మెదక్, నందిగామల్లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

హైదరాబాద్, సెప్టెంబర్ 13 : మెదక్ లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచి కాస్త మందకోడిగా సాగిన పోలింగ్ మధ్యాహ్నం తరువాత కొంత మెరుగైంది. ఈవీఎంలలో చిన్న చిన్న సాంకేతిక సమస్యలు తప్ప ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. 6 గంటలలోపు క్యూలైన్లలో ఉన్నవారందరికి ఓటు వేసే అవకాశం కల్పించారు. మెదక్ లోక్ సభ పరిధిలో ముగ్గురు ప్రధాన అభ్యర్ధులతో సహా 14 మంది బరిలో ఉన్నారు.  మెదక్ లోక్ సభ పరిధిలో ఓటింగ్ ముగిసే సమయానికి 67శాతాం, నందిగామ అసెంబ్లీ లో 68 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

మెదక్ లో

మెదక్ లోకసభ పరిధిలో మొత్తం 15,43, 422 మంది ఓటర్లు, 1817 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 2459 ఈవీఎంలలో తమ ఓటు హక్కును వినియోగించు కున్నారు. మెదక్ లోక్ సభ పరిధిలోని సిద్దిపేటలో 66, నర్సాపూర్ లో 77, సంగారెడ్డిలో 64, పటాన్ చెరువులో 52, దుబ్బాకలో 68, గజ్వేల్లో 67 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన సతీమణితో కలిసి తన స్వగ్రామమైన చింతమడకలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెదక్ లోక్ సభ తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధి కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక మండలం పోచారంలో, భారతీయ జనతా పార్టీ అభ్యర్ధి జగ్గారెడ్డి సంగారెడ్డిలో, కాంగ్రెస్ అభ్యర్ధిని సునీతా లక్ష్మారెడ్డి శివ్వంపేట మండలం గోమారంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపు ఈ నెల 16న ఎన్నికల అధికారులు నిర్వహించనున్నారు. మెదక్ బరిలో ముగ్గరు ప్రధాన అభ్యర్థులు సహా 14 మంది బరిలో నిలిచారు.

నందిగామలో

నందిగామ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నందిగామ నియోజవర్గ పరిధిలో 68 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ మృతితో ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. టీడీపి అభ్యర్ధినిగా ఆయన కుమార్తె తంగిరాల సౌమ్య బరిలో ఉండగా, కాంగ్రెస్ అభ్యర్ధిగా బోడపాటి బాబూరావు,  మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు మాతంగా పుల్లారావు, కటారపు పుల్లయ్య బరిలో ఉన్నారు. ఉప ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించేందుకు 1500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 1,84,061 మంది ఓటర్లు ఉన్న నందిగామ నియోజవర్గ పరిధిలో 200 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ నెల 16 న ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగనుంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.