రాష్ట్ర విభజన ఆషామాషీ వ్యవహారం కాదు: జూలకంటి

Julakanti-ranga-reddy

మొదటి నుండి సమైక్యవాదాన్ని మాత్రమే వినిపిస్తున్న సీపీఎం ఇప్పుడు అసెంబ్లీలో కూడా సమైక్యానికే మద్దతు పలుకుతుంది. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన వ్యవహారం ఆషామాషీది కాదని.. దీనిపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి సూచించారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయకపోతే ఆర్థిక పరిస్థితి తారుమారై అసమానతలు తలెత్తుతాయని గతంలో కమ్యూనిస్టు నేతలు గుర్తు చేశారని జూలకంటి అన్నారు. తమ పార్టీ జాతీయస్థాయిలో తీసుకున్న నిర్ణయం కారణంగానే తాము సమైక్యానికి మద్దతు పలుకుతున్నామన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు తలెత్తిన పరిస్థితికి కారణం రాజకీయ పార్టీల తీరుతెన్నులేనని ఆయన ఆరోపించారు.

అధికారంలోకి రావడానికి ఓట్ల పథకాలు, అధికారంలోకి వచ్చాక సంపాదకోసం కోట్ల పథకాలు అనే అందరూ ఆలోచిస్తున్నారు తప్ప, ప్రజలు సమగ్రంగా అభివృద్ధి చెందడం గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? అని జూలకంటి ప్రశ్నించారు. 1969లో తెలంగాణ ఉద్యమం వచ్చి 400 మంది పోయారు. 1972లో అన్యాయం జరుగుతోందంటూ జై ఆంధ్ర ఉద్యమం వచ్చింది. అప్పుడైనా గతంలో జరిగిన ఒప్పందాలు అమలు జరిగి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదని ఆయన అన్నారు. ఉద్యమాలు తలెత్తిన ప్రతిసారీ ఏదో ఒకటి చెప్పి వాయిదా వేయడం తప్పితే, పరిష్కారం చేయలేదని ఆయన ఆరోపించారు. ఇకనైనా అలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆయన సూచించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.