మారథాన్ రన్నర్ ఒ.పి జైసాకు స్వైన్ ఫ్లూ

న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ నుంచి దేశానికి తిరిగొచ్చిన మారథాన్ రన్నర్ ఒ.పి జైసా ఇప్పుడు స్వైన్ ఫ్లూ వ్యాధి బారిన పడింది. రియో మారథాన్ రన్ లో కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని, 8కి.మీ. లకు ఒకసారి మాత్రమే తనకు మంచినీళ్ళు అందించారని అధికారులపై ప్రత్యక్ష ఆరోపణలు చేసింది ఈ భారత మహిళా అథ్లెట్. అయినప్పటికీ పట్టుదలతో 89వ స్థానంలో పరుగు ముగించి అక్కడే స్పృహ కోల్పోయింది. 

అయితే ఇప్పుడు ఈ వివాదంలో మరో కొత్త మలుపు వచ్చి పడింది. తనకు రేసులో ఎటువంటి రిఫ్రెష్ మెంట్ అవసరం లేదని జైసానే స్వయంగా తనతో చెప్పినట్లు ఆమె వ్యక్తిగత శిక్షకుడు నికోలాయ్ నెసరేవ్ అంటున్నాడు. జైసా నుంచి పూర్తి స్పష్టత వచ్చిన తరువాతనే భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఎ.ఎఫ్.ఐ) అధికారులకు ఈ విషయం తెలియజేసినట్లు ఆయన వెల్లడించాడు.

2014 ఆసియా క్రీడల్లో 1500 మీటర్ల రేసులో రజతం సాధించిన 33 ఏళ్ళ ఈ  కేరళ అథ్లెట్ సైతం ఇప్పుడు కోచ్ నికోలాయ్  మాటల్ని తప్పుబడుతోంది.  జైసాతో పాటుగా మారథాన్ లో పాల్గొన్న కవితా రౌత్ మాత్రం ఎ.ఎఫ్.ఐ. సభ్యులు తనని రిఫ్రెష్ మెంట్  గురించి అడిగారని, కానీ ఇంతకు ముందు పోటీల్లో సైతం తాను ఇలాంటివి తీసుకోకపోవడంతో వారితో వద్దని చెప్పినట్లు తెలియజేసింది. 

ఒలింపిక్స్ ముగిసిన వెంటనే పలువురు భారత అథ్లెట్లు అనారోగ్యానికి గురి కావడం ఎ.ఎఫ్. ఐ పై సరికొత్త విమర్శలకు అవకాశమిస్తోంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.