భక్తులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకొన్న తితిదే

ttd-eo

ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అధికారుల చర్యలపై ఆందోళనకు దిగిన భక్తులపై తితిదే కేసులు పెట్టింది. ఈ వ్యవహారంలో హిందూ ధార్మిక సంఘాల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో తితిదే వెనక్కి తగ్గింది. భక్తులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. ఇక మున్ముందు కూడా ఇలాంటి ఆందోళనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తితిదే డిప్యూటీ ఈవో రమణ పేర్కొన్నారు.

వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చిన సామాన్య భక్తులను పట్టించుకోకపోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి తోడు వీఐపీ భక్తులకు రెడ్ కార్పెట్ పరచడంతో వారి కోపం కట్టలు తెంచుకుంది. అసలు కేసులు పెట్టాల్సింది భక్తులపై కాదని… తితిదే ఛైర్మన్, ఈవోపై కేసులు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. తిరుమల కొండ అనే బదులు వీఐపీ కొండ అనే పేరు మార్చాలంటూ వారు మండిపడ్డారు. ఏకాదశి రోజున ఏకంగా ఎనిమిది వేల వీఐపీ పాసులు ఇచ్చారని, ఒక్క ఛైర్మన్ పేరు మీద 900కు పైగానే పాసులు జారీ చేశారని వారు విమర్శించారు. అయితే ఈ వ్యవహారంలో రాజకీయ పార్టీల నుంచి ఆరోపణలు రావడంతో తితిదే చివరకు దిగివచ్చి భక్తులపై పెట్టిన కేసులను ఎత్తివేసింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.