ముగిసిన బీఏసీ సమావేశం

హైదరాబాద్: సభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశం సుమారు రెండున్నర గంటలకు పైగా శాసనసభ సభాపతి మధుసూదనాచారి అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సమావేశంలో పలు విషయాలపై చర్చకు వచ్చాయి. శనివారం ఉదయం సభలో చోటుచేసుకొన్న ఘటనపైనే సుమారు గంటన్నరకుపైగా చర్చ జరిగింది. ఈ అంశంపైనే టీడీపీ, ఎం.ఐ.ఎం, టీఆర్ఎస్ సభ్యుల మద్య వాదోపవాదాలు కూడా చోటుచేసుకొన్నాయి. గవర్నర్ ప్రసంగం సందర్భంగా జాతీయ గీతాన్ని అవమానపర్చిన సభ్యులను సభను సస్పెండ్ చేయాలని ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. జాతీయగీతాన్ని అవమానపర్చిన సభ్యులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరారు. అయితే ఈ విషయమై స్పీకర్ నిర్ణయం తీసుకొంటారని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హారీష్ రావు చెప్పారు. అయితే ఫ్లోర్ లీడర్ల సమక్షంలో వీడియో పుటేజీని పరీక్షించిన మీదటే చర్యలు తీసుకోవాలని టీడీపీ సభ్యుడు ఎర్రబెల్లి కోరారు. ఇతర పార్టీలు కూడ ఈ అభిప్రాయంతో ఏకీభవించాయి. తమపై అధికార పార్టీ సభ్యులు దాడి చేస్తోంటే, ఆ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళేందుకే తాము బెంచీలు ఎక్కాల్సివచ్చిందని, జాతీయగీతాన్ని అవమానపర్చే ఉద్దేశ్యం తమకు లేదని టీడీపీ సభ్యుడు ఎర్రబెల్లి వివరణ ఇచ్చారు.

ఈ చర్చ సాగుతున్న సమయంలోనే ఎంఐఎం, టీడీపీ సభ్యులకు కొంత సేపు బీఏసీ లో వాగ్వావాదం చోటుచేసుకొంది. మరో వైపు జూనియర్లకు మార్గదర్శకంగా ఉండాల్సిన సీనియర్లే బెంచీలు ఎక్కితే ఎలా అంటూ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఎర్రబెల్లిని ఉద్దేశించి వ్యాఖ్యానించడంతో, వారిద్దరి మద్య కూడ వాగ్వావాదం చోటుచేసుకొంది. జూనియర్లు, సీనియర్లు, ఫ్లోర్ లీడర్లను గౌరవించే పరిస్థితి అధికార పక్షానికి లేదని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరిని ఉద్దేశించి ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. దీంతో ఇద్దరి మద్య స్వల్ప వాగ్వావాదం చోటుచేసుకొంది.

అయితే జాతీయ గీతాన్ని అవమానపర్చారనే అంశాన్ని తెరమీదికి తెచ్చి, పార్టీ  ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకొనే అంశాన్ని పక్కకు పెడితే చూస్తూ ఊరుకోబోమని టీడీపీ ప్లోర్ లీడర్ ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకొన్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పేరును ప్రస్తావిస్తూ ఆయనపై చర్య తీసుకోవాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. మంత్రివర్గం నుండి తలసానిని తొలగించాలని ఆయన కోరారు. తొలగించే అధికారం గవర్నర్ కు మాత్రమే ఉంటుందని మంత్రి హారీష్ రావు చెప్పారు.

తొలుత నిర్ణయించినట్టుగా ఈ నెల 8న, శాసనసభను నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అయితే విపక్షసభ్యుల సూచన మేరకు 8న శాసనసభకు సెలవు ఇవ్వాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను మూడు రోజుల నుండి రెండు రోజులకు కుదించారు. ఈ నెల 9, 10 తేదిల్లో గవర్నర్ ప్రసంగానికి శాసనసభ ధన్యవాదాలు తెలుపనుంది. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఈ నెల 11న, బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ పై ఈ నెల 13 నుండి 20 వరకు చర్చ ఉంటుంది. ఈ నెల 21న ఉగాది, 22 ఆదివారం కావడంతో సభకు సెలవు ప్రకటించారు. తిరిగి ఈ నెల 23 నుండి 26 వరకు సభను నిర్వహిస్తారు. ఈ నెల 26న ద్రవ్య వినిమయబిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ నెల 30, 31న కూడ సభ నడపాలనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది. ప్రతి ఆదివారం శాసనసభకు సెలవు ఇవ్వాలని ఈ సమావేశం నిర్ణయం తీసుకొంది.

ప్రతి రోజు ఉదయం తొమ్మిదన్నర గంటలకే సభను ప్రారంభించాలని సభ్యులు సూచించారు. అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కూడ సాగుతున్న నేపథ్యంలో పోలీసుల సూచన మేరకు ఈ సమావేశాలు నడిపే నిర్ణయాన్ని స్పీకర్ కు వదిలేశారు. దీంతో పాటుగా వాయిదా తీర్మాణాల అంశాన్ని ఉదయం పూట తీసుకోవాలని, కొందరు సాయంత్రం చేపట్టాలనే అభిప్రాయం కూడ వచ్చింది. దీన్ని కూడ స్పీకర్ నిర్ణయానికే వదిలేశారు. ప్రతి రోజూ ఐదుగంటలకు తగ్గకుండా సమావేశాలు నిర్వహించాలనే బీఏసీ సమావేశం అభిప్రాయపడింది.

బీఏసీ సమావేశంలో ఉపసభాపతి పద్మాదేవేందర్ రెడ్డి, శాసనసభా వ్యవహారాల మంత్రి టి.హరీశ్ రావు, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, కాంగ్రెస్ తరఫున, చిన్నారెడ్డి, భట్టివిక్రమార్క, తెలుగుదేశం పార్టీ నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు, బారతీయజనతా పార్టీ నేత లక్ష్మణ్, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ, సీపీఐ పక్షనేత రవీంద్రకుమార్, సీపీఎం నుంచి సున్నం రాజయ్యలు హాజరయ్యారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.