భూ పంపిణి పథకం నత్తనడక

(అభినయ)

హైదరాబాద్, అక్టోబర్ 24: నిరుపేద ద‌ళితుల కుటుంబాల‌కు భూ పంపిణి కార్య‌క్ర‌మం న‌త్త‌న‌డ‌క‌న సాగుతోంది. స్వాతంత్య్ర దినోత్స‌వం రోజున ముఖ్యమంత్రి కెసిఆర్ భూ పంపిణి కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించి, పెద్ద ఎత్తున నిధుల‌ను ఖ‌ర్చు చేయాల‌ని నిర్ణ‌యించింది. ల‌బ్దిదారుల ఎంపిక‌, భూ సేక‌ర‌ణ పంపిణి వ్య‌వ‌హారం ప్రభుత్వానికి ఒక స‌వాల్ గా మారింది. కొన్నిజిల్లాలో ఎక‌రానికి 6 ల‌క్ష‌లను ప్ర‌భుత్వం వెచ్చించాల్సి వ‌స్తోంది.

భూ పంపిణి ప‌థ‌కం ప్రారంభించే నాటికి 418 మందిని అర్హులుగా గుర్తించారు. ప‌థ‌కం ప్రారంభించిన రెండు నెలల కాలంలో ఇప్ప‌టివ‌ర‌కు 304 మందికి మాత్ర‌మే భూ పంపిణి జ‌రిగింది. ల‌బ్దిదారుల ఎంపిక‌, భూమి కొనుగోలు, పంపిణి అధికారుల‌కు క‌త్తిమీద సాముగానే మారింది. గ్రామాల్లో భూమి లేని నిరుపేద ద‌ళితుల‌ను గుర్తించ‌డం, భూమి కొనుగోలు చేయ‌డం, అధికారుల‌కు ఇబ్బందిగా మారింది.

భూమి కొనుగోలు కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం ఎక‌రానికి స‌గ‌టున 3ల‌క్ష‌ల‌ 85 వేల‌ను ఖ‌ర్చుచేస్తోంది. అదే వ‌రంగ‌ల్ లాంటి జిల్లాలో 6 ల‌క్ష‌ల‌ను వెచ్చించాల్సి వ‌స్తోంది. పాల‌మూరు జిల్లాలో మాత్రం భూముల రేట్లు తక్కువగా ఉండటంతో ఎక‌రానికి స‌గ‌టున రెండున్న‌ర ల‌క్ష‌ల‌ను చొప్పున కేటాయిస్తోంది. అతి ఎక్కువ‌గా ఖ‌ర్చు చేసి భూమిని కొనుగోలు చేసిన వ‌రంగ‌ల్ జిల్లాలో కేవ‌లం ఆరుగురికి మాత్ర‌మే ఇప్పటివరకు భూమిని పంపిణి చేశారు. ఇప్పటివ‌ర‌కు రాష్ట్రంలో 304 మందికి భూ పంపిణీ జ‌రిగితే, ఆదిలాబాద్ ఒక్క జిల్లాలోనే 103 మందికి ల‌బ్ది చేకూరింది. అయితే  ఈ జిల్లాలో ఎక‌రానికి 4 ల‌క్ష‌ల 33 వేలు చెల్లించి కొనుగోలు చేసింది. పాల‌మూరు జిల్లాలో త‌క్కువ ధ‌ర‌కు భూమి దొరుకుతున్నా, 20 మంది ల‌బ్దిదారుల‌కు మాత్ర‌మే పంపిణి జ‌రిగింది. ఆదిలాబాద్ త‌ర్వాత స్థానాన్ని ముఖ్య‌మంత్రి స్వంత జిల్లా మెద‌క్ రెండ‌వ‌ స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 21 మందికి భూ పంపిణి చేశారు. ముఖ్యమంత్రి స్వంత గ్రామం చింత‌మ‌డ‌క‌లో కేవ‌లం ముగ్గురు మాత్ర‌మే ల‌బ్దిదారులున్నారు. వీరికి కూడ ఈ ప‌థ‌కం వ‌ర్తించింది.

భూ పంపిణీకి ప్ర‌భుత్వ భూమి అందుబాటులో లేక‌పోవ‌డంతో ప్రైవేట్ వ్య‌క్తుల నుండి భూమిని కొనుగోలు చేసేందుకే ప్ర‌భుత్వం మొగ్గుచూపుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 99 మంది ల‌బ్దిదారుల‌కు 242 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని పంపిణి చేశారు. మిగిలినదంతా ప్రైవేట్ వారి నుండి కొనుగోలు చేయాల్సి వ‌చ్చింది. ప్రైవేటు వ్య‌క్తుల నుండి కొనుగోలు చేసిన 544 ఎక‌రాల‌ను 205 మందికి పంపిణి చేసింది.

ప్రైవేట్ వ్య‌క్తుల నుండి భూ పంపిణి కోసం ప్ర‌భుత్వం 2 కోట్ల19 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసింది. ఇంకా 16 కోట్ల 49 ల‌క్ష‌ల నిధులు అందుబాటులో ఉన్నాయి. భూమిలేని నిరుపేద‌ల‌కు భూ పంపిణి కొరకు ప్ర‌భుత్వం నిరంతరంగా నిధుల‌ను ఖ‌ర్చు చేయ‌నుంది. ఈ ప‌థ‌కం న‌త్త‌న‌డ‌క‌న సాగుతోండ‌డంతో నిరుపేద‌లు ఇబ్బంది ప‌డుతున్నారు. కార్య‌క్ర‌మాన్ని వేగ‌వంతం చేయాల‌ని దళితులు కోరుతున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.