బొగ్గు క్షేత్రాల కేటాయింపులను రద్దు చేసిన సుప్రీంకోర్టు

హైదరాబాద్ : 1993 నుంచి వివిధ కంపెనీలకు కేటాయించిన బొగ్గు క్షేత్రాల కేటాయింపులను రద్దు చేస్తూ బుధవారం సుప్రీంకోర్టు చారత్రకమైన తీర్పు వెలువరించింది. 1993 నుంచి వివిధ ప్రభుత్వాలు 218 బొగ్గు క్షేత్రాలను కేటాయించగా అందులో 214 బొగ్గు క్షేత్రాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఇందులో ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన 4 బ్లాకులకు మినహాయింపు ఇచ్చింది. అవి ఎన్టీపీసీ, సెయిల్‌లకు కేటాయించిన ఒక్కో క్షేత్రం, అల్ట్రామెగా పవర్ ప్రాజెక్ట్స్ సంస్థకు కేటాయించిన రెండు క్షేత్రాలు మాత్రమే మినహాయింపు లభించింది. రద్దు చేసిన బొగ్గు క్షేత్రాల్లో పనిని నిలిపేసి, ప్రభుత్వానికి అప్పగించేందుకు మైనింగ్ సంస్థలకు ఆరు నెలల గడువు ఇచ్చింది.

కొన్ని సంస్థలు బొగ్గు కేటాయింపులు పొంది ఎలాంటి పనులూ ప్రారంభించకపోవడం వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని ధర్మాసనం పేర్కొంది. అక్రమంగా కేటాయింపులు పొందినందుకు గాను ప్రభుత్వానికి వాటిల్లిన నష్టానికి టన్నుకు రూ 295 చొప్పున పరిహారం చెల్లించాలని ఆయా కంపెనీలను ధర్మాసనం ఆదేశించింది. ఈ మొత్తం రూ 7,900 కోట్లని అంచనా. జరిమానా మూడు నెలల్లోగా చెల్లించాలని ఆదేశించింది.
బొగ్గు గనుల కేటాయింపు వ్యవహారంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయంటూ యూపీఏ ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్లుగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) పేర్కొంది. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. సాక్షాత్తూ అప్పటి ప్రధానిగా ఉన్న మన్మోహన్‌సింగ్‌కు కూడా దీనితో సంబంధం ఉందని ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలు కూడా దాఖలయ్యాయి. దీంతో స్పందించిన సుప్రీంకోర్టు విస్తృత దర్యాప్తునకు ఆదేశించి, విచారణ చేపట్టింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.