మిషన్ కాకతీయ

హైదరాబాద్: చెరువుల పునరుద్దరణ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. టైంబౌండ్ ప్రకారంగా ఈ పనులను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలను చేపట్టింది. గత రెండు మూడు రోజుల క్రితం కురిసిన వర్షాలు ఈ పథకం పనుల నిర్వహాణకు కొంత ఇబ్బందిగా మారాయి. అయితే తొలి విడత 9 వేల చెరువులు పూర్తయ్యే అవకాశం లేదని అధికారులు తెలుపుతున్నారు.

తెలంగాణ ప్రభుత్వం చెరువుల పునరుద్దరణ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. దీనికి మిషన్ కాకతీయ అని పేరు పెట్టింది. గత ఏడాది డిసెంబర్ లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి ఈ పథకాన్ని ప్రారంభించేందుకు రావాలని ప్రభుత్వం ఆహ్వానించింది. కేంద్రమంత్రి వస్తారని భావించి, కార్యక్రమ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. దీని కోసం వరంగల్ జిల్లాలో మిషన్ కాకతీయ పైలాన్ ను కూడా సిద్ధం చేశారు. డిసెంబర్ లో ప్రారంభించాల్సిన కార్యక్రమం ఆలస్యంగా మార్చి 12 న ప్రారంభమైంది. ఆలస్యంగా పనులను ప్రారంభించడంతో తొలి ఏడాది 9 వేల చెరువులను పునరుద్దరించాలనే ప్రభుత్వం లక్ష్యం చేరుకొనే అవకాశం లేదని అధికారులు తెలుపుతున్నారు.

ఆలస్యంగా పనులను ప్రారంభించినా, వచ్చే వర్షాకాలం ప్రారంభం నాటికి చెరువుల పునరుద్దరణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. రాష్ట్ర వ్యాప్తంగా తొలివిడతగా 9577 చెరువులను పునరుద్దరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇప్పటివరకు 6917 చెరువులకు మాత్రమే అనుమతులు లభించాయి. ఇందులో 4034 చెరువుల పనులు ప్రారంభమయ్యాయి. మే మాసాంతం వరకు చెరువుల పునరుద్దరణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

గత నాలుగైదు రోజులుగా కురుస్తోన్న వర్షాల వల్ల చెరువుల పునరుద్దరణ పనులకు కొంత ఇబ్బంది ఏర్పడింది. వచ్చే ఏడాది జనవరి మాసంలోనే పనులు ప్రారంభించేలా ప్రభుత్వం ప్రణాళికలను సిద్దం చేసుకొంటుంది. చెరువుల పునరుద్దరణ తర్వాత క్రిష్ణా, గోదావరి నదుల్లోని 250 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.