మేడారంలో గజం అక్షరాల ఆరు వేలు…!

Medaram-Jatara

వరంగల్ జిల్లా మేడారంలో జాతర దగ్గర పడుతుండటంతో అద్దె ధరలు ఆకాశన్నంటుతున్నాయి. జాతర జరిగే నాలుగు రోజులకు గజం భూమి అద్దె ఆరు వేల రూపాయలు. జాతర సమయంలో తప్ప జన సంచారం పెద్దగా వుండని అక్కడ అంత ధరా అని ఆశ్చర్యపోకండి. ప్రస్తుతం అక్కడ పలుకుతున్న అద్దెల ధరలు మహా నగరాలతో పోటీ పడుతున్నాయి. ఫిబ్రవరిలో నాలుగు రోజుల పాటు కన్నుల పండువగా జరిగే జాతరకు కోటి మందికి పైగా భక్తులు వస్తారని అంచనా. అందుకు తగ్గట్టే వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. వ్యాపారానికి స్థలం కావాలిగా అందుకే అక్కడ ఆ నాలుగు రోజుల స్థలాలకు అంత గిరాకీ!

వచ్చేనెల 12 నుంచి 15వ తేదీ వరకు జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. వీరంతా మేడారంతో పాటు ఊరట్టం, రెడ్డిగూడెం, నార్లపల్లి, కన్నెపల్లి పరిసర ప్రాంతాల్లో విడిది చేస్తారు. వీరి అవసరాలకు మేడారం పరిసర ప్రాంత ప్రజలు తమ ఇళ్లు, పెరడుతో పాటు పొలాలను కూడా అద్దెకు ఇస్తారు. వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు పోటీలు పడుతుంటారు. దీంతో మేడారం స్థలాలకు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. జాతరకు ఇంకా పదిహేను రోజుల సమయం ఉండగానే స్థలాలకు బుకింగ్‌లు దాదాపు పూర్తికావచ్చాయి.

జాతర పరిసర ప్రాంతాలైన రెడ్డిగూడెంలో ఇళ్ల అద్దెలు ఆకాశంలో విహరిస్తున్నాయి. దీని తర్వాత స్థానాల్లో కన్నెపల్లి, నార్లాపూర్, ఊరట్టం గ్రామాలున్నాయి. జాతర జరిగే రోజుల్లో మూడు రోజుల పాటు ఈ ప్రాంతాల్లో ఒక గది అద్దె ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయల వరకు పలుకుతోంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.