బోధన రుసుముల బకాయిలు చెల్లిస్తాం

హైదరాబాద్ : ఎట్టకేలకు బోధన రుసుముల బకాయిల వ్యవహారం కొలిక్కివచ్చింది. బోధన రుసుముల బకాయిలను ప్రభుత్వం మొత్తం చెల్లిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి శుక్రవారం తెలిపారు. మొదటి విడతగా రూ 500 కోట్లను విడుదల చేయాలని రాష్ట్ర నిర్ణయించిందని ఆయన తెలిపారు.

గత నాలుగేళ్లగా తెలంగాణ విద్యార్ధుల రుసుముల బకాయిలు మొత్తం రూ. 1587.76 కోట్లు ఉన్నట్లు మంత్రి తెలిపారు. వీటిని పూర్తిగా చెల్లించాలని గురువారం జరిగిన కేబినెట్ సబ్‌కమిటీ సమావేశంలో చర్చించి వివరాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా మూడు విడతల్లో చెల్లించాలని సీఎం సూచించారు. ఇందులో భాగంగా మొదటి విడత రూ. 500 కోట్లు నిధుల విడుదలచేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారని మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు. మిగిలిన బకాయిలను రెండు విడతల్లో పూర్తిగా చెల్లిస్తామని అన్నారు.

ఈ బకాయిల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్ధులకు సంబంధించినవి కూడా ఉన్నాయని, వాటిని తెలంగాణ ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు చెల్లించిన ఫీజు బకాయిలను ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తిరిగి వసూలు చేసుకుంటామన్నారు. రద్దయిన ఇంజినీరింగ్ కాలేజీలకు చెల్లించాల్సిన బకాయిలు కూడా చెల్లిస్తామని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలకు తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేకపోయినా విద్యార్థులు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.