బానిసబుద్ధితో కట్టప్ప వెన్నుపోటు ఆదర్శమా? మోడీజీ!

బానిసబుద్ధితో కట్టప్ప వెన్నుపోటు ఆదర్శమా? మోడీజీ!

అనుయాయులందరూ ప్రధాని మోడీని బాహుబలితో పోల్చుకుని క్యారికేచర్లు కూడా పెట్టారు. కాని ఆయనేమో తనను తాను కట్టప్పనని ప్రకటించుకున్నారు. కట్టప్పలా దేశం కోసం పనిచేస్తానన్నారు. స్వతహాగా బానిస బుద్ధి గల కట్టప్ప దేశభక్తయోధుడైన అమరేంద్ర బాహుబలిని వెన్నుపోటు పొడిచి చంపిన వ్యక్తి. ఎందుకు చేశాడో పెద్ద రహస్యమంటూ వూరిస్తున్నా చంపింది తానేనని మాత్రం ఆయనే చెప్పేశాడు. రాజసింహాసనానికి కట్టుబానిస గనుక అక్కడున్న వారు చెప్పింది చేశాడని అర్థం చేసుకోవచ్చు. ఇతర మలుపులూ మసాలాలూ ఏవో పెట్టి వుంటారు.

ఏమైనా సరే కట్టప్ప రాచరిక భావనాలు నరనరాన జీర్ణించుకుపోయి తనను తాను న్యూనత పర్చుకుంటూ వుంటాడు. చిన్న బాహుబలి కనిపించగానే పాదం తీసి నెత్తిన పెట్టుకుంటాడు. భల్లాల దేవుడి వంటి వ్యక్తిని నమ్మకంగా సేవిస్తుంటాడు. ఇందులో ఔన్నత్యం గాని ఆదర్శం గాని ఏమున్నాయని మోడీగారు కట్టప్పగా ప్రకటించుకుంటున్నారు? ఆరెస్సెస్‌ సంఘ పరివార్‌ పట్ల తన విధేయతను చెబుతున్నారా? లేక మరేదైనానా? కాలం చెల్లిన కట్టుబానిసత్వం, వీర విధేయత ఆధునిక ప్రజాస్వామ్యంతో పొసుగుతాయా? మోడీ గారి అవాకులలో మరో ఆణిముత్యంగా దీన్ని పరిగణించాలేమో! ఇవన్నీ అంటే కోడిగుడ్డుమీద ఈకలు పీకడం అని ఆక్షేపిస్తారని నాకు తెలుసు. కాని అత్యున్నత పదవిలో వుండే వారు ఆ మాత్రం బాధ్యతగా ఆలోచించి మాట్లాడాలి కదా? ఇదే మాటలు రాహుల్‌గాంధీయో అరవింద్‌ కేజ్రీవాలో అని వుంటే ఈపాటికి పీక్కు తినేవారు కాదా!

తెలకపల్లి రవి

Have something to add? Share it in the comments

Your email address will not be published.