భవిష్యత్ కార్యాచరణ

హైదరాబాద్: భవిష్యత్ లో రాష్ట్రంలో చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించనుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు. రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగానే పథకాల రూపకల్పనకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ఈ పథకాలు ప్రజల చెంతకు ఏ మేరకు చేరాయి, రానున్న రోజుల్లో మరింతగా ప్రజలకు ఎలా చేరువకావాలనే దానిపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. ఈ అంశాలపై గురువారం క్యాంప్ కార్యాలయంలో మంత్రులు, పార్లమెంటరీ కార్యదర్శులతో ముఖ్యమంత్రి సమావేశమై చర్చించనున్నారు.

అధికారుల కేటాయింపు పూర్తి కాగానే తన పాలనను చూస్తారని ఇప్పటికే ఎన్నోసార్లు కేసీఆర్ తెలిపారు. ఐఎఎస్ అధికారుల కేటాయింపు పూర్తి అవడంతోపాటు ఉద్యోగుల విభజన ఓ కొలిక్కి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలకు నేరవేర్చేందుకు ఇంకా ఏం చేయాలనే దానిపై కసరత్తు చేయనున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను సమాన స్థాయిలో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ అంశాలన్నింటిపై గురువారం నాటి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయ, హారితహారం లాంటి పథకాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. ఈ పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు అనుసరించాల్సిన కార్యాచరణను నిర్ణయించనున్నారు. ప్రజల్లో ప్రభుత్వ ప్రతిష్ట మరింత ఇనుమడింపజేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడ చర్చించే అవకాశం ఉంది. ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాల్లో చోటు చేసుకొన్న లోటుపాట్లను సమీక్షించుకొని, భవిష్యత్తులో అలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకొనేందుకు వీలుగా ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నారు. అదే విధంగా మంత్రులు, అధికారుల, పనితీరుపై చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటుగా రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చించే అవకాశం లేకపోలేదు.

ఇప్పటికే కొందరు మంత్రులపై విపక్షాలు అవినీతి ఆరోపణలు గుప్పించాయి. ఏకంగా ఒక మంత్రిపై ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు లోకాయుక్తకు ఫిర్యాదు  చేశారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి చెబుతున్నా, ఈ రకమైన ఆరోపణలు ప్రభుత్వానికి ఎంతో ఇబ్బందికి గురిచేస్తున్నాయి. మంత్రులు, పార్లమెంటరీ కార్యదర్శుల మధ్య సమన్వయంతో పని చేయకపోవడం వల్ల కూడ కొన్ని ఇబ్బందులు తలెత్తిన అంశాలు కూడ చోటుచేసుకొన్నాయి. అందరూ కలిసి సమన్వయంతో పనిచేసేందుకు వ్యూహారచన కోసం గురువారం నాటి సమావేశం ప్రాధాన్యతను సంతరించుకొంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.