రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం

Telangana-bill-in-rajyasabha

రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందింది. బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు. ఓటింగ్ జరపాలని విపక్ష నేతలు పట్టుబడినప్పటికీ, డిప్యూటీ స్పీకర్ కురియన్ మూజువాణి ఓటుకే మొగ్గుచూపారు.

ఈ సందర్భంగా సభలో ఎవరెవరు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం…

రాజ్యసభలో బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు రాష్ట్ర విభజనపై చర్చను ప్రారంభించారు. ఒకవైపు ఆయన ప్రసంగం కొనసాగుతుండగా, మరోవైపు విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర, ఇతర రాష్ట్రాల ఎంపీలు నినాదాలు చేసారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని సభలో ఆయన ప్రకటించారు. అదే సమయంలో సీమాంధ్ర ప్రాంత సమస్యలను కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. భద్రత, ఉపాధి, విద్య సహా పలు అంశాలపై సీమాంధ్ర ప్రజల్లో ఆందోళన ఉందని వెంకయ్య నాయుడు చెప్పారు. అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకోవడంలో అభ్యంతరం లేదని ఆయన తెలిపారు.

తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఆయన మాట్లాడారు. ఆయన ప్రసంగంలో ముఖ్యాంశాలు.

* హైదరాబాదును కోల్పోతే సీమాంధ్ర ప్రాంతానికి ఆదాయం దారుణంగా తగ్గిపోతుంది.
* తెలంగాణ, రాయలసీమ రెండు ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి.
* ఉత్తరాంధ్ర, రాయలసీమకు పన్ను మినహాయింపులు కావాలి.
* సీమాంధ్రలో ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి.
* సీమాంధ్రలో పోర్టులు, విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలి.
* హైదారాబాదు లో మిగులుతున్న ఆదాయాన్ని మిగతా ప్రాంతాలకు పంపిణీ చేయాలి.
* హైదరాబాదుతో కూడిన తెలంగాణలో మాత్రమే మిగులు రెవెన్యూ ఉంది.
* విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి విమానాశ్రయాల స్థాయిని పెంచాలి.
* సీమాంధ్రలో ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పాలి.
* సీమాంధ్రకు 10 వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించాలి.
* ఉత్తర తెలంగాణ కూడా బాగా వెనుకబడి ఉంది.
* 2004 నుంచి తెలంగాణ విషయంలో కాంగ్రెస్ రాజకీయ లబ్దితో వ్యవహరిస్తోంది. టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
* హైదరాబాదుకు సమాంతరంగా సీమాంధ్రలో విద్యా సంస్థలు, పరిశ్రమలు నెలకొల్పాలి.
* కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు, వారు పంపిన కాగితాలకు పొంతన లేదు.
* హైదరాబాదులో అందరికీ నివసించే హక్కు ఉంది.
* బీజేపీపై కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒకలా, సీమాంధ్రలో మరోలా ప్రచారం చేస్తోంది.

తాను మొదటి సారి సభలో మాట్లాడుతున్నానని అందువల్ల సభ్యులందరూ సహకరించాలని చిరంజీవి కోరారు. రాష్ట్ర విభజన బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ వాదిగా ఉంటూ సొంత పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం బాధాకరంగా ఉందని చెప్పారు. విభజన విషయంలో పార్టీ అనుసరించిన విధానం బాధాకరమని అన్నారు. విభజన అనేది 11 కోట్ల మంది గుండె కోతకు సంబంధించిన అంశమని తెలిపారు. వ్యక్తిగతంగా తాను సమైక్యవాదినైనా, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. లోక్ సభలో బిల్లుపై చర్చలో ఎవరికీ అవకాశం ఇవ్వకపోవడం బాధాకరమని రాజ్యసభలోనైనా సీమాంధ్రులకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు.

రాజ్యసభలో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి ప్రసంగించారు. మాయావతి ప్రసంగించే సమయంలో తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు డెరిక్ ఒబ్రిన్ అడ్డుతగిలారు. మాయా ప్రసంగిస్తోంటే ‘నో నో’ అంటూ తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం తెలుపుతూనే ఉన్నారు. గందరగోళం మధ్యే మాయావతి తన ప్రసంగాన్ని కొనసాగించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం సంతోషకరమని మాయావతి చెప్పారు. బీహర్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను విభజించినప్పుడు ఏర్పడిన సమస్యలు సమసిపోయాయని మాయా తెలిపారు. సీమాంధ్ర ప్రాంతంతో పాటు తెలంగాణకు కూడా ప్యాకేజీ ఇవ్వాలని మాయా డిమాండ్ చేశారు. హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా ప్రకటించడం సరైంది కాదని ఆమె అన్నారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని డాక్టర్ అంబేద్కర్ చెప్పిన విషయాన్ని మాయావతి గుర్తుచేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నామని సీపీఎం నేత సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. రాజ్యసభలో టీ.బిల్లుపై చర్చ వాడివేడిగా సాగుతున్నా సందర్భంగా ఆయన ప్రసంగించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి తాను కూడా బాధ్యుడినే అని చెప్పారు. ఉద్యమాలు, త్యాగాల ఫలితంగానే భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయిని చెప్పారు. తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని తెలిపారు. దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే గురజాడ సూక్తిని సభలో ప్రస్తావించారు. విభజన వల్ల దేశంలో అనేక సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. ప్రత్యేకాంధ్రం ఉద్యమం వల్ల తాను రెండేళ్ల చదువు కోల్పోయానని చెప్పారు. విభజన విషయంలో సీపీఎం వైఖరి మారిందన్న వెంకయ్యనాయుడి వ్యాఖ్యలు అవాస్తవమని చెప్పారు. దీనికి తోడు రాష్ట్ర విభజనకు అన్ని పార్టీలు అంగీకారం తెలిపాయన్న వెంకయ్య మాటలను కూడా ఆయన ఖండించారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని సమాజ్ వాదీ సభ్యుడు రాం గోపాల్ యాదవ్ చెప్పారు. రాజ్యసభలో విభజన బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన యాదవ్, విభజన పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు పెంచారన్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ రాష్టాల విభజనను వ్యతిరేకించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

అసెంబ్లీ నిర్ణయాన్ని పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో ముందుకు వెళ్లడాన్ని డీఎంకే ఖండిస్తోందని ఆ పార్టీ ఎంపీ కనిమోళి (కరుణానిధి కుమార్తె) స్పష్టం చేశారు. ఈ విధంగా ప్రవర్తించడం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధమని చెప్పారు. విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ తాము వాకౌట్ చేస్తున్నామని చెప్పారు. అనంతరం డీఎంకే సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు.

భారతీయ జనతాపార్టీ అధికార ప్రతినిధి, మహారాష్ట్రకి చెందిన బీజేపీ సభ్యుడు ఫ్రకాశ్ జవదేకర్ సభలో ప్రసంగించారు. సభలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అశాంతికి కారణం కాంగ్రెస్ పార్టీనేనని జవదేకర్ స్పష్టం చేశారు. సీమాంధ్రకు న్యాయం చేస్తూ తెలంగాణ ఏర్పాటు చేయాలనేది బీజేపీ విధానమని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, సీమాంధ్రకు న్యాయం అనేవి పరస్పర విరుద్ధమైనవి కావని ఆయన తేల్చి చెప్పారు. హైదరాబాదు తెలంగాణదేనని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాదును యూటీ చేయమని చిరంజీవి అంటున్నారని, కానీ పదేళ్ల వరకు మాత్రమే హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని ఆయన చెప్పారు. అయితే, సీమాంధ్రకు సంపూర్ణ న్యాయం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

తెలంగాణ బిల్లుకు తాను సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నానని తెలంగాణ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణవారికి చాలా అన్యాయం జరిగిందని తెలిపారు. విద్య, నీరు, ఉద్యోగాల విషయంలో తెలంగాణ వివక్షకు గురైందని అన్నారు. తెలంగాణలో నివసించే సీమాంధ్రులకు రక్షణగా మేము ఉంటామని హామీ ఇచ్చారు. ఎన్డీఏ ఏర్పాటు చేసిన మూడు రాష్ట్రాలు చాలా చిన్నవని.. వాటితో తెలంగాణ ఏర్పాటును పోల్చలేమని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన టీడీపీ సభ్యురాలు గుండు సుధారాణి రాజ్యసభలో ప్రసంగించారు. తాను తెలంగాణ బిడ్డనంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన గుండు సుధారాణి విభజన బిల్లుకు తాను సంపూర్ణ మద్దతునిస్తున్నట్లు చెప్పారు. విభజన బిల్లు తెచ్చిన కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆమె చెప్పారు. రాష్ట్ర విభజన అనంతరం ఎక్కడి ఉద్యోగులు అక్కడే ఉండాలనే క్లాజు సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. అవసరమైతే ప్రత్యేక ఉద్యోగాలు సృష్టించి అయినా ఉద్యోగులను బదలాయించాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంతానికి న్యాయం చేసేందుకు స్థానికత ఆధారంగా ఫించన్లు ఇవ్వాలని ఆమె కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరవధిక నిరాహార దీక్ష చేసి, తాను జైలుకెళ్లిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. గుండు సుధారాణి తన ప్రసంగాన్ని ‘జై తెలంగాణ’ అంటూ ముగించారు.

రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై జరిగిన చర్చలో బీజేపీ ఎంపీ అరుణ్ జైట్లీ కొన్ని ప్రశ్నలను సభ ముందుంచారు. అనంతరం కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ సభలో మాట్లాడారు. గవర్నర్ కు అధికారాల అప్పగింతపై అరుణ్ జైట్లీ కొన్ని సందేహాలు లేవనెత్తారని ఆయన చెప్పారు. రాజ్యాంగంలోని 3, 4 అధికరణలు అరుణ్ జైట్లీ సందేహాలను నివృత్తి చేస్తాయని ఆయన తెలిపారు. గవర్నర్ అదనపు బాధ్యతలు నిర్వర్తించడానికి రాజ్యాంగం అనుమతించిందని ఆయన చెప్పారు. గవర్నర్ కు అదనపు అధికారాలు కాదు.. అదనపు బాధ్యతలు మాత్రమే అప్పజెప్పామని కపిల్ సిబాల్ చెప్పారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.