బాబు బండారాన్ని బయటపెడతాం : కేసీఆర్

హైదరాబాద్, అక్టోబర్ 25: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై తెలంగాణ ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు తెలంగాణకు సైతాన్‌లా వ్యవహరిస్తున్నాడని, తెలంగాణలో పంటలు ఎండబెట్టాలని కంకణం కట్టుకున్నాడని ధ్వజమేత్తారు. విద్యుత్ వాటా విషయంలో ఆయన అసత్య ప్రచారానికి పూనుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబుని వదిలి పెట్టేది లేదని, ఆయనను సుప్రీంకోర్టుకు ఈడుస్తామని, ఆయన బండారాన్ని ఆధారాలతో సహా బయటపెడతామని అన్నారు. చంద్రబాబుతో హైదరాబాద్ ఆబిడ్స్ సెంటర్ లో గాని, విజయవాడ ప్రకాశం బ్యారేజీ పైనా గాని బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎవరి బతుకు వారు బతకాల్సింది పోయి పక్క రాష్ట్రంలో నిప్పులు పోస్తున్నాడని అన్నారు. తాను చెప్పినదాంట్లో ఒక్క తప్పున్నా ముక్కు నేలకు రాసి క్షమాపణ చెబుతానని కేసీఆర్ తెలిపారు. శుక్రవారంనాడు సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం కేసీఆర్ విలేకరులతో మాట్లాడారు.

kcr-media 1

మంత్రివర్గ సమావేశం అనంతరం విలేకరులకు వివరాలు తెలుపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్

చంద్రబాబు చేసిన మోసానికి తెలంగాణ ప్రభుత్వం అదనపు విద్యుత్ కోసం రూ. 608 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టిపరిస్థితిలోనూ తెలంగాణకు రావాల్సిన విద్యుత్‌ను వదిలిపెట్టేది లేదు, ముక్కుపిండి వసూలు చేస్తామన్నారు. చంద్రబాబు చేసిన నష్టంమీద సుప్రీంకోర్టుకు వెళతాం అని స్పష్టం చేశారు. శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తిని ఆపేది లేదని, పంటలను కాపాడుకోవడం తమ మొదటి ప్రాధాన్యతన్నారు. కేటాయించిన జలాల ప్రకారం 81 టీఎంసీల నీరును వినియోగించుకునే హక్కు తెలంగాణకు వుందని కేసీఆర్ స్పష్టం చేశారు.

విద్యుత్ పీపీఏ విషయంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘించారని చంద్రబాబుకు కేంద్ర ఎలక్ట్రిసిటీ అథారిటీ కూడా స్పష్టం చేసింది. అయినప్పటికీ బుద్ధి రాలేదు. చంద్రబాబు దొంగచూపుల వల్ల తెలంగాణ రాష్ట్రం కరెంటుకు కటకటలకు లోనవుతుందన్నారు. చంద్రబాబు చేసిన మోసం వల్ల 82 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను 4 నెలల్లోనే నష్టపోయామని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబు తెలంగాణ పాలిట సైతాన్‌లా దాపురించి ఈ ప్రాంత రైతుల ఉసురు పోసుకుంటున్నారన్నారు. ఇక్కడ పంటలను ఎండబెట్టాలని శపథం పట్టి, పంటలు ఎండి తెలంగాణ ఎడారి అయ్యేవరకు చంద్రబాబుకు నిద్రపట్టే పరిస్థితి లేనట్లుందన్నారు. దేశంలోనే ఇంత నీచాతినీచంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబేనని అన్నారు.

శ్రీశైలం సంయుక్త రాష్ట్ర ప్రాజెక్టు, నీ అయ్య జాగీరు కాదు,  రెండు రాష్ర్టాలకు హక్కు వుంది. 97 టీఎంసీల నీటిని తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించారు. కల్వకుర్తికి 25 టీఎంసీలు, బీమాకు 20 టీఎంసీలు, నెట్టెంపాడు 22 టీఎంసీలు, ఎస్‌ఎల్‌బీసీకి 30 టీఎంసీలు కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్ ను పాలించిన ఆంధ్రా ముఖ్యమంత్రులు తెలంగాణకు న్యాయం చేయకుండా రెండు దశాబ్దాల పాటు ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం చేసి అన్యాయం చేశారన్నారు.

చంద్రబాబు దొంగ చూపువల్లనే తెలంగాణకు చట్టప్రకారం రావల్సిన కరెంటు రాలేదు. శ్రీశైలంలో ఉత్పత్తి నిలిపివేస్తే 300 మెగావాట్లు సరఫరా చేస్తామంటున్నారు. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జారీచేసిన జీవో 69 ప్రకారం 834 అడుగుల నీటిమట్టం వరకు కరెంటు ఉత్పత్తి చేయవచ్చు. దానిని వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జీవో 107 ప్రకారం 834 నుంచి 854 అడుగులకు పెంచితే దానిని తీవ్రంగా వ్యతిరేకించి, దేవినేని ఉమ, ధూళిపాళ నరేంద్ర ఆధ్వర్యంలో ఆనాడు ప్రకాశం బ్యారేజీవద్ద ఆందోళన చేశారు. చంద్రబాబు కూడా అక్కడికి వెళ్ళి ప్రసంగిస్తూ ఈ జీవోను వ్యతిరేకించారు. 834 అడుగుల వరకు శ్రీశైలం నీటిని వినియోగించుకోవచ్చని చంద్రబాబే ఆనాడు చెప్పారు. దానిని మేం ఖచ్చితంగా 834 అడగుల వచ్చేంతవరకు శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ఆపేది లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.

రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలు యధాతథంగా అమలయ్యేలా చూడాలని, తెలంగాణను ఆదుకోవాలని ప్రధాని నరేంద్రమోదీకి కేసీఆర్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.Recent Posts
Recent Posts