రుణమాఫీకి జీవో

హైదరాబాద్ : రుణమాఫీ పథకంలో భాగంగా దాదాపు 36 లక్షల మంది రైతులకు సుమారు రూ. 17 వేల కోట్ల రుణాలు మాఫీ కానున్నది. దీంట్లో భాగంగా తొలి విడతగా 25 శాతం నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. రూ. 4,250 కోట్ల మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించేందుకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కొత్త రుణాల మంజూరుకు మార్గం సుగమం చేసింది. రుణమాఫీపై ఉప ముఖ్యమంత్రి టీ రాజయ్య, మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఈటెల రాజేందర్, హరీశ్‌రావు, మహేందర్‌రెడ్డిలతో ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉపసంఘం తన నివేదికను సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రికి అందజేసింది. వెంటనే ఈ నివేదికను కేసీఆర్ ఆమోదించారు. తక్షణమే తొలి విడత నిధుల విడుదలకు జీవో జారీ చేయాలని ఆర్థిక శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. దీంతో ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు పేరుతో సంబంధిత ఉత్తర్వులు జారీ అయినట్లు మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రతీ రైతు తీసుకున్న రుణంలో తొలివిడతగా 25 శాతం మొత్తాన్ని బ్యాంకులకు చెల్లిస్తామని, మిగిలిన 75 శాతం నిధులను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రులు వెల్లడించారు. ఇందుకు బ్యాంకులు కూడా అంగీకరించాయని మంత్రి తెలిపారు. దీనిపై మంగళవారం మధ్యాహ్నం బ్యాంకర్లతో మరో సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజా శ్రేయస్సే ముఖ్యమని భావించడం వల్లే ప్రభుత్వానికి భారమైనప్పటికీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వాణిజ్య పంటలు వేసిన రైతులకూ మాఫీ వర్తిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్, మహేందర్‌రెడ్డి, ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే సత్యనారాయణ, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.