ముఖ్యమంత్రుల దొంగాట

దాదాపు అయిదు మాసాల కిందట ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలుగువారి మధ్య సయోధ్య క్రమంగా అడుగంటుతోంది. ‘విడిపోయి కలిసుందాం’ అంటూ నినదించిన తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, ముఖ్యంగా కల్వకుంట చంద్రశేఖరరావు, హరీష్ రావు, ఈటెల రాజేంద్ర, అనునిత్యం ఆంద్రప్రదేశ్ సర్కార్ పైన కత్తులు నూరుతున్నారు. మరో వైపు చంద్రబాబునాయుడు ఎన్ని కష్టాలలో ఉన్నా తన పనులు తాను చక్కబెట్టుకుంటున్నా తెలంగాణలో మాత్రం బదనాం అవుతున్నారు. కరెంటు కష్టాలకు తెలుగుదేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిదే బాధ్యత అంటూ తెలంగాణ ప్రభుత్వంలోని ప్రముఖులు నిందిస్తున్నారు. శ్రీశైలం ఎడమ కాలువలో నీటిని విద్యుదుత్పత్తికి వినియోగించడంపైన చంద్రబాబునాయుడు ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది. అందుకు నాయుడికి తలంటి పోస్తున్నారు.  శ్రీశైలం రిజర్వాయర్ లో నీటి మట్టం తగ్గిపోతే రాయలసీమ, కోస్తాంధ్రలకూ, తెలంగాణ ప్రాంతానికి తాగునీరు కరువు అవుతుందని రాసినందుకు ఈనాడు పత్రికపైన తెరాస శ్రేణులు ధ్వజమెత్తాయి. ఇట్లా పరస్పరం నిందించుకోవడమే రాజకీయ నాయకులకు కావాలి. తెలంగాణలో విద్యుత్ కోత గురించీ, రైతుల ఆత్మహత్యల గురించీ ప్రజలు ప్రశ్నించకుండా ఉండాలంటే దృష్టి యావత్తూ పొరుగు రాష్ట్రం పాలకవర్గంపైన పెట్టాలి. నెపం అంతా వారిపైకి నెట్టాలి. ఇదీ కేసీఆర్ వ్యూహం. అదే విధంగా కేసీఆర్ తో, ఇతర తెరాస నాయకులతో వాగ్వాదం నడిపిస్తూ, తెలంగాణలో ని తెదేపా నాయకులను బస్సు యాత్రలకు పంపిస్తూ కేసీఆర్ ప్రభుత్వాన్ని విద్యుత్ కొరతపైనా, రైతుల ఆత్మహత్యలపైన ప్రశ్నిస్తూ, ఎండగడుతూ పొరుగు రాష్ట్రంపైనా, కేసీఆర్ పైనా ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టి నిలపాలి. వ్యవసాయ రుణాల మాఫీ గురించీ, తుఫాను బాధితుల పునరావసం, సహాయ చర్యల గురించి ప్రజలు ప్రశ్నించకుండా ఉండాలంటే ఇది నాయుడి దృష్టిలో మంచి ఎత్తుగడ. ఈ విధంగా ఎవరి వ్యూహాలతో వారు, ఎవరి ఎత్తుగడలతో వారు ముందుకు పోతున్నారు. రెండు రాష్ట్రాల ప్రజలనూ వంచిస్తున్నారు.

తామే సృష్టించిన గందరగోళం, అనిశ్చిత పరిస్థితులలో వందల కోట్ల రూపాయల నిర్ణయాలు మంత్రవర్గ సమావేశం కూడా నిర్వహించకుండా అలవోకగా తీసుకుంటున్నారు. మంత్రివర్గ సమావేశంలోనే కాకుండా శసనసభలోనూ, పౌరసమాజంలోనూ క్షుణ్ణంగా చర్చించిన తర్వాతనే అమలు చేయవలసిన వాటర్ గ్రిడ్ వంటి బృహత్తర ప్రాజెక్టులను పంచాయతీరాజ్, ఐటీ మంత్రి కే తారకరామారావు సింగపూర్ సందర్శించి అమలు సన్నాహాలు చేస్తున్నారు. నీటిపారుదల రంగంలో నిష్ణాతైన హనుమంతరావు వంటి ఇంజనీర్లు తక్కువ వ్యయంతో ఎక్కువ ప్రయోజనం సమకూర్చే విధంగా వాటర్ గ్రిడ్ నిర్మాణం చేయవచ్చునని మీడియా ద్వారా చేస్తున్న సూచనలను పట్టించుకున్న దాఖలా లేదు. హనుమంతరావు వాదనకు ప్రతిపాదన లేకపోలేదు. వాదననూ, ప్రతివాదననూ పారదర్శకంగా విని సముచితమైన నిర్ణయం తీసుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ తమ మాటకు ఎదురు చెప్పినవారిని శత్రువులుగా పరిగణించే మనస్తత్వం కలిగిన పాలకులకు స్వతంత్ర వ్యక్తిత్వం కలిగిన ప్రవీణులు ఇచ్చే సలహాలు రుచించవు. పైగా వ్యయం తగ్గించాలంటే అంగీకరించరు. వ్యయం ఎక్కువ ఉంటేనే ప్రయోజనం అధికమేమో తెలియదు.

ఆంధ్రప్రదేశ్ లో సైతం ఇదే ఒంటెత్తుపోకడ. కొత్త రాజధాని నిర్మాణం ఎక్కడ జరగాలో సూచించేందుకు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం నిర్దేశించిన విధంగా ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆ కమిటీ నివేదిక సమర్పించడానికి పూర్వమే కొత్త రాజధాని విజయవాడ గుంటూరు, కృష్ణా జిల్లాల మధ్య ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏకపక్షంగా ప్రకటించారు. కొత్త రాజధాని నిర్మాణానికి అవసరమైన ప్రాథమిక చర్యలు తీసుకునే బాధ్యత మంత్రి నారాయణకు అప్పగించారు. ప్రజలతో, ప్రజాప్రతినిధులతో సంబంధం లేకుండా, శాసనసభలో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా  అతి పెద్ద నిర్ణయాన్ని తమ ఆలోచనలకు తగినట్టు, తమ ప్రయోజనాలకు అనుగుణంగా తీసుకోవడం ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా? కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య కొత్త రాజధాని ఎందుకు ఉండాలో, మరి కొందరు సూచిస్తున్నట్టు ప్రకాశం జిల్లా దొనకొండ దగ్గర ఉంటే వచ్చే నష్టమేమిటో ప్రజలు చర్చించుకోనక్కరలేదా? చంద్రబాబునాయుడు సన్నిహితుల రియల్ ఎస్టేట్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఏకపక్షంగా రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయించి ప్రకటించారనే అభిప్రాయం సామాన్య ప్రజలు వ్యక్తం చేస్తున్నారంటే అందుకు ఎవరిని తప్పు పట్టాలి? అన్ని నిర్ణయాలనూ కొద్ది మంది సన్నిహితులతో కలసి తీసుకుంటే తాము నామమాత్రులమైనామంటూ దగ్గరివారితో చెప్పుకొని మంత్రులు బాధపడుతున్నారు. ఉపముఖ్యమంత్రులంటూ ఉన్నత పదవులు ఇచ్చి కీలక నిర్ణయాలు తమను సంప్రదించకుండా, ప్రజాప్రతినిధులతో నిమిత్తం లేకుండా కొద్ది మంది సలహాదారుల మాట విని తీసుకుంటున్న తీరు చంద్రబాబునాయుడికీ, మంత్రులకీ మధ్య దూరం పెంచుతోంది. ఈ వాస్తవాన్ని నాయుడు ఎంత త్వరగా గ్రహించి పొరపాట్లు సరిచేసుకుంటే అంత మంచిది.

ఇద్దరు ముఖ్యమంత్రలూ ఒక చోట కూర్చొని చర్చించుకొని పరిష్కరించుకోవలసిన సమస్యలు సవాలక్ష ఉన్నాయి. ఇద్దరూ మాట్లాడుకోకుండా వీరిని ఒక వేదికపైకి తీసుకురావడానికి గవర్నర్ నరసింహన్ అవసరం కావడం విడ్డూరం. ఎందుకు ఇట్లా జరుగుతోంది? వీరిద్దరూ నిజంగా మాట్లాడుకోలేరా? ఈ ప్రశ్నకు ఒక సమాధానం ఏమిటంటే మాట్లాడుకోకుండా కాట్లాడుకుంటేనే రెండు రాష్ట్రాల ప్రజల దృష్టిని మళ్ళించి పబ్బం గడుపుకోవచ్చు. ప్రజలు అడిగే ఇబ్బందికరమైన ప్రశ్నలను తప్పించుకోవచ్చునని ఒకే బడిలో చదివిన వత్సలిద్దరూ ఆలోచిస్తున్నారని అనిపిస్తున్నది. ఈ కోణాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు. కొంత వ్యవధి పట్టవచ్చుకానీ ప్రజలందరినీ శాశ్వతంగా మభ్యపెట్టడం ఎంత చాకచక్యం కలిగిన రాజకీయ నాయకులకైనా సాధ్యం కాదు. ఈ సత్యాన్ని గ్రహిస్తే నాయుడికీ, కేసీఆర్ కీ. వారి వారసులకీ, వారి బంధువులకీ, వారి స్నేహితులకూ మంచిది.

-చాణక్య

Have something to add? Share it in the comments

Your email address will not be published.