మనిషి జీవితానికి యోగా అవసరం : చంద్రబాబు

yoga-29

హైదరాబాద్ సైబర్ కన్వెన్షన్ సెంటర్ లో యోగా శిక్షణా కార్యక్రమంలో మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, చిత్రంలో ఇషా ఫౌండేషన్ సద్గురువు జగ్గి వాసుదేవ్

హైదరాబాద్, జనవరి 29: ఆందోళన, ఒత్తిడితో ఎవరైతే ఉంటారో వాళ్లకు ఏకాగ్రత ఉండదు. దీనివల్ల జ్ఞానపక శక్తి కూడా నశించడంతోపాటు ఆరోగ్యంకూడా దెబ్బతింటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. హైదరాబాద్ సైబర్ కన్వెన్షన్ సెంటర్ లో ఇషా ఫౌండేషన్ సద్గురువు జగ్గి వాసుదేవ్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరిగే యోగా శిక్షణా కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి ఒత్తిడికి లోనైతే ఇబ్బందులకు గురికావడంతోపాటు అనేక శారీరక, మానసిక రుగ్మతలకు దారితీస్తాయన్నారు. వీటిన్నంటిని నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరికి యోగా ఎంతో అవసరమన్నారు. ఇషా ఫౌండేషన్ సద్గురువు జగ్గి వాసుదేవ్ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి పరిష్కారం చూపారని ముఖ్యమంత్రి తెలిపారు.

ప్రతి మనిషి కుటుంబంలోగాని, బైట ప్రపంచంలోగాని, పనిచేసే వాతావరణంలోగాని అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ సమస్యలను ఎదుర్కోవడంలో అనేక సవాళ్లు అధిగమించగలగాలి. ఇలాంటి సవాళ్లను సమర్ధవతంగా ఎదుర్కోవడానికి ఈ యోగా ఎంతో ఉపకరిస్తుందన్నారు. ఈ యోగా వల్ల మనిషి జీవితం ప్రశాంతంగా, ఒత్తిడి లేని జీవితాన్ని గడపడానికి ఉపయోగకరమన్నారు.

ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ప్రధానమైన సమస్య ఒత్తిడిని నియంత్రించకపోవడం. దీనిని నియంత్రిగలిగితే ఎలాంటి సమస్యనైనా సరే సజావుగా పనిచేసుకునే శక్తి వస్తుందన్నారు. అలాంటి శక్తి ఈ యోగాలో సాధ్యమవుతుందన్నారు. అదే విధంగా దీర్గకాలంగా ఉన్న ఉబ్బసం, అలర్జీ, రక్తపోటు, షుగరు లాంటి రుగ్మతులు ఈ యోగా వల్ల తగ్గే సూచనలున్నాయన్నారు. మనం తినే తిండి, తాగే నీరు ఎంత ముఖ్యమో దానికంటే కూడా ఒత్తిడి లేని జీవితం చాలా ప్రశాంతత ఇస్తుందన్నారు. దీనివల్ల పనితీరు పెరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితోపాటు రాష్ట్ర మంత్రులు, ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు హాజరయ్యారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.