భాగ్యనగరంలో పోలీసుల తనిఖీలు

police checking-31

హైదరాబాద్, డిసెంబర్ 31: కొత్త ఏడాది వేడుకలను పురస్కరించుకొని పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. తీవ్రవాదుల దాడులు జరుగవచ్చుననే హెచ్చరికలు రావడంతో పోలీసులు నగర పరిధిలో తనిఖీలను చేపట్టారు. కీలక ప్రాంతాల్లో వాహనాలను సోదా చేస్తున్నారు. అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నగర పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. తీవ్రవాదుల దాడులు జరుగవచ్చుననే హెచ్చరికలు రావడంతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. సమశ్యాత్మకంగా ఉన్న పలు చోట్ల పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎలాంటి సమాచారం ఉన్నా దగ్గర్లో ఉన్న పోలీసు స్టేషన్ కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

కొత్త సంవత్సరం వేడుకలు నిర్వహించేవారు ఈ రాత్రి 1 గంటలోపు గానే ముగించాలని లేనిపక్షంలో కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నగరంలోని అన్ని ఫ్లైఓవర్లు మూసి వేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా అవుటర్ రింగ్ రోడ్లపై వాహనరాకపోకలకు పోలీసులు పలు ఆంక్షలను విధించారు. అదే విధంగా ఫాం హౌజ్ లు, రిసార్ట్స్, హోటళ్లలో వేడుకలు నిర్వహించే వారు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని లేని వాటిపై చర్యలు తప్పవంటున్నారు. మధ్యం సేవించి అతి వేగంగా డ్రైవింగ్ చేసే వారిపట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించనున్నారు. దీంట్లో భాగంగా నగరంలోని ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలతో పాటు నగరంలో వివిధ ప్రదేశాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు తెలుపుతున్నారు. ఇందుకోసం హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో 150 ప్రత్యేక బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.