మహిళలు లేని తెరాస మంత్రివర్గం

  • విస్తరణలో సైతం మహిళలకు మొండిచేయి
  • సామాజిక సమీకరణాలకే ప్రాధాన్యం
  • బలమైన కులాలకు పెద్దపీట
  • రెడ్డి, వెలమ సామాజిక వర్గాలదే ఆధిపత్యం
  • తుమ్మలకు రోడ్లు, భవనాలు, తలసానికి వాణిజ్యపన్నుల శాఖ
  • లక్ష్మారెడ్డికి విద్యుత్తు, జూపల్లికి గృహనిర్మాణం, చందూలాల్ కు గిరిజన సంక్షేమం

(నరసింహా రావు)

హైదరాబాద్, డిసెంబరు 16: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) తన మంత్రివర్గాన్ని విస్తరించడంలో చాలా జాగ్రత్తగా, తనదైన శైలిలో వ్యవహరించారు. మంగళవారం కొత్తగా ఆరుగురు మంత్రులు ప్రమాణస్వకారం చేయడంతోముఖ్యమంత్రితో సహా మంత్రుల సంఖ్య 18 కి చేరింది. ఎమ్మెల్యేల సంఖ్యలో 15 శాతానికి మంత్రివర్గం పరిమాణం మించకూడదన్న నిబంధన ఉండటంతో కేసీఆర్ కొంతమంది ఎమ్మెల్యేలకు పార్లమెంటరీ కార్యదర్శుల పదవులను కట్టబెట్టారు.

new cabinet-16f

ఖమ్మం మాజీ శాసనసభ్యుడు తుమ్మల నాగేశ్వర్ రావు, నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్ రెడ్డి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ములుగు ఎమ్మెల్యే చందూలాల్, కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావులతో గవర్నర్ నరసింహన్ మంత్రులుగా మంగళవారం ప్రమాణం చేయించారు. అనంతరం మంత్రివర్గ సమావేశం జరిగిన తర్వాత కొత్తమంత్రుల శాఖలు ప్రకటించారు. తుమ్మలకు రోడ్లు, భవనాల శాఖ, శిశు సంక్షేమం,  తలసానికి వాణిజ్యపన్నుల శాఖ అప్పగించారు. లక్ష్మారెడ్డికి విద్యుచ్ఛక్తి, జూపల్లికి పరిశ్రమల శాఖ, దేవాదాయ శాఖ అప్పగించారు. చందూలాల్ కి గిరిజన సంక్షేమం బాధ్యత అప్పగించారు. ఎక్సైజ్ మంత్రి  టి పద్మారావుకు అదనంగా క్రీడలు, అటవీశాఖ మంత్రి జోగురామన్నకు వెనుకబడిన తరగతుల సంక్షేమం అప్పగించారు.

కొత్త మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన ముగ్గురు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డిలు గత ప్రభుత్వాల్లో మంత్రులుగా చేసిన అనుభవం ఉంది. వీరు కొన్ని నెలల క్రితమే తెలంగాణ రాష్ట్ర సమితి తీర్ధం పుచ్చుకున్నారు. వాస్తవానికి ఇంద్రకరణ్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల వెంటనే తెరాస పార్టీలోకి చేరారు. తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస యాదవ్ లు తెరాస ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ పార్టీలోకి ప్రవేశించారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే తెలుగుదేశం పార్టీకీ,  ఆ పార్టీ టిక్కెట్టుపైన గెలిచిన శాసనసభ్యత్వానికీ రాజీనామా చేయాలని చలసాని యాదవ్ నిర్ణయించుకున్నారు. మంగళవారం ఉదయం రాజభవన్ కు వెళ్ళడానికి ముందే తన రాజీనామాను తలసాని ప్రకటించారు.

ఇప్పటి వరకు రాష్ట్ర మంత్రివర్గంలో చేరిన జోగు రామన్న, మహేందర్ రెడ్డి, పోచారం శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస యాదవ్, చందూలాల్ -వీరిలో ఎవ్వరూ కూడా ప్రారంభం నుంచి టీఆర్ఎస్ పార్టీకి చెందినవారు కాదు. వీరందరూ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందు కొందరు, ఏర్పడిన తర్వాత మరి కొందరు టీఆర్ఎస్ పార్టీలో చేరినవారే.

సమాజంలో అధిక ప్రాబల్యం ఉన్న వర్గంవైపే కేసీఆర్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. తన మంత్రివర్గంలోని దాదాపు 33 శాతం రెడ్డి వర్గానికే ప్రాధాన్యం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే నాయిని నర్సింహారెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, లక్ష్మారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డిలకు మంత్రివర్గంలో కేబినేట్ మంత్రి పదవులు దక్కాయి. గత కాంగ్రెస్ పార్టీ అవలంభించిన విధానాన్నే కేసీఆర్ కూడా అనుసరించినట్లైంది.

రాష్ట్రంలో చాలా చిన్నదైనప్పటికీ చాలా శక్తివంతమైన ఉనికిని కలిగినది వెలమ సమాజం. ముఖ్యమంత్రి కేసీఆర్ కాకుండా, కుమారుడు కె.తారకరామారావు, మేనల్లుడు టి.హరీష్ రావు, ఈ రోజే ప్రమాణస్వీకారం చేసిన జూపల్లి కృష్ణారావు లు కూడా వెలమ కులానికి చెందినవారే. రాష్ట్ర జనాభాలో వెలమ వర్గానికి 0.5 శాతం కంటే తక్కవే ఉన్నప్పటికీ, మంత్రివర్గంలో మాత్రం 20 శాతం ఆక్రమించారు. అదే రెడ్డి వర్గానికి చెందిన జనాభా రాష్ట్రంలో 6 శాతం మంది ఉన్నారు. కాని మంత్రివర్గంలో మాత్రం వారి బలం 33 శాతం మాత్రమే.

తెలంగాణ దళితులలో సుమారు 60శాతం మంది మాదిగలు ఉంటే 35శాతం మంది మాలలు ఉంటారు. మాదిగ కులానికి చెందిన డాక్టర్ రాజయ్యకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వడంలో కేసీఆర్ జగ్రత్తపడినా, మాల కులానికి చెందిన కొప్పుల ఈశ్వర్ కు తన కేబినెట్ లో స్థానం కల్పించకపోవడం వివాదానికి దారితీసింది. మాలకులానికి ప్రాతినిథ్యం లేకపోవడం కొట్టవచ్చినట్టు కనిపించే లోపమని పరిశీలకులు అంటున్నారు. ఈశ్వర్ కు మంత్రివర్గంలో స్థానం కల్పించి తీరాలంటూ మాలమహానాడు కార్యకర్తలు సోమవారంనాడు టీఆర్ఎస్ కార్యాలయం ముందు ప్రదర్శనలు నిర్వహించారు. అయితే ఎస్సీలలో సంఖ్యాబలం ఉన్న వర్గానికే కేసీఆర్ ప్రాముఖ్యత ఇచ్చారు. జనాభాలో 18 శాతం ఉన్న ఎస్సీలను మొత్తంమీద  చిన్న చూపు చూశారన్నది వాస్తవం.

జనాభాలో అత్యధికం ఉన్న వెనుకబడిన తరగతుల వారికి కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లభించింది. వారిలో కూడా పలుకుబడి కలిగిన వారికే స్థానం లభించింది.  ఇందులో భాగంగానే ముదిరాజ్ కులానికి చెందిన ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ ఉండగా, మున్నూరు కాపు కులానికి చెందిన జోగు రామన్న, గౌడ కులానికి చెందిన పద్మారావు, యాదవ కులానికి చెందిన తలసాని శ్రీనివాస్ యాదవ్ లు ఉన్నారు. అధికార రాజకీయాలకు దూరంగా ఉన్న మిగతా వెనుకబడిన తరగతులవారికి సరైన ప్రాతినిధ్యం లభించలేదు.

మైనారిటీ వర్గానికి విద్యా, ఉద్యోగాల్లో 12 శాతం రిజర్వేషన్ హామీని కేసీఆర్ ఇచ్చారు గానీ, ఆయన మంత్రివర్గంలో మాత్రం మహమూద్ అలీ ఒక్కరికే ఉపముఖ్యమంత్రి స్థానం కల్పించారు.

రాజకీయ అనుభవజ్ఞడైన ముఖ్యమంత్రి కేసీఆర్ విస్తరించిన ఈ మంత్రివర్గంలో జనాభాలో దాదాపు సగం ఉన్న మహిళలకు స్థానం కల్పించకపోవడంతో ఆ వర్గాన్ని కేసీఆర్ పూర్తిగా విస్మరించినట్లైంది. ఒక దశలో వరంగల్లు చెందిన ఎమ్మెల్యే కొండా సురేఖకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారని అందరూ భావించారు. కొంత వరకు సునీత పేరు వినబడింది. కాని చివరకు మంత్రివర్గంలో మహిళలకు మొండిచేయి చూపించారు. ఇంతటి కఠోరమైన వివక్షత చూపించడం వల్ల మహిళలు పార్టీకీ దూరమయ్యే పరిస్థితి ఉంది. ఇది అన్యాయమే కాదు తెలితక్కవ తనం. ఈ విషయంలో వై ఎస్ ఆర్ వైఖరికి ఇందుకు పూర్తి భిన్నంగా ఉండేది. వై ఎస్ మంత్రివర్గంలో దాదాపు అరడజను మంది మహిళా మంత్రులు ఉండటమే కాకుండా ఒక మహిళకు హోం మినిస్టర్ పదవి నిచ్చారు కూడా. రాజకీయ నాయకులు ఇతరుల నుండి పాఠాలు నేర్చుకోరు, సలహాలు అంతకన్నా తీసుకోరు. ముఖ్యంగా ఏకపక్షంగా నిర్ణయాలకు అలవాటుపడిన కేసీఆర్ కు ఇది మరింతగా వర్తిస్తుంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.