రాజకీయ సమరంలో సామాన్యులే సమిధలు

(సంజయ)

ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది… అని మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లుగా ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జరుగుతున్న రాజకీయ సమరంలో రైతులు, సామాన్యులకు ఒరుగుతున్నదేమీ లేదు. ఈ రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు కుటుంబ పార్టీలుగానో లేక కుల పార్టీలుగానో ఉన్నాయి. రైతు రాజ్యం, రైతు సంక్షేమం, రైతే రాజు… అనేవి పార్టీలకు పడిగట్టు పదాలుగా మారాయి. కానీ  ఈ రెండు పార్టీల ఆచరణ మాత్రం హామీలకు ఆమడదూరంలో ఉన్నాయి.

ఎన్నికల ముందు రైతుల కోసం ఈ పార్టీలు ఇచ్చిన హామీలు, వాగ్ధానాలు ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత అమలుకు నోచుకోవడం లేదు. రాష్ట్ర విభజనకు ముందు తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్రసమితి పార్టీల మధ్య యుద్ధమే జరిగింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇది మరో రూపంలో కొనసాగుతూనే ఉంది. రాజకీయ యుద్ధంలో ఇప్పుడు రైతులు పావులుగా మారారు.

rytu-jagadevpur-mutyalu copyతెలంగాణలో తీవ్ర విద్యుత్ సంక్షోభం ఉన్న మాట వాస్తవమే. దానిని అధిగమించడానికి తెరాస ప్రభుత్వం కొన్ని ప్రయత్నాలు చేసినా రైతులకు చేసిన మేలు మాత్రం నామమాత్రమే. ప్రతిరోజూ నలుగురైదుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. అప్పుల బాధ మొదలు పంటలు చేతికి రాకపోవడం, వచ్చినా గిట్టుబాటు ధర లేకపోవడం, అకాల వర్షాలతో పంటలు తడిచిపోవడం, ప్రైవేటు వడ్డీ వ్యపారుల బాధలు పడలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అయితే ఈ ఆత్మహత్యలపై తెరాస ప్రభుత్వం స్పందించిన తీరు మాత్రం అత్యంత గర్హనీయం. తెలంగాణ ముఖ్యమంత్రి పది రోజుల క్రితం మీడియా సమావేశంలో సుమారు 50 నిమిషాల పాటు మాట్లాడితే రైతుల గురించి మాట్లాడడానికి ఆయన వెచ్చించిన సమయం కనీసం రెండు నిమిషాలైనా లేదు. రైతుల ఆత్మహత్యలపై ప్రతిపక్షాలు చూపిస్తున్న లెక్కలన్నీ కాకిలెక్కలుగా తేల్చారు తప్ప నిజంగా చనిపోయినవారి సంఖ్యను మాత్రం వెల్లడించలేదు. కనీసం ముఖ్యమంత్రిగా ఆయనగానీ, వ్యవసాయ శాఖ మంత్రిగానీ అలాంటి ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించలేదు. కనీసం ప్రభుత్వం నుంచి ఏ అధికారిని కూడా అలాంటి ప్రాంతాలకు పంపి వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఎన్నికలకు ముందు జరిన 107 బహిరంగ సభల్లో 86 చోట్ల మూడు సంవత్సరాల వరకు విద్యుత్ ఇబ్బందులు తప్పవని స్పష్టంగా చెప్పినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ పదేపదే ప్రస్తావిస్తున్నారు. అంటే ఈ మూడేళ్ళ పాటు రైతులు ఆత్మహత్యలు చేసుకోవలసిందేనా? కనీసం వారిలో ఆత్మస్థయిర్యం నింపే ప్రయత్నం కేసీఆర్ ఎందుకు చేయడం లేదు. ప్రతిపక్షాలను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని విమర్శించడానికి కేటాయిస్తున్న సమయాన్ని రైతుల సంక్షేమం కోసం ఎందుకు వినియోగించడంలేదు? ఆ పార్టీ ఎంపీలు సైతం ఎందుకు రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడడంలేదు? పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో రైతుల రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణాల మాఫీ తదితర అంశాలపై తిట్లపురాణం చదివిన కేసీఆర్ తన రాష్ట్రంలోని రైతుల గురించి ఎందుకు స్పష్టత ఇవ్వడంలేదు. ఆత్మహత్యల గురించి ఎందుకు స్పందించడంలేదు? రైతుల పక్షాన ప్రభుత్వం ఉందనే ప్రకటన స్థానంలో వారికి భరోసా కల్పించే హామీ ఎంధుకు ఇవ్వడం లేదు? రైతులు ఆత్మహత్యలు చేసుకోరాదనే పిలుపును ఎందుకు ఇవ్వడంలేదు? ఒక్క రైతు కూడా చనిపోడానికి వీలు లేదని చెప్పడమేగాక రైతుల సమస్యలకు ప్రత్యామ్నాయాన్ని ఎందుకు చూపించడంలేదు? రైతులతో చెలగాటమాడిన ప్రభుత్వాలు ఇప్పటివరకు బాగుపడిన చరిత్ర లేదు. ఇప్పుడు ఆ వరుసలో తెరాస కూడా చేరుతుందేమో!

srisailam projectశ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తిపైన రెండు రాష్ట్రాల మధ్య యుద్ధమే జరుగుతున్నది. గతంలో జారీ చేసిన జీవోలను ఇరు రాష్ట్రాల నేతలు వల్లె వేస్తున్నారు. కానీ సామాన్యులకు ఈ జీవోలతో అవసరమే లేదు. వారికి సమయానికి విద్యుత్ అందుతున్నదా లేదా అన్నదే వారి అవసరం. ప్రాజెక్టులో నీరు ఉంది కాబట్టి విద్యుత్ ఉత్పత్తికి తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. రాయలసీమ ప్రజల గురించో మరొక ప్రాంతం రైతుల గురించో తెలంగాణ ప్రభుత్వానికి పట్టడం లేదు. ఆ అవసరం లేదని కాస్సేపు అనుకున్నా… రానున్న వేసవి కాలంలో విద్యుత్ కొరత మరింత తీవ్రమవ్వడం ఖాయం. అప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేయాలనుకున్నా శ్రీశైలం రిజర్వాయర్లో నీరు కూడా ఉండదు. మరి తెలంగాణ ప్రభుత్వం ఆ సమస్య నుంచి ఎలా గట్టెక్కుతుంది. మరో ప్రత్యామ్నాయం ఏముంది? సౌర విద్యుత్ కూడా అప్పటికి వినియోగంలోకి వచ్చే అవకాశం లేదు. మరి తెలంగాణ ప్రభుత్వం జీవోల సంగతిని పక్కన పెట్టినా విద్యుత్ అవసరాలను ఎలా సమకూర్చుకుంటుంది. చత్తీస్ గఢ్ నుంచి లైన్లు వేయడానికి కూడా కనీసంగా రెండేళ్ళ పడుతుంది. మరో రకంగా సమకూర్చుకునే మార్గం కూడా లేదు. అప్పుడు రైతుల ఆత్మహత్యల నివారణకు తెలంగాణ ప్రభుత్వం ముందు వున్న మార్గమేది?

chandrababu -2తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా వారి సంక్షేమం కోసం కృషి చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్న చంద్రబాబునాయుడు ఇప్పుడు తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు కూడా తెలుగువారే కాబట్టి వాటిని నివారించడానికో లేక వారి ఆత్మహత్యలకు ఒక ప్రధాన కారణంగా ఉన్న విద్యుత్ సంక్షోభానికి ఒక మేరకైనా పరిష్కారాన్ని కనుగొనడానికి, సాయం చేయడానికి ఎందుకు ముందుకు రావడం లేదు. శ్రీశైలంలో రోజుకు సగటున 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంటేనే తెలంగాణ రైతుల అవసరాలు తీరకపోతూ ఉంటే 300 మెగావాట్లు ఇస్తానని ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతూ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఇవ్వాల్సిన విద్యుత్ ను ఎంధుకు ఇవ్వడంలేదు? దిగువ సీలేరు నుంచి తెలంగాణకు ఇవ్వాల్సిన వాటాను ఇవ్వవచ్చు గదా! కృష్ణపట్నంలో వెంటనే కమిషనింగ్ చేయించి మరికొంత విద్యుత్ ను ఇవ్వవచ్చు గదా! ఇవేవీ చేయకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడం ద్వారా ప్రయోజనం ఏముంటుంది. పత్రికల్లో ప్రధాన శీర్షికలకు ఎక్కవచ్చునేమోగానీ సమస్యకు పరిష్కారం కనుగొనడానికి రైతులకు ప్రయోజనం కలిగించడానికి ఈ రెండు పార్టీల మధ్య లేదా రెండు ప్రభుత్వాల మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల సామాన్యుడికి ఒరిగిందేమీ లేదు. కేంద్రంతో సఖ్యతగా ఉండి పనులు చేయించుకుంటున్నామని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు తెలంగాణలో ఉన్నది కూడా తెలుగు ప్రజలే కాబట్టి వారి తరఫున కూడా కేంద్రం నుంచి ఎంతో కొంత సాయం అందేలా చేయవచ్చు గదా (కేసీఆర్ కు ముందు చూపు లేదని, కేంద్రంతో లాబీయింగ్ జరపడం లేదని, తెలంగాణలో ఉన్న సమస్యలను కేంద్రానికి చెప్పడం లేదని విమర్శిస్తున్నారు కాబట్టి…). నిజంగా తెలుగు ప్రజల సంక్షేమం కోరుకునే వ్యక్తే అయితే పరిపాలనా దక్షుడిగా చెప్పుకుంటున్న (తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నానంటూ పదేపదే చెప్పుకుంటున్నారు కాబట్టి) సమస్యలు మరింత సంక్లిష్టంగా మారకుండా వ్యవహరించవచ్చు గదా!

farmers 1ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా సామాన్యుల గురించీ, రైతుల గురించి పట్టించుకోరనేది చారిత్రక సత్యం. రైతుల్లోని వెనకబాటుతనం, సంఘటిత శక్తి లేకపోవడం, తిరగబడే చైతన్యం లేకపోవడం… ఇవన్నీ ఉండబట్టే ప్రభుత్వాలను, పాలకులను నిలదీయలేకపోతున్నాడు. శిక్షించాల్సిన పార్టీలను, ప్రభుత్వాలను కాదని తనకు తాను శిక్ష వేసుకుంటున్నాడు. తెలంగాణలో సుమారు 68% జనాభా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నా ఇప్పుడు ప్రభుత్వం ప్రతిపక్షాలను దుమ్మెత్తిపోయడం, తిట్ల దండకాన్ని వల్లించడం తదితరాలకు వెచ్చించే సమయాన్ని రైతుల సంక్షేమం కోసం, వారు ఎధుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలను వెదకడం కోసం వెచ్చిస్తే ప్రయోజనం ఉంటుంది. పాలకులు ఒకరినొకరు తిట్టుకోవడం ద్వారా పరిష్కారం దొరుకుతుందనుకుంటే ఎంచక్కా ఆ కార్యాచరణను కొనసాగించవచ్చు. పరిశ్రమలకు రెండు రోజుల పవర్ హాలీడే ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం తమ మంత్రుల, అధికారుల నివాసాల్లో, కార్యాలయాల్లో వృథా అవుతున్న విద్యుత్ ను ఆదా చేసి రైతులకు మళ్ళించవచ్చుగదా. ఎయిర్ కండిషనర్లను ఆపివేయవచ్చుగదా! కార్పొరేట్ సంస్థలు, వాణిజ్య సంస్థలు ప్రకటనల కోసం హోర్డింగ్ లు, రంగురంగుల కాంతుల కోసం ఖర్చు చేసే విద్యుత్ పై ప్రభుత్వం ఆంక్షలు విధించవచ్చు గదా!

ట్రాన్స్ మిషన్ గ్రిడ్ లు లేవనీ, నిర్మాణానికి కనీసం రెండేళ్ళు పడుతుందనీ, సౌర విద్యుత్ ఇప్పుడే వినియోగంలోకి రావడం కష్టమనీ, ఆంధ్ర ప్రభుత్వం చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతూ తెలంగాణకు రావాల్సిన వాటాను ఇవ్వడంలేదనీ… ఇలా ఎన్ని కారణాలు చెప్పినా రైతుల సమస్యలకు పరిష్కారం దొరకదు. ఇప్పుడు కావాల్సింది పరిష్కారం తప్ప సంజాయిషీలు, వివరణలు కాదు. చేస్తున్న ప్రయత్నాలను శంకించడంలేదుగానీ ఫలితం ఏమిటన్నదే ఇక్కడ కీలకం. పొరుగు రాష్ట్రంతో ఘర్షణ పడడం ద్వారా ఉల్లంఘనలను సరిదిద్ది న్యాయంగా దక్కాల్సిన వాటాను తెప్పించుకోగలిగితే ఎవ్వరూ తప్పుపట్టరు. కానీ ఆ విధంగా వ్యవహరించడం ద్వారా ప్రయోజనం ఉండదన్న విషయం స్పష్టమే అయినప్పుడు ఈ రెండు రాష్ట్రాల పాలకులు ఎందుకు విమర్శలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం జరుగుతున్న ఈ పబ్లిసిటీ స్టంట్లో చివరకు బలిపశువులవుతున్నది మాత్రం సామాన్యులు, ముఖ్యంగా రైతులు.

powerతెలంగాణలో ఇంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే, ఇందుకు ప్రధాన కారణం విద్యుత్ సంక్షోభం అని తెలిసినా కేంద్రం ఎందుకు మౌనంగా ఉంటోంది? ఆయా రాష్ట్రాల నుంచి విజ్ఞప్తులు రాకపోతే కేంద్రం జోక్యం చేసుకోజాలదని తన బాధ్యత నుంచి ఎందుకు తప్పుకుంటోంది? పునర్ వ్యవస్థీకరణ చట్టం అమలులో ఉల్లంఘనలు జరుగుతున్నాయని స్వయంగా తెలంగాణ ప్రభుత్వం రాతపూర్వకంగా ఆంధ్రప్రభుత్వంపై ఫిర్యాదు చేసినా ఎందుకు ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోలేదు. ఈ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అయినప్పుడు ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోంది? పోలవరం ప్రాజెక్టు విషయంలో హడావిడిగా ఆర్డినెన్సును తెచ్చిన కేంద్ర ప్రభుత్వం చట్టం అమలులో ఎందుకు ఆ వేగాన్ని చూపించడంలేదు? అది అఖిల భారత సర్వీసు అధికారుల విభజనేగానీ, రాష్ట్ర స్థాయి కేడర్ విభజనేగానీ, ఇప్పుడు వివాదంగా మారిన విద్యుత్ సరఫరా కేటాయింపులేగానీ కేంద్రం తన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించాల్సిన సమయం ఆసన్నమైంది. దురదృష్టమేమంటే ప్రజల సమస్యలపై స్పందించి పరిష్కారం కోసం ఒత్తిడి తీసుకురావాల్సిన పార్టీలు రాజకీయ ప్రయోజనం కోసం విమర్శలకు, పత్రికా ప్రకటనలకు పరిమితమవుతున్నారు తప్ప పరిష్కారానికి చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నాలు లేవు. చివరకు బీజేపీ సైతం కేంద్రంపై (అక్కడ కూడా ఉన్నది బీజేపీయే) ఒత్తిడి తీసుకురావడానికో లాబీయింగ్ కో ప్రయత్నం చేయకుండా తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలకే పరిమితమవుతున్నది.

ఈ రాజకీయ సమరం ఎఫ్పుడు ముగుస్తుందో రైతుల ఆత్మహత్యలు ఎప్పుడు ఆగిపోతాయో అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.