చత్తీస్ గఢ్ విద్యుత్ ఎన్ టిపిసి ద్వారా తెలంగాణకు వెంటనే తెచ్చుకోవచ్చు : జగన్ సూచన

 

హైదరాబాద్, నవంబర్ 4: తెలంగాణ ప్రభుత్వం చత్తీస్ గఢ్ తో ఒప్పందం చేసుకున్న 1000 మెగావాట్ల విద్యుత్ ను రామగుండంకు సరఫరాచేసి తద్వారా అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ ను తెచ్చుకొనే విధంగా కృషిచేయాలని  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి  ముఖ్యమంత్రి కేసీఆర్ కు సూచించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో దాదాపు 20 మిలియన్ల యూనిట్ల విద్యుత్ కొరత ఉందని జగన్ పేర్కొన్నారు. విద్యుత్ సంక్షోభంతో తెలంగాణ రైతాంగం ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి తో వెయ్యి మెగావాట్ల విద్యుత్ పరస్పర అవాగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నా, అక్కడి నుంచి రాష్ట్రానికి విద్యుత్ రావాలంటే సుమారు రెండు సంవత్సరాలు పట్టవచ్చని, దీంతో రైతులకు మేలు జరగకపోవచ్చని జగన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

 

mou-kcr-chattishgarh2600 మెగావాట్ల విద్యుత్ సామర్ధ్యం కలిగిన రామగుండం ఎన్ టి పిసిలో సుమారు 75 శాతం కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు విద్యుత్ కేటాయింపులు చేస్తుందని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు ఎన్ టిపిసి నుంచి సరఫరా అవుతున్న విద్యుత్ ను చత్తీస్ గఢ్ నుంచి పంపిణి చేసే విధంగా కేంద్ర ప్రభుత్వంతో చర్చించాల్సిందని ఆయన కోరారు. దీనివల్ల చత్తీస్ గఢ్ నుంచి తెలంగాణకు కొత్తగా వేయాల్సిన విద్యుత్ లైన్ల సమస్యతోపాటు తక్షణ పరిష్కారం లభిస్తుందని జగన్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

శ్రీశైలంలో రిజర్వాయర్ లో 885 అడుగల నీరు నిల్వ ఉన్నప్పుడు రాయలసీమ గురించి ఆలోచన చేయలేని చంద్రబాబు నాయుడు ఇప్పుడు రిజర్వాయర్ నీటి మట్టం తగ్గితే రాయలసీమ వాసులకు గొంతెండిపోతుందని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యుత్ ఉత్పత్తి చేయడం మూలానా శ్రీశైలం జలాశయం 885 అడుగుల నీటి నిల్వ కాస్తా 858 అడుగుల వరకు చేరుకుంది.  ఇటు వ్యవసాయానికి వాడుకొన్నా, అటు విద్యుత్ ఉత్పత్తి చేసినా 854 అడుగులకు చేరుకోవాలంటే కనీసం మూడు నెలల సమయం పడుతుందన్నారు. కాని 15 రోజల్లోనే శ్రీశైలంలో ఉన్న 885 అడుగుల నీటి నిల్వను 858 అడుగులకు తీసుకొచ్చారని పేర్కొన్నారు. శ్రీశైలం రిజర్వాయర్ లో 854 అడుగుల వరకు నీరు నిల్వ ఉంటే తప్పా రాయలసీమకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇది వాస్తవం అని తెలిసినా, వాస్తవాలతో సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు తన ఇష్టం వచ్చిన రీతిలో నీటి వాడుకున్నారని జగన్ ఆరోపించారు. శ్రీశైలం జలాశయంలో 858 అడుగులకు నీటి నిల్వ చేరుకున్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ ఉత్పత్తి ఆపుచేసి, తెలంగాణ కూడా విద్యుత్ ఉత్పత్తిని నిలుపుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పై దాడికి  దిగడం విడ్డూరంగా ఉందని జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.