మరో 6 మంది కొత్త మంత్రులు

  • తుమ్మల, తలసాని, ఇంద్రకరణ్ రెడ్డి, చందూలాల్, జూపల్లి, లక్ష్మారెడ్డికి స్థానం
  • మహిళలకు మొండిచేయి
  • కొప్పుల ఈశ్వర్ కు దక్కని చోటు, మాలలకు అసంతృప్తి
  • హరీష్ రావుకు విద్యుచ్ఛక్తి అదనం
  • మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం

హైదరాబాద్, డిసెంబర్ 15: తెలంగాణ రాష్ట్ర తొలి మంత్రివర్గ విస్తరణ తుది జాబితా సిద్ధమైంది. తన మంత్రివర్గంలో మరో ఆరుగురికి ముఖ్యమంత్రి కెసిఆర్ చోటు కల్పించనున్నారు. కొత్తగా మంత్రులుగా కొలువుదీరే సభ్యుల పేర్లను సిఎం రాజ్ భవన్ కు పంపారు. చివరి నిమిషం వరకు మంత్రి పదవుల కోసం ఆశవాహులు సీఎం పై ఒత్తిడి తెచ్చారు. మలివిడతలో కూడ మంత్రివర్గంలో మహిళలకు మొండిచేయి చూపారు ముఖ్యమంత్రి కెసిఆర్.

kcr-15

(పాత చిత్రం)

ఈ ఏడాది జూన్ 2న ముఖ్యమంత్రి కేసీఆర్ సహా ఆరుగురు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో మహామూద్ అలీ, డాక్టర్ రాజయ్యలకు ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కాయి. మంత్రివర్గ విస్తరణ కోసం గత కొంత కాలంగా ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నారు. ఇతర పార్టీల నుండి  వలస వచ్చిన వారికి సీఎం మలివిడత విస్తరణలో ప్రాధాన్యత కల్పిస్తున్నారు.

దీంట్లో భాగంగానే టిడిపి నుండి వలస వచ్చిన మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లతో పాటు బిఎస్ పి ఎంఏల్ఏగా ఉన్న ఆదిలాబాద్ జిల్లా కు చెందిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కనుంది. ఈ ముగ్గురితో పాటు వరంగల్ జిల్లాకు చెందిన ములుగు ఎంఏల్ఏ చందూలాల్, మహాబూబ్ నగర్ జిల్లా నుండి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డిలకు చోటు దక్కనుంది. ఈ పేర్లను సిఎం రాజ్ భవన్ కు పంపారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఈ ఆరుగురు మంత్రులుగా రాజ్ భవన్ లో ప్రమాణం చేయనున్నారు.

మాదిగ కులానికి చెందిన డాక్టర్ రాజయ్యకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చిన కేసీఆర్ మాల కులానికి చెందిన కొప్పుల ఈశ్వర్ కు తన కేబినెట్ లో స్థానం కల్పించకపోవడం వివాదానికి దారితీసింది. కొప్పుల ఈశ్వర్ కు చీఫ్ విప్ పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. తెలంగాణ దళితులలో సుమారు 60శాతం మంది మాదిగలు ఉంటే 40శాతం మంది మాలలు ఉంటారు. మాలల కులానికి మంత్రివర్గంలో ప్రాతినిథ్యం లేకపోవడం కొట్టవచ్చినట్టు కనిపించే లోపమని పరిశీలకులు అంటున్నారు. ఈశ్వర్ కు మంత్రిపదవి ఇవ్వాలంటూ మాలమహానాడుకు చెందిన కార్యకర్తలు సోమవారంనాడు టీఆర్ ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్ ను చుట్టుముట్టారు. దాని ప్రభావం ముఖ్యమంత్రిపైన లేదు.

జనాభాలో దాదాపు సగం ఉన్న మహిళలకు కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడం అన్యాయం. ఆదిలాబాద్ కు చెందిన సునీతకు లేదా వరంగల్లు కు చెందిన కొండా సురేఖకు ఈ సారైనా అవకాశం ఇస్తారని పరిశీలకులు భావించారు. కానీ కేసీఆర్ ఈ సారి కూడా మహిళలను నిరాశపరిచారు.

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే తెలుగుదేశం పార్టీకీ,  ఆ పార్టీ టిక్కెట్టుపైన గెలిచిన శాసనసభ్యత్వానికీ రాజీనామా చేయాలని చలసాని యాదవ్ నిర్ణయించుకున్నారు. సికిందరాబాద్ కు చెందిన శ్రీనివాస యాదవ్ ఆరు మాసాల కింద ఎన్నికలలో సనత్ నగర్ నుంచి శాసనసభకు ఎన్నికైనారు. కొన్ని వారాల కిందట టీఆర్ ఎస్ తీర్ధం పుచ్చుకున్న ఖమ్మం జిల్లా నాయకుడు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలలో ముఖ్యమైన శాఖలు నిర్వహించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును హోంమంత్రి చేయాలని కేసీఆర్ సంకల్పించినప్పటికీ తుమ్మలకు మాత్రం రోడ్లు, భవనాల శాఖపైన మక్కువ ఉన్నట్టు తెలుస్తున్నది. మంగళవారంనాడు ప్రమాణస్వీకారం జరిగిన తర్వాత శాఖలను కూడా ప్రకటిస్తారనీ, మధ్యాహ్నమే మంత్రివర్గ సమావేశం కూడా జరుగుతుందనీ భోగట్టా. నలుగైదుగురు మంత్రుల శాఖలు మారవచ్చునని కూడా అంటున్నారు. నీటిపారుదల మంత్రి హరీష్ రావుకు అదనంగా విధ్యుచ్ఛక్తి శాఖను అప్పగించాలని కేసీఆర్ యోచిస్తున్నట్టు ముఖ్యమంత్రి సన్నిహితులు చెప్పుకుంటున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.