మిషన్ కాకతీయ

హైదరాబాద్, నవంబర్ 8: రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. శనివారం సచివాలయంలో నీటిపారుదలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుతో పాటు ఉన్నతాధికారులు పొల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వేలాది చెరువులు తవ్వించి, తెలంగాణను సుభిక్షం చేసిన ఘనత కాకతీయులదన్నారు. రాష్ట్రంలో “మిషన్ కాకతీయ“ పేరుతో చెరువుల పునరుద్ధరణ చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. కాకతీయులను స్ఫూర్తిగా తీసుకుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పేర్కొన్నారు.

 

కాకతీయులు కల్పించనటువంటి జలసంపదను గత ప్రభుత్వాలు వాటిని ధ్వంసం చేయడం జరిగిందన్నారు. తెలంగాణను సుభిక్షంచేయడానికి తవ్వించిన చెరువులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించడమే లక్ష్యంగా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు నడుస్తుందన్నారు. నవంబర్ మూడవ వారంలోనే చెరువులకు టెండర్లను పిలిచే ప్రక్రియ ప్రారంభించబోతున్నట్లు హరీష్ రావు తెలిపారు. ఈ చెరువులకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో రూ 2000 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్ ఆర్ ఆర్ ప్రోగ్రాం కింద రూ 1000 కోట్లు, ప్రపంచ బ్యాంకు నుంచి రూ 3000 కోట్లు, జైకా నుంచి కూడా మరో రూ 2000 కోట్ల నిధులను సమీకరించుకోవాడానికి ప్రయత్నం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. తెలంగాణలో ఉండే మొత్తం 40 వేల చెరువులను పూర్తిస్థాయిలో పునరుద్ధరించడం లక్ష్యంగా మిషన్ కాకతీయ కొనసాగుతుందని మంత్రి హరీష్ రావు తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.