ధూమ్-1, ధూమ్-2 చిత్రాలకు రచయితగా పనిచేసిన విజయ్ కృష్ణ ఆచార్య.. ధూమ్3కి దర్శకుడిగా మారాడు. ఈ సినిమాను ప్రేక్షకులకు చేరువ చేయడంలో విజయ్ కృష్ణ పూర్తిగా విజయవంతం అయ్యాడు. ఈ సినిమాపై అతను చెరగని ముద్ర వేశాడనే చెప్పాలి. సినిమాను ప్రారంభం నుంచి చివరి దాకా ఎక్కడా బోర్ కొట్టించకుండా, ఎగ్జయిటింగ్ గా నడిపించాడు. ప్రీతమ్, జూలియస్ పాకియమ్ ల మ్యూజిక్ సినిమాకు మరింత వన్నె తెచ్చింది. ఇక కెమెరా విషయంలో ఎంత ఎక్కువ చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాను హాలీవుడ్ లెవెల్లో తెరకెక్కించాడు కెమెరా మెన్ సుదీప్ చటర్జీ.

ఏదేమైనప్పటికీ 2013 చివర్లో బాలీవుడ్ నుంచి ఓ అద్భుతమైన సినిమా వచ్చిందనే చెప్పుకోవాలి. సినీ వర్గాల అంచనాల ప్రకారం ధూమ్-3 వెయ్యి కోట్ల మార్కును అందుకుంటే రానున్న రోజుల్లో హాలీవుడ్ కి బాలీవుడ్ సవాల్ విసిరినట్టే!

Have something to add? Share it in the comments

Your email address will not be published.