మోదీ అమెరికా పర్యటన ఘన విజయం

వాషింగ్టన్ : భారత్, అమెరికా సహకారంతో రక్షణ, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, తద్వారా ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపర్చేందుకు  కలసి పని చేయాలని పరస్పర అంగీకారం కుదిరింది.

చర్చలు అనంతరం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలు సఫలమైనట్లు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఒబామా, మోదీ మధ్య చర్చలు ఊహించినదానికంటే ఎక్కవ సమయం జరగడంతో ప్రధానమంత్రి తిరుగు ప్రయాణం గంటసేపు ఆలస్యమైంది. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మెమోరియల్ వద్ద సమావేశం ముందు, అటు తర్వాత “మోడీ మోడీ” అని నినాదించడంపట్ల ప్రవాస భారతీయులు తమ ఉనికిని చాటుకున్నారు.

ప్రపంచంలోని పేద ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరముందని ఒబామా అభిప్రాయపడ్డారు. ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్న హింసాత్మక తీవ్రవాదం గురించి చర్చించామన్నారు.

దక్షిణాసియాలో ఉగ్రవాదం, పశ్చిమాసియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదంపై పోరులో సహకారాన్ని మరింత దృఢపర్చుకోవాలని రెండు దేశాలు అంగీకారానికి వచ్చాయన్నారు.  పౌర అణు విద్యుత్‌కు సంబంధించి అమెరికా సహకారాన్ని భారత్ కోరుతోందన్నారు. డబ్ల్యూటీవోలో భారత్ వైఖరిని ఒబామాకు స్పష్టం చేశానని మోదీ తెలిపారు. భారతదేశ సేవారంగ కంపెనీలను అమెరికా ఆర్థికవ్యవస్థలో భాగం చేయాలని ఒబామాను కోరానని మోదీ చెప్పారు. ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో భారతదేశానికి సభ్యత్వం ఇచ్చేందుకు అమెరికా అంగీకరించిందన్నారు. అఫ్ఘానిస్థాన్‌కు సహకరించే విషయంలో  సమన్వయంతో వ్యవహరించాలని నిర్ణయించామన్నారు. భారతదేశం“లుక్ ఈస్ట్“ “లింక్ వెస్ట్“ విధానంలో భాగంగా అమెరికాతో సంబంధాలు మాకు చాలా కీలకం అన్నారు. మరోవైపు కుటుంబసమేతంగా భారత్ పర్యటనకు రావల్సిందిగా ఒబామాను మోదీ ఆహ్వానించారు.

ఉమ్మడి ప్రకటన అనంతరం మార్టిన్ లూథర్ కింగ్ మెమోరియల్ లాన్లో నడుచుకుంటూ నాయకులు ఇద్దరూ ఆంతరంగిక చర్చ జరిపారు. అధ్యక్షుడు ఒబామా, మోదీ ఇద్దరు నెమ్మదిగా నడుచుకుంటూ ఎక్కవ సమయం లాన్ లోనే గడిపారు. మొత్తం మీద ప్రధాని మోదీ అమెరికా పర్యటన కొంత వరకు అనుకున్నది సాధించినట్లుగా వర్ణించవచ్చు. భారత ప్రధాని మోదీ ఉన్న రెండు రోజుల్లో రెండు సార్లు స్వేత సౌధంలో (వైట్ హౌజ్) అధ్యక్షుడు ఒబామాను కలుసుకోవడం అద్భతమైన విశేషం. భారత్, యూఎస్‌లు సహజ భాగస్వాములన్న తన విశ్వాసం ఈ పర్యటన ద్వారా మరింత బలపడిందని మోదీ అన్నారు. ఈ చర్చల ఫలితంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడతాయని ఆశిద్దాం.

Have something to add? Share it in the comments

Your email address will not be published.