రెండు ఛానళ్ళు – ఒక సీ.ఎం.

హైదరాబాద్ : ప్రజాస్వామ్య సౌధాన్ని సుస్థిరంగా నిలిపి ఉంచే నాలుగు స్తంభాలూ స్థాయిలో, ప్రాముఖ్యంలో సరిసమానమైనవి. ఏ ఒక్క స్తంభం ఎత్తు పెరిగినా లేదా తగ్గినా సౌధం యావత్తూ ఏదో ఒక వైపునకు ఒరిగిపోతుంది. చివరికి కూలిపోతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలాధారమైన రాజ్యాంగం నిర్మాణంలోని ఈ సూక్ష్మాన్ని గ్రహించలేకపోయినా, అందలి అంత:స్సూత్రాన్ని విస్మరించినా అసలుకే మోసం వస్తుంది. ఒకానొక అద్భుతమైన వ్యవస్థను అవివేకంగా కాలదన్నినట్టు అవుతుంది.

తెలంగాణ ముఖ్యమంత్రికి, రెండు తెలుగు టీవీ ఛానళ్ళ (టీవీ9, ఏబీఎన్) యాజమాన్యాలకీ మధ్య కొంతకాలంగా సాగుతున్న సంవాదం ఇరుపక్షాలవారూ స్వీయపరిమితులు తెలుసుకొని సంయమనం పాటించడంలో విఫలమైన కారణంగా సంభవించిన అవాంఛనీయమైన పరిణామం. కొత్త రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో సతమతం అవుతున్న తరుణంలో సమస్యలపైన దృష్టి కేంద్రీకరించి, పరిష్కార మార్గాలను అన్వేషించవలసిన రెండు వ్యవస్థలూ పరస్పర నిందారోపణలతో కలహానికి కాలుదువ్వి రచ్చకెక్కడం, ఢిల్లీ నుంచి తెలంగాణ పట్టణాల వరకూ ఆందోళనలు నిర్వహించడం, సమస్యను మరింత జటిలం చేసుకొని పీటముడి వేసుకోవడం అత్యంత గర్హనీయం. రెండు ఛానళ్ళ ప్రసారాలనూ నిలిపివేయడంలో ప్రభుత్వం ప్రమేయం సుతారామూ లేదనీ, ఇది కేబులో ఆపరేటర్లు తీసుకున్న నిర్ణయమనీ ఇంతకాలం వాదిస్తూ వచ్చిన ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు (కేసీఆర్) కాళోజీ శతజయంతి ఉత్సవం సందర్భంగా వరంగల్లు సభలో ఆవేశం అవధులు మీరి, మాటలు హద్దు మీరడం ద్వారా తన వాదనలో పస లేదని స్వయంగా నిరూపించారు. కాళన్న కవిత్వ పాదాలను ఉటంకిస్తూ అదే ధోరణిలో మాట్లాడటం, రెండు మీడియా సంస్థలనూ బహిరంగంగా హెచ్చరించడం, పరుషంగా మాట్లాడటం మెదక్ ఉప ఎన్నికలలో తెలంగాణవాదంతో ఓటర్లను మెప్పించడానికి పనికి రావచ్చునేమో కానీ జాతీయ స్థాయిలో అప్రదిష్ఠపాలుకావడానికీ, ప్రత్యర్థులకు ప్రచారాధిక్యం లభించడానికీ దారితీసింది.

వివాదంలో చిక్కుకున్న రెండు ఛానళ్ళలో ఒకటి చేసిన తప్పుకు క్షమాపణ చెప్పింది. రెండో ఛానల్ చేసిన తప్పేమిటో చెప్పమంటోంది. దారితప్పిన మీడియా సంస్థలను హెచ్చరించడానికి, దారిలో పెట్టడానికి రాజ్యాంగబద్ధమైన సంస్థలు దేశంలో ఉన్నాయి. ఘర్షణ పడవలసిన అవసరం లేదు. ఆత్మవిశ్వాసం వ్యక్తులకైనా, వ్యవస్థలకైనా అవసరమే. అది హద్దుమీరి అహంకారంగా పరిణమిస్తే పతనం ప్రారంభమవుతుంది. ఇది ప్రభుత్వాధినేతలకూ, మీడియా సంస్థల అధిపతులకూ సమానంగా వర్తిస్తుంది. ఈ అప్రజాస్వామిక ధోరణి ప్రదర్శిస్తున్నది ఒక్క తెలంగాణ ప్రభుత్వం మాత్రమే కాదు. సాక్షీ మీడియా సంస్థల విలేఖరులకు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో సంవత్సర కాలంగా ప్రవేశం లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నివాసంలో అధికార కార్యక్రమాలకు హాజరు కావడానికి అనుమతి లేదు. విమర్శను సహించలేక, ఆవేశానికిలోనై అధికార దుర్వినియోగానికి పాల్పడిన ప్రభుత్వాలు భంగపడిన సందర్భాలు అరవై ఏడేళ్ళ ప్రజాస్వామ్య భారత చరిత్రలోనే అనేకం చూశాం. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వార్తలూ, వ్యాఖ్యలూ ప్రచురించి, ప్రసారం చేసిన మీడియా సంస్థలు మట్టికరవడం కూడా గమనించాం. ప్రతివాదులకు గుబులు రేకెత్తించడానికీ, వారి ఆత్మస్థయిర్యాన్ని దెబ్బదీయడానికీ పదునైన భాషను ప్రయోగించడంలో కేసీఆర్ ఆరితేరిన రాజకీయ ధురంధరుడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వార్తావితరణలో కొన్ని వర్గాలకు మోదం మరికొన్ని వర్గాలకు ఖేదం కలిగించిన వివాదాస్పద మీడియా సంస్థల గురించి సైతం అందరికీ తెలుసు. పత్రికలలో అచ్చయిన ప్రతి అక్షరాన్నీ, టీవీలో వినిపించిన ప్రతి మాటనూ పాఠకులూ, వీక్షకులూ విధిగా విశ్వసిస్తారనుకోవడం పొరబాటు. రాజకీయ నాయకులు చెప్పే సూక్తిముక్తావళిని కూడా ఒక చెవిన విని మరో చెవిన విడిచిపెట్టడం ప్రజలు అలవాటు చేసుకున్నారు. కనుక ప్రజల మనోభావాలను తాము మాత్రమే ప్రభావితం చేయగలమని రాజకీయ నాయకులు అనుకున్నా, మీడియా నిర్వాహకులు అనుకున్నా అది ఆత్మవంచనే. ప్రజల వివేకాన్ని తక్కువగా, తప్పుగా అంచనావేయడమే. ప్రజల అనుభవానికి విరుద్ధంగా వెలువరించే వార్తలనూ, చేసే వ్యాఖ్యలనూ ప్రజలు స్వీకరించబోరని గ్రహించాలి. ఉద్యమ సందర్భంలో వినియోగించిన భాష అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రికి నప్పదని కేసీఆర్ తెలుసుకోవాలి. కవి నిరంకుశుడు కనుక కాళోజీ ఏమి రాసినా చెల్లింది. ఒక ముఖ్యమంత్రి దురుసుగా మాట్లాడటం, ఆవేశంతో ఊగిపోవడం, నిరంకుశుడుగా ముద్రవేసుకోవడం ముమ్మాటికీ ఆక్షేపణీయం. వాస్తవాలతో రాజీపడకుండా పాత ధోరణులనే కొనసాగించాలనుకోవడం నిష్ప్రయోజనమని మీడియా సంస్థల అధినేతలూ గుర్తించాలి. పరోక్ష ప్రయోజనాలకోసం మీడియాను వినియోగించడాన్ని ప్రజలు హర్షించరు. అంతిమంగా రాజకీయ పక్షాన్ని కానీ మీడియా సంస్థను కానీ ఆదరించవలసింది ప్రజలే. వారి ఆమోదంపైనే రాజకీయ పార్టీల, మీడియా సంస్థల మనుగడ ఆధారపడి ఉంటుంది. ఎదిగినకొద్దీ ఒదిగి ఉండాలన్న హితోక్తిని అందరికీ శిరోధార్యం కావాలి. మీడియా అధిపతులు ఎంఎస్ ఓలతో చర్చలు జరిపి సమస్య పరిష్కరించుకోవాలి. ఫలానా టీవీ ఛానల్ ను చూడాలా మానాలా అని నిర్ణయించుకునే అధికారం వీక్షకులకు మాత్రమే ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఉన్న పరిమితులను అందరూ పాటించినప్పుడే రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛకు భంగం కలుగకుండా ఉంటుంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.