మహనీయుల ఆశయాలను నెరవేర్చిన వ్యక్తి ఎన్టీఆర్ : మోత్కుపల్లి

mothukupalli-22

ఎన్టీ ఆర్ ఘాట్ వద్ద మాట్లాడుతున్న తెదేపా సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు

హైదరాబాద్, నవంబర్ 22: సమసమాజ స్థాపన కోసం మహాత్మాగాంధీ, అంబేడ్కర్ లాంటి మహనీయుల ఆశయాలను నెరవేర్చిన వ్యక్తి ఎన్టీ రామారావు అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు. దేశీయ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు తొలగించాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానానికి నిరసనగా శనివారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన ఒక రోజు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాండలిక విధానం ద్వారా ప్రజల్లోకి ప్రభుత్వాన్ని తీసుకెళ్లి ఎస్.సి, ఎస్.టి, బడుగు, బలహీన వర్గాల వారి అవసరాలకు జిల్లాలకు వెళ్లకుండా మండల స్థాయిలో కార్యాలయాలను ఏర్పాటు చేసిన ఘనుడు ఎన్టీ రామారావన్నారు.

బోర్ల మీదనే ఆధారపడి తెలంగాణలో వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు ఉచిత కరెంటును ఇచ్చి ఆదుకున్నారని ఆయన తెలిపారు. మహిళలకు సమాన హక్కు కల్పించి సామాజిక న్యాయం చేసిన ఘనత ఎన్టీ రామారావుకే దక్కుతుందని మోత్కుపల్లి తెలిపారు. ఎన్టీ రామారావు పేరును వాడుకొని పైకి ఎదిగి వచ్చిన నేతలే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడం బాధాకరమన్నారు. దేశీయ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు కొనసాగించాలని మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు.

తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకుని మోత్కుపల్లి దీక్షకు సంఘీభావం తెలిపారు. ఆయన వెంట రావేల కిశోర్ బాబు, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎల్.రమణ తదితరులు ఉన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.