భార్య మృతదేహాన్ని మోస్తూ 10 కిలోమీటర్లు నడిచాడు

భువనేశ్వర్: దేశంలోనే ఒక అత్యంత పేద జిల్లాలో ఎక్కడా జరగకూడని విషాదం చోటు చేసుకుంది. చనిపోయిన తన భార్యను ఆసుపత్రి నుంచి స్వగ్రామానికి తీసుకెళ్ళడానికి వాహనం లభించలేదు ఆ గిరిజనుడికి. ఎలాగైనా భార్యకు తన ఊరిలోనే అంత్యక్రియలు నిర్వహించాలానే సంకల్పంతో ఆమె మృతదేహాన్ని భుజాలపై మోసుకుంటూ ఏకంగా 60 కి.మీ కాలినడకన వెళ్ళడానికి సిద్దపడ్డాడు. కన్నకూతురు వెన్నంటే ఏడుస్తూ వస్తుండగా అలా 10 కి.మీ నడిచాడు.

దానా మాఝీ భార్య అమాంగ్ దేయి., ఒడిశాలోని భవానిపట్న జిల్లా ప్రభుత్వాసుపత్రిలో క్షయవ్యాధికి చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. తన నివాసం మారుమూల ప్రాంతమైన కలహండి కావడంతో ఏదైనా వాహనం ఏర్పాటు చేయమని ఆసుపత్రి అధికారులని ప్రాధేయపడ్డాడు దానా. వారి వైపునుంచి ఎటువంటి సహాకారం లభించకపోవడంతో, చేసేది లేక భార్య మృతదేహాన్ని ఒక దుప్పటి లాంటి వస్త్రంలో చుట్టి కూతురితో పాటు కాలినడకన సొంత ఊరికి ప్రయాణమయ్యాడు.

10 కి.మీ నడక సాగించాక అక్కడే ఉన్న కొంత మంది స్థానిక విలేకరులు వీరిని గమనించి, జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి అంబులెన్సుని ఏర్పాటు చేశారు. కాగా ఒడిశాలోని ప్రభుత్వాసుపత్రుల్లో మరణించిన వ్యక్తుల పార్థివ శరీరాలను వారి స్వస్థలాలకు ఉచితంగా చేరవేసే పథకానికి ప్రభుత్వం ఈ ఫిబ్రవరి నెలలో శ్రీకారం చుట్టింది. ఇందుకు 37 ప్రభుత్వాసుపత్రులకు వాహనాలను సైతం మంజూరు చేసింది.

ఈ ఘటన గురించి కలహండి కలెక్టర్‌ డి.బృందా మాట్లాడుతూ విలేకరుల నుంచి సమాచారం అందగానే అప్పటికప్పుడు అంబులెన్సు ఏర్పాటు చేశామని, అంత్యక్రియల కోసం మరో ప్రభుత్వ పథకం ద్వారా దానా మాఝీ కుటుంబానికి సహాయం చేయవలసిందిగా అధికారులను ఆదేశించామని తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.