బృహత్ వాటర్ గ్రిడ్ కి శ్రీకారం

kcr-watergrid-12

  • తెలంగాణలో ప్రతి ఇంటికీ మంచినీరు సరఫరా
  • సిద్ధిపేట నమూనా రాష్ట్రవ్యాప్తంగా అమలు
  • గ్రామాలలో ఇంటికి 100 లీటర్లు, పట్టణాలలో 150 లీటర్లు
  • 25వేల గ్రామీణ ఆవాసాలకూ, 67 పట్టణ ప్రాంతాలకూ లబ్ది

ప్రతి ఇంటికీ మంచినీటిని అందించే లక్ష్యంతో వాటర్ గ్రిడ్ పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.  ప్రతి ఇంటికీ రోజుకి గ్రామాల్లో 100 లీటర్లు, పట్టణాల్లో 150 లీటర్లను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. తెలంగాణలో ఉన్న మెత్తం 25 వేల గ్రామీణ అవాసాలకు, 67 పట్టణ ప్రాంతాలకు పైపులైన్ల ద్వారా నిరంతర సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళనుంది. 2050 నాటికి యావత్ తెలంగాణలో తాగునీరు, పరిశ్రమల అవసరాలను తీర్చడం కోసం 26 గ్రిడ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం గోదావరి నుంచి 34 టీఎంసీలు, క్రిష్ణా నుంచి 21.41 టీఎంసీల నీటిని వాడుకోవాలన్నది ప్రభుత్వం ప్రాథమిక అంచనా.

వాటర్ గ్రిడ్ పథకాన్ని సిద్దిపేట నమూనాలో తెలంగాణ రాష్ట్రమంతటా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. టెక్నాలజీ అందుబాటులో లేని కాలంలోనే చేపట్టిన పథకం సత్ఫలితం ఇవ్వడంతో, ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం వాటర్ గ్రిడ్ ను చేపట్టనుంది. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకొంటూ ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీరు అందించాలని కేసీఆర్ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది.

సిద్ధిపేట మానేరు నీటి సరఫరా పథకాన్ని  1996-97 లో తన నియోజకవర్గంలో కెసిఆర్ ప్రారంభించారు. ప్రతి ఇంటికి నల్లాల ద్వారా  తాగునీరు అందించేందుకు 60 కోట్ల రూపాయాలతో ప్రాజెక్టుకి  రూపకల్పన చేశారు. 20 ఏండ్ల కింద రూపుదిద్దుకున్న సిద్ధిపేట సమగ్ర మంచినీటి సరఫరా పథకమే నేటి వాటర్ గ్రిడ్ కు స్ఫూర్తి. సుమారు 60 కిలో మీటర్ల దూరంలో ఉన్న లోయర్ మానేరు డ్యాం నుంచి సిద్దిపేట నియోజకవర్గంలోని 180 గ్రామాలకు మంచినీరు అందించే పథకం 14 ఏళ్ళుగా నిరంతరాయంగా అమలు జరుగుతోంది. ఇదే తరహాలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలకూ మంచినీటిని అందించాలని ప్రభుత్వం తలపెట్టింది. కరీంనగర్ జిల్లాలో మిడ్ మానేరు డ్యామ్ ద్వారా కరీంనగర్, వరంగల్ జిల్లాలకు మంచినీటిని సరఫరా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కరీంనగర్ జిల్లాతో పాటు వరంగల్ జిల్లాలోని సగభాగం వరకు మంచినీటిని సరఫరా చేయాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. పాలేరు రిజర్వాయర్ నుండి వరంగల్ తూర్పు ప్రాంతానికి మంచినీటిని అందించాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. మహాబూబ్ నగర్ జిల్లాకు శ్రీశైలం ప్రాజెక్టు నుండి నీటిని తీసుకోనుంది. కొల్లాపూర్ నియోజకవర్గంలోని కోడేరు నుండి మూడు జిల్లాలకు మంచినీటిని సరఫరా చేసేలా ప్రభుత్వం వాటర్ గ్రిడ్ పథకానికి రూపకల్పన చేస్తోంది. కోడేరు నుండి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు నీటిని సరఫరా చేయనుంది.

రాష్ట్రంలోని కాంటూర్ల ఆధారంగా వాటర్ గ్రిడ్ కు రూపకల్పన చేయనున్నారు. కాంటూర్ లెవల్స్ తో పాటు ఆయా గ్రామాల్లోని ఓవర్ హెడ్ ట్యాంకుల నిల్వల ఆధారంగా వాటర్ గ్రిడ్ కు ప్రభుత్వం పైపులైన్ల ఏర్పాటు చేస్తోంది. సిద్దిపేట సమగ్ర మంచినీటి పథకం 14 ఏళ్ళుగా విజయవంతంగా నిర్వహించడం తమ దాహార్తిని తీర్చుతోందని సిద్దిపేట వాసులు చెబుతున్నారు.ఈ పథకం ప్రారంభమైన నాటి నుండి ఈ నీటిని తాగుతున్నామని చెబుతున్నారు. ఈ పథకం అమల్లోకి వచ్చిన నాటి నుండి నీటి కష్టాలు తీరాయంటున్నారు సిద్దిపేట ప్రజలు.

సిద్దిపేట మంచినీటి పథకంలో లోటుపాట్లను సరిచేసుకొంటూ, వాటర్ గ్రిడ్ ను రాష్ట్రంలో విజయవంతంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం తలపెట్టిన ఈ కార్యక్రమం ఏ మేరకు సత్ఫలితాలను ఇస్తుందో వేచి చూడాలి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.